మోగిన నగారా
►ఈ నెల 7న జడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక
►6న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలకు..
►ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
►ఆ ‘ఏడు’ మండలాల జడ్పీటీసీలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు
►అక్కడ ఎంపీపీ ఎన్నిక కూడా లేనట్టే
►39 మండలాలకే ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్‌కు ఆదేశాలు
► కూనవరం, చింతూరు, వీఆర్‌పురం ఎన్నికల బాధ్యత తూర్పుగోదావరి కలెక్టర్‌కు అప్పగింత
►భద్రాచలం, బూర్గంపాడు ఎంపీపీలు పెండింగ్
►జడ్పీలో మారనున్న పార్టీల బలాబలాలు
►రిజర్వేషన్ యథాతథం
►రసకందాయంలో జిల్లా రాజకీయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఎట్టకేలకు జిల్లా, మండల పరిషత్‌ల పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన రెండున్నర నెలల తర్వాత జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 7న జడ్పీ పాలకవర్గానికి (జడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యులు), 6న జిల్లాలోని 39 మండల పరిషత్‌ల పాలకవర్గాలకు (ఎంపీపీ, వైస్‌చైర్మన్, కో- ఆప్షన్ సభ్యులు) ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ ఎన్నికల నుంచి పోలవరం ముంపు ప్రాంతం కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలాలను మినహాయించారు.
ఈ మండలాల జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో పాల్గొనే అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే జిల్లాలోని పూర్తి మండలాన్ని మాత్రమే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా పరిగణిస్తామని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఆ ఏడు మండలాల్లో కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా ఉభయగోదావరి జిల్లాల్లో కలిసినందున సెక్షన్ 178 ప్రకారం ఈ మండలాలను ఎన్నికల నుంచి మినహాయిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీపీ ఎన్నికల కోసం వెలువరించిన ఉత్తర్వుల్లో జిల్లాలోని 39 మండలాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది.
మిగిలిన ఏడు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక మిగిలిన వాటిలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కలిసినందున ఆయా మండల పరిషత్‌ల పాలకవర్గాలకు ఎన్నిక జరిపే బాధ్యతను ఆ జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పాక్షికంగా గోదావరి జిల్లాల్లో కలిసి మిగిలిన భాగం మన జిల్లాలో ఉండే భద్రాచలం, బూర్గంపాడు మండలాల పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారు.
కోర్టు కేసుల ఉపసంహరణ..
వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరినా, జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది మార్చి 10న నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితా లు మే 13న వెలువడ్డాయి. అనంతరం జూన్ 26న తెలంగాణ వ్యాప్తంగా జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక జరగగా, మన జిల్లాలో మాత్రం నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి, జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినందున జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికలకు మళ్లీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ విజయగాంధీ తదితరులు కోర్టును ఆశ్ర యించడంతో జూన్13న హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. ఆ తర్వాత కేసు ఉపసంహరించుకోవడంతో, మిగిలిన పిటిషన్లను కూడా జూలై 24న కోర్టు కొట్టివేసింది. దీంతో జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీల ఎన్నికకు మార్గం సుగమం అయింది.