జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ | Reorganization of Zilla Parishad | Sakshi
Sakshi News home page

జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

Published Sun, Jun 30 2019 3:00 AM | Last Updated on Sun, Jun 30 2019 3:00 AM

Reorganization of Zilla Parishad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్‌ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్‌లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్‌లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్‌లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్‌ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్‌ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు.  

పని ఒత్తిడి ప్రాతిపదికన... 
కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్‌ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్‌)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్‌లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్‌ టు సర్వ్‌ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్‌/మల్టీ జోనల్‌ కేడర్‌లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు.  

సిబ్బంది విభజన... 
మునుపటి జెడ్పీపీ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్‌లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు.  

మండల పరిషత్‌లలో... 
కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్‌(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్‌ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్‌)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్‌ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు.

కొత్త పరిషత్‌లకు కేటాయించినవారు, ఆర్డర్‌ టు సర్వ్‌ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్‌/మల్టీజోనల్‌ కేడర్‌లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్‌లను ఇన్‌చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్‌పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను కేటాయిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement