సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది.
ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది.
దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్‌సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్‌సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్‌కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్‌సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం.
ఈఎన్‌సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఐడీసీ లిఫ్టులకు తాళాలు
కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్‌లు బాస్‌లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు.
ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం
పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు.
► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది.
► కాళేశ్వరం ఈఎన్‌సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్‌సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి.
► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నాగర్‌కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.
► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది.
► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్‌ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment