సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.
ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్‌రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్‌రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్‌గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.
అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment