
కొత్త జిల్లాలకు ‘జోన్ల’ తంటా
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు జోనల్ వ్యవస్థతో ఇబ్బందులు ఎదురుకానున్నాయి! 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండుసార్లు ప్రకటించారు. సీఎం సూచనలకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు కొత్త జిల్లాల తుది ముసాయిదా ఖరారు చేశారు. ఏ జిల్లాలో ఏయే ప్రాంతాలుండాలి, ఏయే నియోజకవర్గాలు, మండలాలు ఎందు లో కలపాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. అందుకే మరింత అధ్యయనం అవసరమని భావించిన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవటంతోపాటు జూన్ 2 తర్వాత వర్క్‌షాప్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇదే సందర్భంలో జోనల్ వ్యవస్థతో తలెత్తే చిక్కుముళ్లు, ఇబ్బందులు, ఉద్యోగులు లేవనెత్తుతున్న సందేహాలపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
జిల్లాలు మారినా రెండే జోన్లు
విభజన తర్వాత 371 డీ ప్రకారం తెలంగాణలో రెండు జోన్లు మిగిలాయి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అయిదో జోన్‌లో ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలు ఆరో జోన్‌లో ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు ఈ జోన్ల పరిధిని పరిగణనలోకి తీసుకోవటం తప్పనిసరి కానుంది. జోన్ల పరిధిలో ఏ మాత్రం మార్పు లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే రాజ్యాంగ, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అయిదు, ఆరో జోన్ సరిహద్దుల్లో ఉన్న రంగారెడ్డి-నల్లగొండ, మెదక్-వరంగల్, మెదక్-కరీంనగర్, నిజామాబాద్-కరీంనగర్, నల్లగొండ-వరంగల్ జిల్లాల మధ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ సరిహద్దు జిల్లాల్లో ఉన్న మండలాలు, ప్రాంతాలను పునర్‌వ్యస్థీకరణలో జోన్ దాటించటం సాధ్యమయ్యేలా లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చిక్కుకు మచ్చుతునకలివీ..
ఉదాహరణకు మెదక్ జిల్లాలో ఉన్న సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి.. పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలోని జనగాం పరిసర ప్రాంతాలను కలిపితే జోనల్ చిక్కు తప్పదు. కొత్తగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో జనగాంను కలిపినా.. అదే సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే జోన్ల సరిహద్దులు దాటకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులు, కొత్త నియామాకాల విషయంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటికే టీఎస్‌పీస్సీ వివిధ పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్-2 నియామకాలకు జోన్ల వారీగానే పోస్టులను ప్రకటించింది.
లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త జిల్లాలు జోన్ల సరిహద్దులు దాటితే.. ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు, ఉద్యోగులను ఏ జోన్‌లో పరిగణించాలనే సమస్య ఉత్పన్నం కానుంది. ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుంది. జోనల్ వ్యవస్థను మార్చటం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. జోన్ల వ్యవస్థలో మార్పుచేర్పులు చేయాలంటే కేంద్రం ఆమోదం పొందడంతోపాటు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుంది. ఇదంతా ఉన్నఫళంగా సాధ్యమయ్యే అంశం కానందున ఏ జోన్ పరిధిలోని జిల్లాలను అదే పరిధిలో పునర్‌వ్యవస్థీకరించటం తప్ప మరో గత్యం తరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ జోన్ జిల్లాలు అక్కడే..
తెలంగాణను మొత్తం 24 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఖరారైన తుది ముసాయిదా ప్రకారం అయిదో జోన్‌లో ఉన్న నాలుగు జిల్లాలను తొమ్మిది జిల్లాలుగా, ఆరో జోన్‌లో ఉన్న ఆరు జిల్లాలను 15 జిల్లాలుగా విభజిస్తారు. పునర్‌వ్యవస్థీకరణతో జోన్లకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.