నిర్ణయించాల్సింది రాష్ట్రపతే
టీబిల్లుపై చర్చకు గడువు పొడిగించడంపై దిగ్విజయ్
లోక్‌సభ ఎన్నికల్లోపే తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఇరుప్రాంతాల వారు పాల్గొని, తమ అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ సూచించారు. చర్చపై గడువు పొడిగింపు అంశం తన పరిధిలో లేదని, దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పునరుద్ఘాటించారు.
ఇందుకోసం అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టేందుకు కృషిచేస్తామన్నారు. సోమవారమిక్కడ తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక విలీనంపై టీఆర్‌ఎస్‌తో మాట్లాడతామని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలు చేస్తున్న విజ్ఞప్తిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తె లిపారు.