సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార బలంతో టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. మునిసిపల్, జెడ్పీ, మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేందుకు ఆ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ప్రజలు ఒక రకంగా తీర్పు ఇస్తే.. వీరు మరో రకంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. బలం లేకపోయినా ‘స్థానిక’ పీఠాలను
కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు.
టీడీపీకి ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారిపై ఒత్తిడి తెస్తున్నారు. మాట వినకపోతే అక్రమ కేసులు పెట్టి.. పోలీస్‌స్టేషన్‌లో మక్కెలు ఇరగదీయిస్తాం అంటూ బెదిరిస్తున్నారు. చేసేదేమీలేక వారు చెప్పినట్లు చేయాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ సభ్యులు వాపోతున్నారు. జిల్లాలో మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాలో రెండు ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన 30 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 22 మండల పరిషత్‌లు, ఐదు మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధికంగా గెలిచారు. ప్రజాస్వామ్యబద్దంగా పూర్తి మెజారిటీ ఉన్న పార్టీకే జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ చైర్మన్ స్థానాలు దక్కుతాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో.. జిల్లాలో ఆ పార్టీ నాయకులు బరితెగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
బెదిరింపులు.. బలవంతపు చేరికలు..
ఎలాగైనా మునిసిపిల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని దాచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సభ్యులు పలువురు కనిపించకపోవడం ఈ విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. నందికొట్కూరుకు చెందిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను.. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం బలవంతంగా తీసుకెళ్లి టీడీపీ కండువా కప్పించారనే ఆరోపణలున్నాయి.
అదే విధంగా కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులను బెదిరించి తీసుకెళ్లినట్లు తెలిసింది. డోన్ నియోజకవర్గ పరిధిలో కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బలవంతంగా తీసుకెళ్లి.. టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. బలవంతం చేశామని ఎక్కడైనా చెబితే అంతుచూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం.
గూడూరు మునిసిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉంది. అయితే మాజీ ఎంపీపీ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీలో చేరి.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లను కొందరిని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి వరకు ఆ కౌన్సిలర్లు ఎక్కడ ఉండేది వారి బంధువులకు కూడా తెలియలేదు.
‘విప్’తో పదవి పోతుందన్నా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందని.. వ్యతిరేకంగా ఓటు వేస్తే తమ పదవి పోతుందని కొందరు సభ్యులు వాపోతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయమై టీడీపీ క్యాంప్‌లో ఉన్న కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు వారి బంధువుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా టీడీపీలో కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఒకరి ఇచ్చి.. ఇంకొకరికి ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందని టీడీపీ నేతలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ ప్రయోగం ఉపయోగిస్తున్నారు. రెండున్నరేళ్లు ఒకరికి.. మరో రెండున్నరేళ్లు ఇంకొకరికి అని ఒప్పిస్తున్నారు. అయితే కొందరు తమకే మొట్టమొదటి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారి కోసం.. ఆది నుంచి ఉన్న వారిని విస్మరించటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ్ముళ్ల దౌర్జన్యం
Published Thu, Jul 3 2014 12:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement