పదవులు పదిలం!
♦ స్థానిక సంస్థల భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టత
♦ జిల్లాల విభజన నేపథ్యంలో అనుమానాలు నివృత్తి
♦ పదవీకాలం ముగిసేవరకు ప్రస్తుత పాలకవర్గాలకే పీఠం
♦ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతకు తప్పిన పదవీగండం
♦ మండలాల వ్యవస్థలో ఆచరించిన పద్ధతికే మొగ్గు
♦ ఊపిరి పీల్చుకున్న ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు
1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదు. వాటి పదవీ కాలం వరకు కొనసాగించారు. ఇప్పుడూ అదే పద్ధతిని అవలంబించనున్నారు.
ప్రస్తుత జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లనుంది.
స్థానిక సంస్థల ఉనికికి భంగం కలగకుండా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పదవీకాలం ముగిసేంతవరకు స్థానిక సంస్థల జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా మరో రెండున్నరే ళ్ల పదవీకాలం ఉన్న జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించేందుకు మొగ్గు చూపుతోంది. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు తుదిరూపు ఇస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల విభజనపై స్పష్టత కూడా వచ్చింది. మరోవారం పది రోజుల్లో మన జిల్లా ఎన్ని ముక్కలు కానుందో తేలనుంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో స్థానిక సంస్థల భవిష్యత్తు ఏమిటనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ఈ అంశం ముడిపడి ఉండడంతో ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. న్యాయపర, రిజర్వేషన్ల సమస్య తలెత్తకుండా వీటి విభజనపై దృష్టి పెట్టకపోవడమే మంచిదనే భావనకొచ్చాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ సభ్యులు.. రేపు జిల్లాల విభజన తర్వాత మరో జిల్లా పరిధిలోకి చేరితే పరిస్థితేంటనే సందేహాన్ని పలువురు కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
వీరందరి అనుమానాన్ని నివృత్తి చేసిన ప్రభుత్వ పెద్దలు.. 1985లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో అప్పటికే కొలువుదీరిన పంచాయతీ సమితులను రద్దు చేయలేదని, వాటి పదవీకాలం వరకు కొనసాగించారని, అదే పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తామని స్పష్టం చేశారు. 1987 వరకు సమితులు కొనసాగించారని, ప్రస్తుత పాలకవర్గాలు కూడా ఐదే ళ్ల పదవీకాల ం ముగిసేవరకు ఉంటాయని స్పష్టతనిచ్చారు. ప్రస్తుత జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి యాలాల మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈ మండలం జిల్లాల పునర్విభజనలో వికారాబాద్ కేంద్రంగా కొనసాగే రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. చేవేళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి.
మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏ జిల్లాలో చేరుతాయి? కొత్త జిల్లాలుగా మారుతాయా? అనే అంశంపై ఇంకా అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ భవితవ్యంపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. అయితే, ఇటీవల జరిగిన సమావేశంలో ప్రభుత్వం.. జిల్లా పరిషత్‌లను యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గు చూపాయి. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పదవుల విభజన కూడా చేపడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందనే అభిప్రాయానికొచ్చాయి. అదేసమయంలో అర్ధంత రంగా ఈ పదవులను అర్డినెన్స్ ద్వారా రద్దు చేసి ప్రత్యేకాధికారుల పాలనను తెచ్చినా.. రాజకీయంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పీఠానికి ఢోకాలేనట్లే! పునర్విభజనతో జిల్లా రెండు, మూడు జిల్లాలుగా ఏర్పడినా.. ఆ జిల్లాల పగ్గాలు కూడా ప్రస్తుత చైర్‌పర్సన్ చేతిలోనే ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి.