జన్మభూమి సమన్వయ కమిటీలు
కాకినాడ సిటీ : జిల్లాలో ఈనెల 2 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, డివిజన్, పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్ స్థాయిల్లో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం ప్రకటించారు. జిల్లాస్థాయి కమిటీకి జిల్లా మంత్రులు అధ్యక్షులుగాను, కలెక్టర్, డ్వామా, డీఆర్‌డీఏ, మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, పశుసంవర్థకశాఖ జేడీ సభ్యులుగా ఉంటారని, జేడ్పీ సీఈఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. మండల స్థాయి కమిటీలో ఎంపీపీ, మున్సిపాల్టీ స్థాయిలో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్‌స్థాయి కమిటీలో మేయర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈనెల 2 నుంచి 20వ తేదీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇందులో పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ఐదు అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి రంపచోడవరం ఎంపీడీఓ టిఎస్.విశ్వనాద్ సామాజిక భద్రతా పింఛను పథకానికి ‘ఎన్‌టీఆర్ భరోసా’ పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ముఖ్యమంత్రి ఎంపీడీఓను అభినందించి పథకానికి ఆపేరును ప్రకటించారు. మరో మూడు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నిటినీ ఆన్‌లైన్ చేసేందుకు ఐటిని పూర్తిగా వినియోగించుకునే చర్యల్లో బాగంగా మొదటి దశ కింద జిల్లా అధికారులు మొదలు, ఎండీఓ, తహశీల్దార్ తదితర 10వేల మంది అధికారులకు టాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్‌లను అందించనున్నట్టు సీఎం వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ఆర్.ముత్యాలరాజు, డీఆర్వో బి.యాదగిరి, జెడ్పీసీఈవో ఎంఎస్ భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.