రామగుండం బల్దియా కార్యాలయం
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీతో మొదలైన ఓట్ల జాతర ఆరు నెలలుగా కొనసాగుతునే ఉంది. సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ పోలింగ్, కౌంటింగ్ సైతం ముగిసింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు ఎన్నికల్లో పోటీకి దిగాయి. ప్రాదేశిక ఫలితాల్లో కారు హవా కనిపించింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు టీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. మంథని మాత్రం కాంగ్రెస్ ఖాతాలో కొనసాగుతుంది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇకమిగిలిన మున్సిపాలిటీ గురించి రాజకీయ సమీకరణలకు అధికారపార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెరతీశాయి.
నాలుగు మున్సిపాలిటీలు
జిల్లాలోని రామగుండం మున్సిపల్‌కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో పట్టణాలు, నగరాల్లోపాగా వేసేందుకు ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయిననా ఎన్నికల కోసం ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పట్టణాల పైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిన్నటి రాజకీయ బలాబలాలు పరిశీలిస్తే రామగుండంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్ మేయర్ రాజమణి కొనసాగుతున్నారు. పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య ఉన్నారు. మంథనిలో నిన్నటివరకు పుట్టమధు భార్య పుట్ట శైలజ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు.
మున్సిపాలిటీ ఏర్పాటుతో మంథనిలో ఎన్నికలు నిలిచిపోయాయి. సుల్తానాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన కాలంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో నాలుగుచోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఖరారుపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొ స్థానంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నాయకుల పేర్లను పరిశీలనకు తీసుకుని వారికి సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక బలాలపై లెక్కలు కడుతున్నారు.
వార్డుల విభజనకు కసరత్తు
మున్సిపల్‌వార్డుల విభజన, రిజర్వేషన్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందడమే తరువాయిగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మున్సిపల్ అధికారులు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి నగరపంచాయతీ నుంచి పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ఏడాది క్రితమే అవతరించింది. 29,604 ఓటర్లు, 41,171 జనాభా కలిగిన పెద్దపల్లిలో రంగంపల్లి, బందంపల్లి, చందపల్లి గ్రామాలను ఏడాదిక్రితం ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్‌లో సైతం సమీప గ్రామాలను విలీనం చేశారు. ఇక్కడ కూడా డివిజన్ల సంఖ్య పెరుగనుంది.
కొత్త చట్టంపై సందిగ్ధం
మున్సిపాలిటీల గడువు జూన్ మొదటివారంతో ముగుస్తుంది. ఇప్పటికే జిల్లాలో మంథని, సుల్తానాబాద్ స్పెషల్ ఆఫీసర్లపాలనలో ఉన్నాయి. ఇక పెద్దపల్లి, రామగుండంలో జూన్‌మొదటివారంతో మున్సిపాలిటీ పదవీకాలం ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విధానం ప్రత్యక్షమా.. పరోక్షమా.. మున్సిపల్ చట్టాల్లో చేయాల్సిన మార్పులపై తర్జనబర్జన పడుతున్నారు. దీంతో గడువులోగా ఎన్నికలు జరుగకపోవచ్చని అంటున్నారు. మున్సిపల్ గడువు ముగిసి స్పెషల్ ఆఫీసర్ల చేతిలో మరో మూడు, నాలుగు నెలలు పాలన ఉండవచ్చని అప్పటిలోగా కొత్త చట్టాన్ని రూపొందించి దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు 20.. విభజనతో 34..
పెద్దపల్లిలోని మున్సిపాలిటీలో రోడ్లను, వీధులను బట్టి వార్డులను నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో 1300 ఓటర్లు, కొన్ని వార్డులో 1800 ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి అన్ని వార్డులకు సమాన ఓటర్లు సూత్రంగా వార్డులను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 1200ల నుంచి 800 ఓటర్లకు తగ్గించి వార్డులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లిలో ప్రస్తుతం 20 వార్డులు ఉండగా పెరిగిన ఓటర్లు.. పునర్విభజనతో సంఖ్య 34కు పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లనే కొనసాగించడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంతకు మించి డివిజన్‌ను పెంచే అవకాశం లేదంటున్నారు. సుల్తానాబాద్, మంథనిలో ప్రస్తుతం ఉన్న వార్డులను కొనసాగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment