Reorganization
-
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్‌లు బాస్‌లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నాగర్‌కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి జిల్లాలో ఒక అటవీ డివిజన్ (టెరిటోరియల్ లేదా సోషల్ ఫారెస్ట్) ఏర్పాటు చేసింది. అవసరం లేని, కాలం చెల్లిన 6 డివిజన్లను మూసివేసి వాటి స్థానంలో కొత్తగా 9 డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాలకు ఇప్పుడు 32 డివిజన్లు ఉన్నాయి. గతంలో 13 జిల్లాలకు 23 డివిజన్లు ఉండేవి. పునర్వ్యస్థీకరణ తర్వాత కొత్తగా పార్వతీపురం మన్యం, చింతపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, కోనసీమ, భీమవరం, మచిలీపట్నం, బాపట్ల, పల్నాడు డివిజన్లు ఏర్పాటయ్యాయి. వెదురు, కలప వెలికితీత కోసం ప్రత్యేకంగా ఉన్న చింతూరు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, గిద్దలూరు, నంద్యాల లాగింగ్ డివిజన్లను రద్దు చేశారు. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కట్టినప్పుడు దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు. ► గతంలో సోషల్ ఫారెస్ట్, టెరిటోరియల్ డివిజన్లు విడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటినీ కలిపి ఒకటిగా చేశారు. గతంలో ఉన్న 13 సోషల్ ఫారెస్ట్ డివిజన్లను పదికి తగ్గించారు. ► పునర్వ్యవస్థీకరణ తర్వాత 3 జిల్లాల్లో మాత్రమే ఒకటికంటే ఎక్కువ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు డివిజన్లు (పాడేరు, చింతపల్లి, చింతూరు, రంపచోడవరం) ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 3 డివిజన్లు (కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల), ప్రకాశం జిల్లాలో 3 డివిజన్లు (మార్కాపురం, గిద్దలూరు, ప్రకాశం) పెట్టారు. మిగిలిన 23 జిల్లాల్లో ఒక్కో డివిజన్ (టెరిటోరియల్) ఏర్పాటయ్యాయి. ► వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగానే ఉంచారు. ఏలూరు (కొల్లేరు, కృష్ణా అభయారణ్యాలు), సూళ్లూరుపేట (పులికాట్, నేలపట్టు అభయారణ్యాలు) వైల్డ్‌లైఫ్ డివిజన్లను అలాగే ఉంచారు. నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లను అలాగే ఉంచారు. ఈ నాలుగింటికీ టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ కొత్త పోస్టులు సృష్టించకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేసి పునర్వ్యవస్థీకరణ చేశాం. దీనివల్ల పరిపాలన సౌలభ్యంతోపాటు జిల్లాకు ఒక డివిజన్ ఉంటుంది. రద్దు చేసిన డివిజన్లలోని ఉద్యోగులను కొత్త వాటిలో సర్దుబాటు చేస్తున్నాం. – వై మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అటవీప్రాంతం లేని జిల్లా పశ్చిమగోదావరి పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతం లేని జిల్లాగా ఉంది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లాలో ఒక్క ఎకరం కూడా అటవీ భూమి లేదు. అయినా అక్కడ అటవీ డివిజన్ ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో అత్యధికంగా 8,03,039.45 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 వేల హెక్టార్లకంటె తక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. విశాఖపట్నం 14,512 హెక్టార్లతో పూర్తి అర్బన్ అటవీ ప్రాంతంగా మారింది. -
ప్రత్యేక ఆర్థిక జోన్ల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్ఈజెడ్) పునర్ వ్యవస్థీకరించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్ఈజెడ్లకు సంబంధించి దిగుమతి సుంకాల వాయిదా, ఎగుమతి పన్నుల నుండి మినహాయింపు వంటి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రోత్సాహకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండలాలను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని కొత్త చట్టంతో భర్తీ చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వార్షిక బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందే ‘‘డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్’’ (డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలు భాగస్వాములు కావడానికి వీలుగా కేంద్రం పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బిల్లుకు సంబంధించి ఆర్థికమంత్రిత్వశాఖసహా పలు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను వాణిజ్య మంత్రిత్వశాఖ స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక కొత్త బిల్లును రూపొందించి, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రోత్సాహకాలు ఇవీ... ఎస్ఈజెడ్లో ఒక యూనిట్ ద్వారా దేశీయ సేకరణపై ఐజీఎస్టీ (ఇంటిగ్రేడెట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) మినహాయింపు, ఈ జోన్ల డెవలపర్లకు పరోక్ష పన్ను ప్రయోజనాల కొనసాగింపు, దేశీయ టారిఫ్‌లకు సంబంధించి ఉపయోగించిన మూలధన వస్తువుల అమ్మకాలపై తరుగుదల అనుమతించడం వంటివి ప్రత్యేక ఆర్థిక జోన్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత డెవలప్మెంట్ హబ్‌లలో అధీకృత కార్యకలాపాలను చేపట్టే యూనిట్లకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 15 శాతం కార్పొరేట్ పన్ను రేటును వర్తింపజేయాలన్నది బిల్లు ప్రతిపాదనల్లో మరోటి. తయారీ, ఉద్యోగ కల్పనను పెంచడానికి రాష్ట్రాలు కూడా ఈ జోన్లకు సహాయక చర్యలను కూడా అందించే వీలు కల్పించాలన్నది బిల్లులో ప్రధాన లక్ష్యంగా ఉంది. 2022–23 బడ్జెట్ సమర్పణ సందర్భంగా లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎకానమీలో కీలకపాత్ర... దేశంలో ఎగుమతి కేంద్రాలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2006లో ప్రస్తుత సెజ్ చట్టం రూపొందింది. 2022 జూన్ 30 నాటికి కేంద్రం 425 ఎస్ఈజెడ్ డెవలపర్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 268 పని చేస్తున్నాయి. ఈ జోన్లు దాదాపు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దాదాపు 27 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 32 శాతం పెరిగి దాదాపు రూ.2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 2020–21లో ఈ జోన్ల నుంచి రూ.7.6 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, 2021–22లో ఈ విలువ రూ.10 లక్షలకు చేరింది. -
లైఫ్‌స్టైల్ రిటైలింగ్‌కు ఐటీసీ టాటా
న్యూఢిల్లీ: లైఫ్‌స్టైల్ రిటైలింగ్ బిజినెస్ నుంచి వైదొలగినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బిజినెస్ పోర్ట్‌ఫోలియోపై వ్యూహాత్మక సమీక్ష తదుపరి ఇందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల క్రితం విల్స్ లైఫ్‌స్టైల్ బ్రాండుతో ఐటీసీ ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఫార్మల్, క్యాజువల్, డిజైనర్ వేర్సహా పలు దుస్తులను విక్రయించడంతోపాటు.. జాన్ ప్లేయర్స్ బ్రాండుతో పురుషుల క్యాజువల్స్, డెనిమ్స్, ఫార్మల్స్ తదితరాలను సైతం మార్కెటింగ్ చేసింది. అయితే 2019లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా లైఫ్‌స్టైల్ రిటైలింగ్ బిజినెస్‌ను తగ్గించుకుంది. జాన్ ప్లేయర్స్ బ్రాండును రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. కొన్ని పాత స్టోర్స్లోగల విల్స్ బ్రాండు నిల్వలను విక్రయిస్తున్నట్లు గత నెలలో కంపెనీ చైర్మన్ సంజీవ్ పురి వెల్లడించిన విషయం విదితమే. -
స్వతంత్ర భారతి: భిన్నత్వంలో ఏకత్వంలా... భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దాని వల్ల కుల మత పరమైన వైషమ్యాలు అణగిపోతాయని ఆశించారు. 1956 లో చేపట్టిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఈ సూత్రమే ఆధారం. దీనిని మూడు విడతలుగా.. 1956లో దక్షిణాది రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం), 1960 నాటికి పశ్చిమ రాష్ట్రాలలో (గుజరాత్), 1966 నాటికి వాయవ్య ప్రాంతంలో (పంజాబ్, హర్యానా, హిమాచల్) అమలు పరిచారు. తర్వాత ఈశాన్య ప్రాంత విభజన (1964, 71) గిరిజన జనాభా ప్రాతిపదికన జరిగింది. జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలనూ ఏర్పాటు చేస్తూ 2000 లో ఉత్తరాది కేంద్రభాగంలో మినీ–పునర్వ్యవస్థీకరణ జరిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ఇది ఒక అరుదైన ప్రయోగం. భాషాపరమైన వ్యవస్థీకరణ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు పుష్టిని ఇచ్చింది. 1956లో మొదలైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నిరంతరం కొనసాగేలానే ఉంది. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విదర్భ కోసం డిమాండ్లు నేటికీ వినిపిస్తూ ఉన్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్లో 1953 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఆ ముందు రోజే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మూడేళ్లకు 1956 నవంబర్ 1న ఆంధ్రా, తెలంగాణాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. -
హైదరాబాద్‌లో కొత్తగా రెండు జోన్లు, 13 పోలీస్ స్టేషన్లు.. ఏయే ప్రాంతాల్లో అంటే...
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్‌కు 175 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఏర్పాటైన నాటి నుంచి పలుమార్లు చిన్నచిన్న మార్పులతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా భారీ రీ– ఆర్గనైజేషన్‌కు కసరత్తు పూర్తయింది. కొత్తగా రెండు జోన్లు, 13 పోలీసుస్టేషన్లతో పాటు వాటికి తగ్గట్టు సబ్–డివిజన్లను ప్రతిపాదిస్తూ ప్రత్యేక కమిటీ తయారుచేసిన ప్రతిపాదనలు సోమవారం ప్రభుత్వానికి చేరాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం సర్కారు ఆమోదముద్ర వేయనుంది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడితే నగరంలో జోన్ల సంఖ్య 7కు, పోలీసు స్టేషన్లు 73కు చేరనున్నాయి. ఇదీ చరిత్ర.. ► హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ 1847లో ఏర్పడింది. అప్పట్లో నిజాం స్టేట్‌కు హైదరాబాద్ రాజధాని కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను కొలిక్కి తీసుకురావడం తదితర విధులతో దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం, హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం తొలిసారిగా 1955లో నగర పోలీసు పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి మద్రాస్ సిటీ పోలీసు విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలుపరిచారు. దీంతో క్రైమ్, లా అండ్ ఆర్డర్ వేరు పడటం, హైదరాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీసులోకి బదిలీ కావడం తదితర కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ► ఆ ఏడాది జూలై 15 నుంచి ఈ విధివిధానాలు అమలులోకి వచ్చాయి. తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కొందరు సిబ్బందిని అప్పగించి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో జంట నగరాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు విభాగంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్‌తో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాలనూ ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్ 11న నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో పాటు నగర కమిషనరేట్నూ పాలనా సౌలభ్యం కోసం విభజించారు. నాలుగు సబ్– డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయి. నగర విస్తరణతో 1981 పునర్వ్యవస్థీకరణ.. ► విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు 1981లో కమిషనరేట్‌ను మరోసారి పునర్వ్యవస్థీకరించారు. దీనిప్రకారం నగరంలో నాలుగు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్), 12 సబ్–డివిజన్లు ఏర్పడ్డాయి. జోన్‌కు డీసీపీలు, సబ్–డివిజన్‌కు ఏసీపీలు నేతృత్వం వహించే ఏర్పాట్లు చేశారు. ► 1985, 2001ల్లో జరిగిన మార్పుచేర్పులతో సెంట్రల్ జోన్, రెయిన్‌బజార్, కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుతో నగరంలోని జోన్ల సంఖ్య 5కు, పోలీసు స్టేషన్ల సంఖ్య 60కి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా మారుతూ వచ్చినా పోలీసుస్టేషన్లు, సబ్–డివిజన్లు, జోన్ల సంఖ్య పెరగలేదు. ► ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, నేరాల నమోదుతో పాటు జనాభా, పోలీసింగ్ తీరుతెన్నులు ప్రాతిపదికన పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన నేతృత్వంలో సంయుక్త పోలీసు కమిషనర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలతో గత నెలలో కమిటీకి రూపమిచ్చారు. ► నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, పట్టు ఉన్న ఈ అధికారులు పునర్వ్యవస్థీకరణ అంశాన్ని అనేక కోణాల్లో పరిశీలించారు. ఎట్టకేలకు సౌత్, వెస్ట్, సెంట్రల్, నార్త్జోన్లలో ఉన్న ప్రాంతాలను విడగొడుతూ రెండు జోన్లకు, 15 ఠాణాల్లోని ఏరియాలను కలుపుతూ 13 పోలీసుస్టేషన్లకు రూపమిస్తూ దస్త్రం రూపొందించి ప్రభుత్వానికి పంపారు. (క్లిక్: పోలీస్ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్) ► ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేపథ్యంలోనే కమిషనరేట్‌లో కీలక మార్పులు జరిగాయి. సెంట్రల్ జోన్ ఏర్పడినప్పుడు తొలి డీసీపీగా ఆయనే పని చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యల నిరోధానికి లేక్ పోలీసుస్టేషన్‌కు ఆనందే రూపమిచ్చారు. తాజాగా భారీ మార్పులు ఆయన నేతృత్వంలోని కమిటీ ద్వారానే జరగనుండటం విశేషం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు..) -
Andhra Pradesh: పోలీస్‌శాఖలో పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్‌శాఖలో పునర్వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు 48 అడిషనల్ ఎస్పీలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జిల్లాలతో రాష్ట్రంలో సరికొత్త శకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే? కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలు నియామకం కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 47 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
ఎచ్చెర్ల యథాతథంతో.. టీడీపీ ఎత్తులు చిత్తు
చక్కటి ప్రణాళిక, సమగ్రమైన అధ్యయనం, సలక్షణమైన నిర్ణయంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ టీడీపీ నోరు మూయించింది. ఒక్క విమర్శకు కూడా తావు లేని విధంగా సిక్కోలు పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ‘ఎచ్చెర్ల’ వెళ్లిపోతే రోడ్డెక్కుదామని వేచి చూసిన ప్రతిపక్షానికి నోట మాట రాకుండా సమాధానం చెప్పింది. కీలకమైన ఆ ప్రాంతాన్ని సిక్కోలులోనే ఉంచేస్తూ టీడీపీకి ఊహించని షాకిచ్చింది. రాజాం, పాలకొండ వాసులకు కూడా మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని ఆయా ప్రాంతాల అభిమానాన్ని చూరగొంది. సాక్షి, శ్రీకాకుళం: విమర్శ చేద్దామనుకున్న వారి నోళ్లు మూతబడ్డాయి. ఆందోళనలతో హడావుడి చేద్దామని భావించిన వారి నినాదాలు మూగబోయాయి. సిక్కోలు పునర్ వ్యవస్థీకరణలో ప్రభుత్వం సమగ్రమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి, శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచడంతో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైఎస్ జగన్ సర్కారు ఈ నిర్ణయంతో వైరి పక్షం నోరు మూయించి, జనాల మనసులను మరోసారి గెలుచుకుంది. ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ స్థానం పరిధిలో ఉండడంతో ఆ జిల్లాలోకి వెళ్లిపోతుందని చాలాకాలంగా వాదనలు జరుగుతున్నాయి. అలా జరిగితే జిల్లా కేంద్రంలోని కొంత భాగం వెళ్లిపోతుందని, పైడిభీమవరం, నవభారత్ పారిశ్రామిక వాడలతో పాటు ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాల, జిల్లా శిక్షణా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వ్యవసాయ కళాశాల, పలు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు, పో లీసు శాఖకు చెందిన ఏఆర్ విభాగం, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, ఫార్మా రంగం, జాతీయ రహదారి వంటివి జిల్లా కోల్పోతుందని అంతా అపోహలు సృష్టించారు. దీన్నే ఆయుధంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ వేచి చూసింది. అయితే ప్రజలు, స్థానిక నాయకుల అభిప్రాయాల ను ప్రభుత్వం గౌరవించి ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే ఉంచడంతో టీడీపీ వ్యూహాలన్నీ చతికిలపడ్డాయి. చదవండి: (Andhra Pradesh New Districts: పెద్ద జిల్లా ప్రకాశం.. చిన్న జిల్లా విశాఖ) రెండు రెవెన్యూ డివిజన్లు.. 1466 రెవెన్యూ గ్రామాలు సరికొత్త సిక్కోలులో రెండు రెవెన్యూ డివిజన్లు, 921 పంచాయతీలు, 1466 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నా యి. వీటి పరిధిలో 5,53,830 కుటుంబాలు ఉంటాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 16 మండలాలు, టెక్క లి రెవెన్యూ డివిజన్లో 14 మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం డివిజన్లో ఇప్పటికే ఉన్న ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గా ల మండలాలు, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పోలాకితో పాటు ఇంతవరకు పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఉన్న కొత్తూరు, హిరమండలం, సారవకోట మండలాలు కలుస్తాయి. టెక్కలి డివిజన్లో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గా ల మండలాలు, జలుమూరుతో పాటు ఇప్పటివరకు పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు కలుస్తాయి. ‘మన్యం’లోకి పాలకొండ.. బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో రాజాం కొత్తగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే మ న్యం జిల్లాలో పాలకొండ కలవనుంది. ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ డివిజన్ హోదా యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న రాజాం నియోజకవర్గ మండలాలు విజయనగరం జిల్లా పరిధిలోని బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో కలుస్తాయి. అలాగే, పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం నియోజకవర్గ మండలాలు టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో విలీనమవుతాయి. పాతపట్నం, రాజాం నియోజకవర్గాల మండలాలు పోతుండగా, కొత్తగా కురుపాం ని యోజకవర్గంలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి కలవనున్నాయి. మొత్తం ఆరు మండలాలతో పాలకొండ రెవెన్యూ డివిజన్ కొనసాగనుంది. చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు) మరింత సౌలభ్యం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గం కలవడంతో ఆ ప్రాంత వాసులకు మరింత సౌలభ్యం కలగనుంది. 18.84 లక్షల జనాభాతో 3,846 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయనగరం ఏర్పాటవు తుంది. రాజాం వాసులకు శ్రీకాకుళం కంటే విజయనగరంతోనే లావాదేవీలు ఎక్కు వ. వ్యాపార, ఇతర వ్యవహారాలు, సంబంధాలు కూడా అక్కడితోనే ఎక్కువ. ఇప్పుడు అధికారికంగా కూడా ఒక జిల్లాలోనే ఉండనున్నారు. ఇక, వారికి రెవెన్యూ డివిజన్‌గా ఉన్న బొబ్బిలి మరింత దగ్గరగా ఉండనుంది. రాజాం నియోజకవర్గం విలీనంతో విజయనగరం జిల్లాలోకి కొత్తగా 123 పంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు, 68,003 హౌస్ హోల్డ్స్ వెళ్లనున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్: 16 మండలాలు (కొత్తగా కలిసేవి: కొత్తూరు, హిరమండలం, సారవకోట) టెక్కలి రెవెన్యూ డివిజన్: 14 (కొత్తగా కలిసేవి: పాతపట్నం, మెళియాపుట్టి) బొబ్బిలి రెవెన్యూ డివిజన్ : 11 (వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం, బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు,గజపతినగరం, మెరకముడిదాం) పాలకొండ రెవెన్యూ డివిజన్: 6 (వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి) పార్వతీపురం రెవెన్యూ డివిజన్ : 10 (కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం,పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ) పాలకొండకు అనుకూలం.. పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో కలిసి 9.72లక్షల జనాభాతో 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో విలీనం అవుతుంది. దీని వల్ల జిల్లా కేంద్రం పార్వతీపురం వారికి మరింత దగ్గరవుతుంది. పాలకొండ వాసులకు కూడా శ్రీకాకుళం కంటే పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఈ నియోజకవర్గంలోని వీరఘట్టం ప్రజలు శ్రీకాకుళం రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. భామిని వాసులైతే 98 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త జిల్లా ఏర్పాటైతే వీరఘట్టం ప్రజలు 30 కిలోమీటర్లు, భామిని మండల ప్రజలు 70 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. పాలకొండ నియోజకవర్గం విలీనం కావడం వల్ల మన్యం జిల్లాలోకి 146 గ్రామ పంచాయతీలు, 226 రెవెన్యూ గ్రామాలు, 59,488 హౌస్ హోల్డ్స్ కలవనున్నాయి. సముచిత ప్రాధాన్యం.. పరిపాలనా సౌలభ్యం, సత్వర సే వలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం. వచ్చే నెల 26వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తాం. మన జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం శుభపరిణామం నూతన జిల్లాల ఏర్పాటు శుభ ప రిణామం. జిల్లాల వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కొత్త జిల్లాలతో ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయి. సీఎం వినూత్న ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – తమ్మినేని సీతారాం, అసెంబ్లీ స్పీకర్ గొప్ప నిర్ణయం జిల్లాల పునర్విభజన గొప్ప పరిణామం. ఎచ్చెర్ల విషయంలో జిల్లా వాసులకు భయం ఉండేది. కానీ ఇక్కడి మనోభావాలను సీఎం గౌ రవించారు. ఇందులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కృషి అధికంగా ఉంది. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మంత్రి సీఎంకు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనిర్వచనీయం. పరిపాలనా సౌలభ్యం కోసం సులభతరంగా పర్యవేక్షణ చేసేందుకు వీలుగా శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నూతన అధ్యాయం అన్ని ప్రాంతాలకు సమన్యా యం జరిగేలా సీఎం వైఎస్ జగ న్మోహన్రెడ్డి కొత్త జిల్లాలకు రూపకల్పన చేశారు. ఇది నూతన అధ్యాయం. – డాక్టర్ కిల్లి కృపారాణి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు -
వేదాంత.. నాలుగు ముక్కలు!
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ తన నిర్వహణలోని వివిధ వ్యాపారాలను వేరు చేసి, వాటిని లిస్ట్ చేసే యోచనతో ఉంది. వేదాంత లిమిటెడ్‌తోపాటు.. మరో మూడు వ్యాపారాలు సమాంతరంగా పనిచేసే విధంగా పునర్వ్యవస్థీకరణను పరిశీలిస్తున్నట్టు సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ‘‘మూడు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈ నమూనాలో వ్యాపారాలు విడిగా మరింత వృద్ధి చెందడమే కాకుండా, వాటాదారుల విలువ కూడా ఇతోధికం అవుతుంది’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికను అమలు చేసినట్టయితే వేదాంత వాటాదారుల వద్ద ప్రస్తుతం ఉన్న ఒక షేరు స్థానంలో నాలుగు షేర్లు ఉంటాయని చెప్పారు. ‘‘ఇది అంతర్జాతీయంగా ఉన్న నమూనానే. దేశీయంగా చూసినా హిందాల్కో, టాటా స్టీల్ కనిపిస్తాయి. ఇవి వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నాయి. మేము కూడా ఇదే చేయాలనుకుంటున్నాం. దీనిపై తగిన సూచనల కోసం బోర్డు డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశాం. సమయం చెప్పలేను కానీ, వీలైనంత తొందర్లోనే దీన్ని అమలు చేస్తాం’’అని అగర్వాల్ వివరించారు. ఈ విషయమై సాయం కోసం అడ్వైజర్లను కూడా నియమించినట్టు చెప్పారు. వేదాంత సైతం ఈ విషయమై స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. కార్పొరేట్ నిర్మాణం ఎలా ఉండాలి? డీమెర్జర్, స్పిన్ ఆఫ్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇలా అన్ని రకాల ఆప్షన్లను డైరెక్టర్ల కమిటీ అధ్యయనం చేయ నున్నట్టు తెలిపింది. అల్యూమినియం, ఐరన్ అండ్ స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఉండాలన్నది తమ ఆలోచనగా పేర్కొంది. అదానీ గ్రూపు కూడా 2015లో పోర్ట్‌లు, విద్యుత్, మైనింగ్, ట్రాన్స్మిషన్ వ్యాపారాలను విడదీసి ప్రత్యేకంగా లిస్ట్ చేయడం తెలిసిందే. -
ఆజాద్‌పై వేటు.. ప్రియాంకకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీలను మారుస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అదేవిధంగా ఇటీవల పార్టీపై లేఖాస్త్రం సంధించిన బృందం నాయకుడు గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు. ఆజాద్‌తో పాటు సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్ పటేల్ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాలకు చోటు కల్పించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్ సభ్యులుగా చిదంబరం, రణ్‌దీప్ సూర్జేవాలా, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్‌లను తీసుకున్నారు. లుజిన్హొ ఫెలిరియో, మోతీలాల్ వోరా, ఆధిర్ రంజన్ చౌధురి, తామ్రధ్వజ్ సాహులను సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తొలగించారు. లిరియోను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. ఆజాద్‌ను హరియాణా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించి, వివేక్ బన్సాల్‌ను ఆ పదవిలో నియమించారు. సూర్జేవాలాను కర్నాటకకు, జితిన్ ప్రసాదను పశ్చిమబెంగాల్‌కు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి్జలుగా నియమించారు. కాంగ్రెస్‌పార్టీలో సంస్కరణలు అవసరమని, క్రియాశీల అధ్యక్షుడి అవసరం పార్టీకి ఉందంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. సీడబ్యూసీ కొత్త సభ్యుల్లో దిగ్విజయ్, రాజీవ్ శుక్లా, మానికం టాగోర్, ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, హెచ్‌కే పాటిల్, సల్మాన్ ఖుర్షీద్, దినేశ్ గుండూరావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్ ఎంపీ మాణిక్కం టాగూర్ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. పార్టీ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని నియమించారు. -
జీఎంఆర్ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఐఎల్ నుంచి ఎనర్జీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలను వేరు చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారం మాత్రమే జీఐఎల్‌లో భాగం కానుంది. ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ విభాగాలు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు (జీపీయూఐఎల్) బదిలీ అవుతాయి. గురువారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జీఐఎల్ వాటాదారులు జీపీయూఐఎల్‌లో అదే నిష్పత్తిలో వాటాదారులు అవుతారు. జీఐఎల్‌లో రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి 10 షేర్లకుగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక జీపీయూఐఎల్ షేరును అదనంగా జారీ చేస్తారు. జీపీయూఐఎల్ లిస్టింగ్ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టులపై మరింత దృష్టి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎయిర్‌పోర్టుల వ్యాపారంపై మరింత ఫోకస్ చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరించింది. ‘కొన్నేళ్లుగా జీఐఎల్ ఎన్నో రెట్లు వృద్ధి సాధించింది. ఈ కంపెనీ కింద విభిన్న వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మౌలిక రంగ వ్యాపారంలో వృద్ధిని నడిపించడానికి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలు ఉండాలని వాటాదారులు సూచిస్తున్నారు. పలు విధానాలను మేం పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నాం. జీపీయూఐఎల్‌లో ఎయిర్పోర్టేతర వ్యాపారాలు వాటాదారులకు విలువ చేకూర్చేందుకు మెరుగైన స్థానంలో ఉన్నాయి’ అని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో గ్రంధి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎయిర్‌పోర్టుల రంగంలో భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయిన జీఎంఆర్.. ఫిలిప్పైన్స్, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవా, గ్రీస్‌లో విమానాశ్రయాలను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.834 కోట్ల నష్టం జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.834 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.336 కోట్ల నష్టం నమోదైంది. టర్నోవరు రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు వచ్చి చేరింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగం టర్నోవరు రూ.494 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.1,460 కోట్లు నమోదైంది. మెరుగైన పనితీరుతో విద్యుత్ విభాగం టర్నోవరు రూ.116 కోట్ల నుంచి రూ.300 కోట్లకు ఎగసింది. -
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు తన అధ్యక్షతన ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. కమిటీకి అవసరమైన సమాచారాన్ని అన్ని శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అధ్యయన కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు.. ► ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం. ► పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్దిష్ట బాధ్యతలున్నాయి. పునర్వ్యవస్థీకరణలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. ► ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలుండాలి. ► వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి. ►ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫార్సులు చేయాలి. దీనికోసమే కొత్త జిల్లాల ఏర్పాటు.. ► ప్రభుత్వ సేవలను, పాలనను ప్రజల గడప ముందుకే తీసుకువెళ్లడం ద్వారా వారిలో సంతృప్త స్థాయిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ► ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. ► ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. -
ఒకే గొడుగు కిందకు ఇరిగేషన్
సాక్షి, హైదరాబాద్ : నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండు కీలక ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. సాగునీటి రంగం బలోపేతానికి.. ‘రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని గుర్తించిన కేసీఆర్, ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్త తం నీటిపారుదల శాఖ శాఖోపశాఖలుగా ఉంది. భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. అందుకే నీటి పారుదల శాఖను 15–20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ (సీఈ)ని ఇన్చార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసా యిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ 2రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్‌షాపు నిర్వహించి, ముసాయిదా రూపొందించారు. దీనిని సోమ వారం సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తారు. దీనిపై సమీక్ష సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణ యం తీసుకుంటారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సీఈలు పాల్గొంటారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సచివాలయం ఎలా ఉండాలి? తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై, సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఈ సమీక్షలో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు. -
సాగునీటి శాఖకు కొత్త రూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది. ప్రక్షాళన ఇలా... - కరీంగనర్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. - శ్రీరాంసాగర్ సీఈ పరిధిలో లోయర్‌మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్‌మఠ్, ఆదిలాబాద్‌లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. - కరీంనగర్‌లోని మరో ఈఎన్సీ పరిధిలో లోయర్‌మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్సీ పరిధిలో ఉండనుంది. - నిజామాబాద్ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది. - వరంగల్ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. - ఆదిలాబాద్ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్‌నగర్ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. - పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. - నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు. - ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. - హైదరాబాద్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో మిడ్‌మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. -
వ్యాపార పునర్వ్యవస్థీకరణలో వాల్‌మార్ట్
న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తాజాగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 56 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉండగా, మిగతా వారిలో.. మధ్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన వారిలో అత్యధిక శాతం మంది .. స్టోర్స్ విస్తరణలో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంలోని వారే కావడం గమనార్హం. ‘మరింత మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించుకునే మార్గాలపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగానే కార్పొరేట్ స్వరూపంలో మార్పులు చేస్తున్నాం‘ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. భారత్‌కు కట్టుబడి ఉన్నాం.. హోల్‌సేల్ రిటైల్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని, వీటి నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా ఆరు బెస్ట్ ప్రైస్ హోల్‌సేల్ స్టోర్స్, ఒక ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభించినట్లు.. అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు అయ్యర్ చెప్పారు. కస్టమర్లకు మరింతగా సేవలు అందించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. అమెజాన్, జియోమార్ట్‌లతో పోటీ.. 2014 జులైలో పుణె, హైదరాబాద్‌లో బెస్ట్ ప్రైస్ స్టోర్స్‌తో వాల్‌మార్ట్.. భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫార్మాట్ల ద్వారా విక్రయాలు జరుపుతోంది. 28 హోల్‌సేల్ స్టోర్స్ ఉన్నాయి. 2018లో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా పోటీ సంస్థ అమెజాన్.. దూకుడుగా ముందుకెడుతోంది. ఫ్యూచర్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు ఇతరత్రా ఆఫ్‌లైన్ రిటైల్ సంస్థల్లోనూ వాటాలు దక్కించుకుంటోంది. మరోవైపు దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జియో మార్ట్ పేరిట నిత్యావసరాల ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. -
ఓయోలో 1,000 మందికి ఉద్వాసన..!
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ‘ఓయో’ 1,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీని వీడి ఇతర సంస్థల్లో ఉద్యోగాలను చూసుకోవాలంటూ పలువురికి ఈ–మెయిల్స్ అందినట్లు వెల్లడైంది. అయితే, దీనిపై ఇప్పటివరకు కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.‘రైట్–సైజింగ్’ పేరిట ఈ ఉత్తరాలు అందినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై సంస్థ సీఈఓ రితేష్ అగర్వాల్ స్పందిస్తూ.. ఉద్యోగులను బయటకు వెళ్లి మరో సంస్థలో చేరమని కోరడం అంత సులువైన విషయం కాదని వ్యాఖ్యానించారు. -
కార్వీ వ్యాపార పునర్వ్యవస్థీకరణ
హైదదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసులుకింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్‌ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కమోడిటీల ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తదితర వ్యాపారాలను ఆరి్థక సేవల విభాగం కింద చేర్చనున్నట్లు కార్వీ వివరించింది. అలాగే, డేటా మేనేజ్మెంట్ సేవలు, డేటా అన లిటిక్స్, మార్కెట్ రీసెర్చ్, అనుబంధ వ్యాపారాలు.. ఆర్థికేతర విభాగం పరిధిలో ఉంటాయని పేర్కొంది. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపింది. ఆరి్థక సేవల వ్యాపార విభాగం గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది నియమితులైనట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్‌లో సుమారు మూడు దశాబ్దాలపైగా అనుభవం ఉన్న చతుర్వేది సారథ్యంలో సంస్థ కొత్త శిఖరాలు అధిరోహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చతుర్వేది గతంలో ధనలక్ష్మి బ్యాంక్, రిలయన్స్ ఏఎంసీ, ఐసీఐసీఐ, ఎస్సెల్ గ్రూప్ తదితర సంస్థల్లో పనిచేశారు. కార్వీ బ్రాండ్‌ను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా నిధుల సమీకరణతో సంస్థను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని చతుర్వేది తెలిపారు. -
పెరగనున్న పురపరిధి..!
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పలు మునిసిపాలిటీల పరిధి పెరగనుండడంతో పాటు మరికొన్ని మునిసిపాలిటీల్లో ఉన్న వార్డుల పునర్విభజన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆయా మునిసిపల్ కమిషన్లకు అందాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి మునిసిపాలిటీలోని జనాభాను వార్డుకు సరాసరి విభజించాలని ఆదేశాల్లో పేర్కొన్నా రు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తర్వుల్లో ఇలా.. 2011 జనాభా ప్రకారం మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు మునిసిపాలిటీలతో పాటు చిత్తూ రు మునిసిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన చేయాలని రాష్ట్ర పురపాలన పరిపాలనశాఖ సంచాలకులు విజయకుమార్ ఆదేశించారు. ఉదాహరణకు చిత్తూరు నగరంలో 1.89 లక్షల జనాభా ఉండగా.. ప్రతి డివిజన్లో సగటున 3,787 మంది చొప్పున (మొత్తం 50 డివిజన్లు) ఉండాలి. ఇందులో 10 శాతం తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. అంతకన్నా తేడా ఉంటే దాన్ని సమీపంలోని వార్డుల్లో కలపాలి. ఇలా 2011 జనాభా లెక్కల ప్రకారం మదనపల్లెలో 35 వార్డులు, పలమనేరు 24 , నగరిలో 27, పుత్తూరులో 24 వార్డులు ఏర్పడ్డాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సగటు జనాభా 10 శాతం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా వార్డుల పునర్విభజన జరగనుంది. చిత్తూరు కార్పొరేషన్లో 46, 47, 49, 50వ డివిజన్లలో స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీన్ని ఇతర డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. అయితే కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరగకపోగా.. మునిసిపాలిటీల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీనం తప్పదా ? మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీలతో పాటు తిరుపతి కార్పొరేషన్ పేరు ప్రస్తావించలేదు. అంటే శ్రీకాళహస్తి, పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలోకి సమీపంలో ఉన్న పంచాయతీలను విలీనం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీల విలీనం అనంతరం వీటిలో వార్డుల పునర్విభజన వర్తింపచేసే అవకాశాలున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌కు సంబంధించి విలీన ప్రక్రియలో ఇప్పటికే న్యాయపరమైన సమస్యలుండా దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచురణ షెడ్యూల్ వార్డుల పునర్విభజన ముసాయిదాను సెప్టెంబరు 3వ తేదీ లోపు, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబరు 11లోపు, 13వ తేదీ జాబితాను రాష్ట్ర మునిసిపల్ అధికారులకు పంపడం, అక్టోబర్ 10వ తేదీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేస్తుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. చిత్తూరు కార్పొరేషన్లో మాత్రం వచ్చేనెల 24వ తేదీ డివిజన్ల వారీ జనాభాను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తుంది. -
జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్‌ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్‌లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్‌లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్‌లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు. పని ఒత్తిడి ప్రాతిపదికన... కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్‌లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. సిబ్బంది విభజన... మునుపటి జెడ్పీపీ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్‌లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. మండల పరిషత్‌లలో... కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్‌ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త పరిషత్‌లకు కేటాయించినవారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్లను ఇన్చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను కేటాయిస్తారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెంచుతారా?
సాక్షి, హైదరాబాద్: జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా కొన్నింటి పరిధి మరీ చిన్నగా మారడం ఇప్పుడు సమస్యగా పరిణమిస్తోంది. గతంలోని ఉమ్మడి 9 జిల్లా పరిషత్‌ల స్థానంలో కొత్తగా 32 జిల్లా పరిషత్‌లు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వి భజనలో పరిమితంగా కొన్ని మండలాలతో ఏర్పడిన కొన్ని జెడ్పీలు, పరిమితంగా కొన్ని గ్రామాలతో ఏర్పడిన కొన్ని మండల ప్రజాపరిషత్‌లలో పాలకవర్గాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న మీమాంసకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు గురవుతున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో 4 గ్రామీణ మండలాలు, వరంగల్–అర్బన్ జిల్లాలో 7 గ్రామీణ మండలాలు, నారాయణపేటతోపాటు కొన్ని జిల్లాల్లోనూ తక్కువ సంఖ్యలో మండలాలు ఉండడంతో అలాంటి చోట్ల పాలకవర్గాలను ఎలా ఏర్పాటు చేస్తే బావుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. కొన్ని స్థానాలే ఉన్నచోట జెడ్పీపీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులు పోగా మిగిలినసభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ జెడ్పీ లేదా ఎంపీపీ మనుగడ ఎలా అని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 15–20 వేల జనాభాకు ఒక జెడ్పీటీసీ... గతంలో ఒక మండలాన్ని జెడ్పీటీసీ స్థానంగా, గ్రామాన్ని లేదా మూడున్నర నాలుగు వేల జనాభా గత ప్రాంతాన్ని ఎంపీటీసీగా పరిగణిస్తూ వచ్చారు. కొత్తగా 32 జిల్లాలు ఏర్పడిన దృష్ట్యా, మండలాల సంఖ్య మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో, గ్రామాల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాలను 15–20 వేల మధ్య జనాభాకు ఒక జెడ్పీటీసీ స్థానం ఏర్పాటు చేయాలని, రెండున్నర, మూడువేల జనాభాలోపు ఎంపీటీసీ స్థానంగా పరిగణించాలని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
గ్రూప్ఎమ్లో భారీ పునర్వ్యస్థీకరణ
హైదరాబాద్: డేటా సెంట్రిక్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్ఎమ్లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్ ఎమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) ప్రశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రెసిడెంట్ గ్రోత్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌గా (సౌత్ ఏషియా) తుషార్ వ్యాస్ నియమితులయ్యారు. అలాగే గ్రూప్ఎమ్ కంపెనీలో ఒక విభాగమైన మైండ్షేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సౌత్ ఏషియా) పార్థసారధి మాండ్యం, మైండ్ షేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సౌత్ ఏషియా) అమిన్ లఖానీ నియమితులయ్యారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పునర్వ్యస్థీకరణ తమ క్లయింట్ల విజయానికి మరింతగా దోహదపడగలదన్న ధీమాను గ్రూప్ఎమ్ వ్యక్తం చేసింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రశాంత్ కుమార్, తుషార్ వ్యాస్లు విజయవంతమైన ఫలితాలు అందించారని గ్రూప్ఎమ్ సౌత్ ఏషియా సీఈఓ శామ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
కేసు ఒక స్టేషన్లో.. పంచనామా మరో చోట
