
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు.