
కప్పగంతులతో మారిన పార్టీల బలాలు
ఖాళీ అయిన స్థానాల భర్తీ లేదు.. కో ఆప్షన్ ఎన్నికలూ లేవు
బల్దియా పాలకమండలికి నేటితో నాలుగేళ్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: అయిదేళ్ల కాల పరిమితి కలిగిన జీహెచ్‌ఎంసీ పాలక మండలికి(GHMC Governing Council) నేటితో నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. రేపట్నుంచి అయిదో (చివరి) సంవత్సరంలోకి అడుగిడనుంది. 2021 ఫిబ్రవరి 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ(GHMC) విభజన జరిగే అవకాశాలుండటంతో ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొత్త పాలక మండలికి ఎన్నికలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ముందస్తుగానే పాలకమండలి ఎన్నికలు జరిగే అవకాశం దాదాపు లేదు.
ఏవైనా కారణాలతో నెల, రెండు నెలల ముందుగానే ఎన్నికలు జరిగినా ఈ పాలకమండలికి మిగిలింది పది నెలల గడువే. అందుకే ఈలోగా ఇంటిని చక్కదిద్దుకునేందుకు కాబోలు.. కార్పొరేటర్లు కాలికి పని చెబుతున్నారు. తిరిగి ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్లేందుకో, లేక పనుల టెండర్లలో వచ్చే కమీషన్ల కోసమో స్థానిక సమస్యలంటూ నిధుల కోసం కొట్లాడుతున్నారు. కార్పొరేటర్ల డివిజన్లకు నిధులివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మేయర్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) సైతం గతంలో లేని విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు విస్తృతం చేశారు. హోటళ్ల తనిఖీలు వంటివి చేస్తున్నారు. కార్పొరేటర్లు సైతం తమ డివిజన్లలో పర్యటిస్తున్నారు.
కోఆప్షన్ ఎన్నిక లేదు.. వార్డు కమిటీలూ లేవు
పాలకమండలికి నాలుగేళ్లు పూర్తవుతూ.. అయిదో ఏట అడుగుపెడుతున్నా ఇప్పటి వరకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. వార్డు కమిటీలు, ఏరియా కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. ఈ ఎన్నికలేవీ జరగకుండానే నాలుగేళ్లు పూర్తి చేసిన పాలకమండలి బహుశా ఇదేనేమో. మరణించిన కార్పొరేటర్ల స్థానాల్లో.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కార్పొరేటర్ల స్థానాల్లో వాటి భర్తీకి ఉప ఎన్నికలూ జరగలేదు. ఇలా.. రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన పనుల ఊసే లేకుండాపోయింది.
స్టడీ లేని టూర్లు
సభ్యులు స్టడీ టూర్ల పేరిట వివిధ నగరాలు చుట్టివచ్చినా అక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటో, వాటిల్లో వేటిని ఇక్కడ అమలు చేయవచ్చో నివేదిక ఇవ్వని పాలకమండలి కూడా ఇదే. ఇక పాలకమండలి సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రతిసారీ గందరగోళాలే. ఏనాడూ సమావేశాలు సవ్యంగా సాగలేదు. ఇలా.. చెబుతూపోతే నెగెటివ్ అంశాలు తప్ప పాజిటివ్ అంశాలు కనిపించకపోవడం దురదృష్టకరం.
కప్పదాట్లు..
పాలకమండలిలో చెప్పుకోదగిన అంశాల్లో పార్టీ మారి్పడులు ప్రముఖంగా ఉన్నాయి. పాలకమండలికి జరిగిన ఎన్నికల్లో తొలుత కేవలం రెండుస్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ బలం ఇప్పుడు 24కు చేరడం ఇందుకు దృష్టాంతం. చివరకు ఒక పారీ్ట(బీఆర్‌ఎస్)లో ఉండి మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వారు సైతం మరో పార్టీ(కాంగ్రెస్)లోకి మారడం ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
ప్రత్యేకంగా చేసిందేమిటి?
నాలుగేళ్లు పూర్తయినా.. ఈ పాలకమండలి హయాంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంటూ ఒక్కటి కూడా లేకపోవడమే దీని ప్రత్యేకత. పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నిషేధం, కల్తీ లేని ఆహారం.. ఇలా ఏ కార్యక్రమం చూసినా అమలులో విఫలమైంది. విజయవంతం చేయలేకపోయింది. పరమ అధ్వానపు పరిపాలన కూడా ఈ పాలకమండలి హయాంలోదే కావడం గమనార్హం. బర్త్, డెత్ సరి్టఫికెట్లు, మ్యుటేషన్లు, ఇతరత్రా ఎన్నో అంశాల్లో అవినీతి వెల్లడైంది. వెలుగునిచ్చే వీధి దీపాల్లోనూ అవినీతి చీకట్లే
నిండుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment