- ‘ఉపాధి’పై పర్యవేక్షణ కావాలంటున్న ఎంపీడీవోలు
- మాకొద్దంటున్న కార్యదర్శులు
మచిలీపట్నం : జిల్లాలో మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య ప్రచ్ఛన్నం యుద్ధం కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలను తమకు అప్పగించాలని ఎంపీడీవోలు ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని కోరడమే ఇందుకు కారణం. ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగిస్తే క్షేత్ర స్థాయిలో తమపై అదనపు భారం పడుతుందని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉపాధి హామీ పనులపై ఎంపీడీవోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు అలవెన్సుల రూపంలో అందే అవకాశం ఉంది. అందువల్లే ఎంపీడీవోలు ఉపాధి హామీ పనులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని పట్టుబడుతున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు.
కార్యదర్శులతో ఫీల్డ్ అసిస్టెంట్ పనులు!
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు నూతన ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించకూడదంటూ నోటీసులు కూడా జారీ చేసింది. మరికొందరికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించినా, ఆ పనులను పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తామని ఎంపీడీవోలు మంత్రికి వివరించారని సమాచారం. జిల్లాలో 156 పంచాయతీలకు కార్యదర్శులే లేరని ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. అసలే పనిభారం అధికంగా ఉండగా ఉపాధి హామీ పనులను తామెలా పర్యవేక్షించగలమని వారు ప్రశ్నిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తారా?
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పంచాయతీల్లో పనిభారం పెరిగింది. వంద రోజుల ప్రణాళిక అమలు, పంచాయతీలో రోజువారీ చేపట్టిన కార్యక్రమాలను వివిధ ఫార్మాట్లలో నివేదికలను కార్యదర్శులు పంపాల్సి వస్తోంది. వీటితోపాటు గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్రభుత్వం నుంచి అప్పటికప్పుడు వచ్చే ఉత్తర్వులను అమలు చేయటం తదితర పనులతో సతమతమవుతన్నామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబరు నాటికి ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు.
జిల్లాలో 516 క్లస్టర్ పంచాయతీలు ఉండగా, వీటిలో 156 క్లస్టర్ పంచాయతీలకు కార్యదర్శులే లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ బాధ్యతలు తమకు అప్పగిస్తే మరింత భారం పడుతుందని కార్యదర్శులు వాదిస్తున్నారు. ఎంపీడీవోలు తమ ప్రయోజనాల కోసం ఉపాధి హామీ పనులపై పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నా, క్షేత్రస్థాయిలో ఈ పనులను చేయించే బాధ్యతలను తమకు అప్పగిస్తారని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఏమైనా అవకతవకలు జరిగితే తమను బాధ్యులు చేస్తారని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
టీఏ, డీఏలు ఇవ్వటం లేదు
ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వహిస్తుండగా టీఏ, డీఏ బిల్లులు ఇవ్వడంలేదని తెలుస్తోంది. తమకు ఇవ్వాల్సిన టీఏ, డీఏ బిల్లులు పక్కదారి పడుతున్నాయని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. 010 పద్దు ద్వారా పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందుతుండటంతో తమకు రావాల్సిన టీఏ, డీఏ బిల్లులు ఏమవుతున్నాయో అర్థం కావటం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నామని, ఉపాధి హామీ పనులను తమకు అప్పగించకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.