పీఎం లంక, ఎల్బీ చర్ల నరసాపురం మండలంలోని గ్రామాలు. ఈ గ్రామాల్లో ఏదైనా సమస్య ఎదురై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాలంటేనరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కి కాకుండా 18 కిలోమీటర్ల దూరంలోని మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంది. పశ్చిమగోదావరి,నరసాపురం: ఏదైనా సమస్య ఎదురైతే సొంత మండలంలోని పోలీస్‌స్టేషన్ కాకుండా దూరంగా ఉన్న వేరే మండలంలోని పోలీస్‌స్టేషన్‌కి ఆయా గ్రామాల ప్రజలు వెళ్లాల్సి వస్తోంది. ఇదీ నరసాపురం పోలీస్ సబ్‌డివిజన్‌లో పరిస్థితి. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేపట్టకపోవడంతో ప్రజలే కాకుండా, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా కూడా పోలీస్‌శాఖ పట్టించుకోకపోవడం విశేషం. సబ్ డివిజన్లో 19 పోలీస్స్టేషన్లు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 19 పోలీస్ స్టేషన్లున్నాయి. నరసాపురం పట్టణం, రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం 1 టౌన్, భీమవరం 2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధి స్టేషన్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి పాలనా పరమైన ఇబ్బందులతో పోలీస్ సిబ్బంది సతమతమవుతున్నారు. దీంతో పాటు ఫిర్యాదుదారులు అనేక అవస్థలు పడుతున్నారు. నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మత్స్యపురి, తుందుర్రు గ్రామాలు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు భీమవరం మండల పరిధిలో ఉండగా, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలంలోనిది. అలాగే నరసాపురం రూరల్ మండలంలోని ఎల్బీ చర్ల, పసలదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే భీమవరం మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. దీనివల్ల అటు పోలీస్ సిబ్బంది, ఇటు కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. పాలకొల్లు మండలానికి చెందిన అడవిపాలెం పోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. అమలుకు నోచుకోని ప్రభుత్వ నిర్ణయం ఏ మండలంలోని గ్రామాలు ఆయా మండలాల పోలీస్స్టేషన్ల పరిధిలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని 2008లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఆలోచన ఇంతవరకూ అమలు కాలేదు. ఈలోపు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది. అలాగే గతంలో డీఎస్పీలుగా పని చేసిన అనేకమంది అధికారులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులను, స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఉన్నతాధి కారులకు లేఖలు రాశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు జరిగితే కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణకు, శవ పంచనామాకు మరో మండలానికి చెందిన రెవెన్యూ అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పాటు ఫిర్యాదుదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక సంబంధిత కీలక రెవెన్యూ పత్రాలను ఆయా మండల కేంద్రాలకు వెళ్లి తిరిగి తమ ప్రాంత పోలీస్‌స్టేషన్ అధికారులకు అందించాల్సి వస్తోంది. ప్రతి నియోజక వర్గానికి ఓ సర్కిల్ కార్యాలయం ఉండేలా స్టేషన్లను పునర్ వ్యవస్థీకరించాలని నాలుగేళ్ల క్రితం పోలీస్‌శాఖ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికైనా స్టేషన్ పరిధిల్లో మార్పులు అంశాన్ని పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. -
పన్నుల శాఖలో బదిలీలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పన్నుల శాఖలో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. శాఖ పునర్ వ్యవస్థీకరణ సాకుతో బదిలీలను అధికారులు నిలిపేశారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పునర్ వ్యవస్థీకరణ చేపడుతున్నందున అది పూర్తయ్యేవరకు బదిలీలుండవని తేల్చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పనిభారం పెరగడంతో సర్కిళ్లను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించిన అధికారులు.. ఒక్కో సర్కిల్లో 1,500–2,200 మంది డీలర్లు ఉండేలా ప్రస్తుత 91 సర్కిళ్లకు అదనంగా మరో 5 కలిపి 96 సర్కిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ డివిజన్ల పెంపుపై మాత్రం ప్రతిపాదన చేయలేదు. 8 నుంచి 10 సర్కిళ్లు కలిపి ఓ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే డివిజన్ల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. బదిలీల నిలిపివేతపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు.. పునర్ వ్యవస్థీకరణ చేయడంలో తమకు ఇబ్బంది లేదని, కానీ ఆ కారణంతో బదిలీలు నిలిపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. జీఎస్టీ నాటి ప్రతిపాదన గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. దీని వల్ల పన్నుల శాఖ పరిధిలోని ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని.. వెంటనే సర్కిళ్లు, డివిజన్లను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 120 సర్కిళ్లు, 15 డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. అయితే అప్పటి నుంచి ఆ ఫైలు పెండింగ్‌లో ఉంది. అదే సాకుతో పదోన్నతులనూ అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ పునర్ వ్యవస్థీకరణ అంటూ బదిలీలు ఆపుతుండటంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా బదిలీల్లేవని, ఈ సాకుతో మళ్లీ నిలిపితే ఇప్పట్లో బదిలీలు జరగవేమోనని ఆందోళన చెందుతున్నారు. -
పోలీస్ రేంజ్‌లపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖలోనూ నూతన రేంజ్‌లు, జోన్ల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో రెండు జోన్లు, నాలుగు రేంజ్‌లు ఉన్నాయి. వెస్ట్‌జోన్ (హైదరాబాద్) కింద ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. అదేవిధంగా నార్త్‌జోన్ (వరంగల్) కింద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు వెస్ట్‌జోన్ కింద, మరికొన్ని ప్రాంతాలు నార్త్‌జోన్ కిందకు వచ్చాయి. దీనితో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ల పోస్టింగులు, వారి పై తీసుకునే క్రమశిక్షణ చర్యలు, మానిటరింగ్ తదితరాల పర్యవేక్షణకు సరిహద్దు సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జోన్లు, మల్టీజోన్లతో పోలీస్ శాఖలో రేంజ్‌లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ క్లారిటీ వచ్చినట్టుగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌లున్నాయి. జోన్లకు ఐజీ హోదా కలిగిన అధికారులుండగా, రేంజ్‌లను డీఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా మరో రెండు... ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్లుండగా, వీటికి తోడుగా మరో రెండు రేంజ్‌లు ఏర్పాటు చేసే అవకాశముందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదేవిధంగా ఇప్పుడున్న రేంజ్‌ల పేర్లు కూడా మార్పు జరిగే అవకాశం ఉందని, మొత్తంగా 6 రేంజ్‌లకు కొత్తపేర్లతో పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో రేంజ్ కింద 5 జిల్లాల పోలీస్ యూనిట్లు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జోన్‌తో పాటు మరో జోన్ కూడా ఏర్పాటు జరిగితే ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌ల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన కమిషనరేట్లలో బదిలీలు, క్రమశిక్షణ చర్యలు ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ వస్తుందని, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తామని సీనియర్ ఐపీఎస్‌లు స్పష్టం చేశారు.