తెలంగాణలో విగ్రహాల పేరుతో సాగుతున్న రగడ చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాని... బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతిగా లేదు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం తలపెట్టింది. దానిని కేటీఆర్ వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు స్పందించారు.
మిగతా వారి సంగతి ఏలా ఉన్నా సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాటలు మరి దురుసుగా ఉన్నాయి. 'నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసివేస్తావా... నీకు అధికారం అనేది కలలో మాట. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపడు అయితది. రాజీవ్ గాంధీ విగ్రహం తీయాడానికి తారిఖు చెప్పు. మా జగ్గన్నకు చెబుతా. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తది అంటూ అక్కడ ఆగకూండా రాజీవ్ గాంధీ విగ్రహంను ముట్టుకుంటే.. చెప్పు తెగకపోతే చూస్తా" అని హెచ్చరించారు.
కేటీఆర్ అసలు ఈ వివాదాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు. ఒక వేళ అభ్యంతరం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టవద్దని... తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. ఇప్పటికే మేధావులు పలువురు ఆ సూచన చేసారు. అంత వరకు ఆగకుండా కేటీఆర్ ఏకంగా రాజీవ్ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని అంటూ... కాంగ్రెస్‌ను రెచ్చగోట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరి అన్యాయంగా కేసీఆర్ ప్రస్తావన తెచ్చి అవమానించిన తీరు బాగాలేదు. "పోద్దున్న నుంచి రాత్రి వరకు తాగి ఫార్మ్ హౌస్ లో పోర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా అంటూ దారుణంగా మాట్లాడారు". అంతే కాక వాళ్ల అయ్య పోయేది ఎప్పుడు... వీడు పెట్టేది ఏప్పుుడు అంటూ పరుష భాషను వాడడం ఏ మాత్రం సరికాదు. ఇది ఆయన హోదాకు ఏ మాత్రం తగదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఏట్లాపడితే అట్లా మాట్లాడి హైలైట్ అయ్యేవారు. ఇప్పటికి అలాంటి పంథాను కొనసాగించాలని అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా కేసీఆర్ పేరు బయటకు తీసుకువచ్చి అది కూడా పిల్లల ముందు మాట్లడడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎంత కాదు అన్న కేసీఆర్... పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అనే విషయం మర్చిపోకుడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నడిపి దేశం అంతటి దృష్టిని కేసీఆర్ ఆకర్షించారు. ఈ రోజు రేవంత్ సీఎంగా ఉన్నారంటే అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఫలితమే కదా! ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ విలువ తగ్గుతుందా! కేసీఆర్ కూడా గతంలో కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లడిన సందర్భరాలు లేకపోలేదు. అయినప్పటికి రేవంత్ కామెంట్స్ శ్రుతిమించాయని చెప్పకతప్పదు.
ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకా నాలుగేళ్ల వరకు ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి ఎవరు వెళ్లరు. అలాంటిది రాజీవ్ విగ్రహంను టచ్ చేయి... చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ మాట్లడాల్సిన అవసరమే లేదు. ఒక పక్క బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం రాదు అంటునే... రేవంత్ ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే కేటీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అని రేవంత్ సర్కార్‌కు ఒక ఐడియా వచ్చినట్టు అయ్యింది. వెంటనే సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని... స్థలాన్ని కూడా పరిశీలించారు.
డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ఇంత కాలం క్రెడిట్ అంతా కేసీఆర్‌దే అని చెప్పాలి. తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయించి అనేక చోట్ల ప్రతిష్టించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ఆఫీసులో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఎందువల్లో కాని సచివాలయంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ వాడుకుంటున్నారు.
ఇక రేవంత్ కామెంట్స్‌పై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందులోను అధ్వాన్నపు భాషా మాట్లడడం మర్యాదగా లేదు. తాము అధికారంలోకి రాగానే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తామని కేటీఆర్ అనడం పద్దతి కాదు. రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని అన్నది గుర్తించుకోవాలి. రేవంత్, కేటీఆర్ రగడలో సంబంధం లేని రాజీవ్ గాంధీ, కేసీఆర్‌ల పేర్లు తీసుకుని వారిద్దరిని అవమానిస్తూ మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చీఫ్ మినిస్టర్ బధులు.. చీప్ మినిష్టర్ అని అనడం, డిల్లీ గులాం అనడం రేవంత్ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కామెంట్ చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చెత్త అన్న పదాన్ని వాడడం కేటీఆర్ తప్పు అయితే... కేసీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ తప్పు అని చెప్పాలి.
అధికారం కొల్పోయిన బాధ కేటీఆర్‌కు ఉండవచ్చు. అయినా ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే... వివాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు. అదే టైంలో ఛాన్స్ దోరికింది కదా అని మాజీ సీఎం కేసీఆర్‌ను బూతులు తిట్టిన మాదిరిగా రేవంత్ మాట్లడడం ఆయన అధికార అహంకారాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు అన్నిటిని గమనిస్తే రేవంత్, కేటీఆర్ ఇద్దరూ మానసిక రుగ్మతతో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. తెలంగాణ సమాజానికి కాని, తెలుగు ప్రజలకు కాని వీరి వ్యాఖ్యలు ఏ మాత్రం అదర్శవంతం కాదు. నేతలు తమను ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి కాని... ఆసహ్యించుకునేలా మాట్లడితే వారికే నష్టం. కాకపోతే బీజేపీకి చోటు ఇవ్వకుండా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య డైలాగ్ వార్ నడుపుతుండడమే కొసమెరుపు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment