
జనగామ: తెలంగాణలో ఎనిమిదికిపైగా ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జనగామలోని పలు పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భువనగిరి, నల్లగొండ, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, చేవెళ్లతో పాటు ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోనున్నట్లు తెలిపారు. సీట్ల సంఖ్య మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలు కావడం ఖాయమన్నారు. ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతాన్ని అప్పటికప్పుడే ప్రకటించిన ఈసీ.. తెలంగాణలో మాత్రం 26 గంటలు ఆలస్యం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలింగ్ వివరాలు చెప్పకుండా రాత్రికి రాత్రే పెంచేసుకోవడంతో ఓడిపోయే టీఆర్‌ఎస్ నేతలు సైతం భారీ మెజార్టీతో గెలుపొందారని ఆరోపించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో.. పోలింగ్ శాతం వివరాలను రాత్రి వరకే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తాను మెసేజ్ చేస్తానని, అలాగే రాష్ట్ర, జాతీయ పార్టీలు సైతం దీనిపై సీరియస్‌గా ఉన్నాయని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు 42 రోజుల సమయం ఉందని, పార్టీ శ్రేణులు స్ట్రాంగ్ రూంలపై ఓ కన్నేసి ఉంచాలని కోమటిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment