సాక్షి, ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వర్గపోరుతో కేడర్‌ను అయోమయంలో నెట్టేసిన తెలంగాణ బీజేపీకి బూస్టింగ్ ఇచ్చే పనిలో తలమునకలైంది అధిష్టానం. నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాల నడుమ.. వారం రోజులుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి బీజేపీ పార్టీ శ్రేణులు.
వర్గపోరుకు చెక్ పెట్టేలా హస్తినలో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. క్యాడర్‌లో నెలకొన్న అయోమయాన్ని తొలగించడానికి.. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నాయకత్వంలో ప్రధాన మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కీలక నేతలు అసంతృప్తికి లోనుకాకుండా చూసుకుంటూనే.. కేడర్‌ను పటిష్టంగా మార్చాలన్నది బీజేపీ అధిష్టానం అభిమతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణకి.. బీజేపీ తెలంగాణ బీజేపీ చీఫ్ పగ్గాలు అప్పజెప్పాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఉన్న పలువురి పేర్ల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్(ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు)ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తోందట. ఇక ఇప్పటికే ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార సారథిగా బాధ్యతలు అప్పజెప్పగా.. ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పనులు మొదలుపెట్టారు కూడా. తద్వారా.. పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది.
గత పక్షం రోజులుగా ఇక్కడి నుంచి నేతలు వరుసగా అక్కడికి వెళ్తుండడం.. వాళ్లతో మంతనాలు కొనసాగిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పుపై సాధారణంగానే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నెల 15న ఖమ్మం లో అమిత్ షా పర్యటించనున్నారు. ఆ పర్యటనకు ముందే నాయకత్వ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment