పునర్విభజనలో రాజకీయం తగదు
♦ విభజనలో ప్రజల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
♦ భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూములను సేకరించాలి
♦ పార్టీని బతికించుకోవడం కోసం విభేదాలు వీడండి
♦ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పాలనా సౌలభ్యం మేరకు జిల్లాను విభజించాలి తప్ప.. రాజకీయ లబ్ధికోసం అడ్డగోలుగా విడగొడితే సహించేదిలేదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. జిల్లా యూనిట్‌గా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని.. జిల్లా పరిధిని మరో జిల్లా పరిధిలోకిగానీ, అక్కడి పరిధిని జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలను ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, మాజీ మంత్రి డీకే అరుణ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ప్రస్తుత జిల్లా పరిధిలోనే జిల్లాలను విభజించాలని.. జిల్లా కేంద్రాల విషయంలోనే శాస్త్రీయత పాటించాలని తీర్మానించింది. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూములను సమీకరించాలని, జీఓ 123 ప్రకారం భూములను తీసుకుంటే ఉద్యమిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో భూముల వేలం ద్వారా వచ్చే రాబడిలో అధికశాతం జిల్లా అవసరాలకే వెచ్చించాలని డిమాండ్ చేశారు.
ఐక్యంగా సాగండి...
కష్టకాలంలో ఉన్న పార్టీని.. అధికారపీఠం వైపు నడిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అరుణ పిలుపునిచ్చారు. కొందరు నేతల మధ్య అభిప్రాయభేదాలున్నా.. వాటిని పక్కనపెట్టి ముందుకు సాగాలని హితవు పలి కారు. పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన గోదావరి నీటిని సొంత నియోజకవర్గానికి మళ్లించుకుపోయారని దుయ్యబట్టారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పారిశ్రామిక, తాగు, సాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారని, ప్రాజెక్టు కుదించడం ద్వారా ఈ జలాలను ఎలా సమకూరుస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పేదల గుడిసెలను క్రమబద్ధీకరించాలి...
ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన గుడిసెలను క్రమబద్ధీకరించాల్సిందేనని మాజీ శాసనసభ్యుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌లో ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసిస్తున్నవారి స్థలాలను రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని, బేషరతుగా వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేశవాపూర్‌లో ప్రతిపాదించిన రిజర్వాయర్ వల్ల వేలాది ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బండారి రాజిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎం.కోదండరెడ్డి, నారాయణరావు,డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు కుసుమ కుమార్, రవీందర్‌రావు, నాగబండి శ్రీరామ్, పార్టీ నేతలు లక్ష్మారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీ ఏకైక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.