
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- మార్గదర్శకాలకు విరుద్ధంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు..
సత్తుపల్లి : పరిపాలన సౌలభ్యం పేరుతో అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తున్నారన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లా విభజన టీఆర్‌ఎస్ పార్టీ సొంత వ్యవహారంగా చూస్తోందని, రాజకీయ సమీకరణలు ,కారణాలతో జిల్లాలను విభజించడం సరికాదన్నారు. నిపుణుల కమిటీ, అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు అందించిన సూచనలు, సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఇష్టారీతిన పునర్విభజన చేస్తుందని విమర్శించారు. జిలాల్ల పునర్విభజన ముసాయిదా అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరమే చర్యలు చేపట్టాలన్నారు.
సత్తుపల్లి లేదా కల్లూరు రెవెన్యూ డివిజన్‌లగా ఏర్పాటు చేయాల్సి ఉండగా మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వైరా రెవెన్యూ డివిజన్‌ను తెరపైకి తీసుకురావడం వెనక మతలబు ఏమిటో అర్ధంకావడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. డివిజన్‌ల ఏర్పాటులో ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రభుత్వమార్గదర్శకాల ప్రకారం45 కిలోమీటర్లు దూరంలో ఉండాలని స్పష్టంగా పేర్కొన్నా, 20 కిలోమీటర్ల దూరంలోనే ఖమ్మం రెవెన్యూ డివిజన్‌కు దగ్గరలో వైరా డివిజన్‌ను ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి మహేష్, వల్లభనేని పవన్, దూదిపాల రాంబాబు, చాంద్‌పాషా, అద్దంకి అనిల్, చక్రవర్తి, తడికమళ్ల ప్రకాశరావు, మల్లికార్జున్ ఉన్నారు.