
ఆర్థిక లోటు పూడ్చండి
కేంద్రానికి చంద్రబాబు వినతి
{పధాని, కేంద్ర మంత్రులతో భేటీ
సీమాంధ్రకు ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని విజ్ఞప్తి
{పమాణ స్వీకారానికి రావాలని ప్రధానికి, మంత్రులకు ఆహ్వానం
తెలంగాణ సీఎంకు ఆహ్వానంపై ‘చూద్దాం’ అన్న బాబు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు దాదాపు రూ.13,579 కోట్ల లోటు ఏర్పడుతుందని, దీనిని పూడ్చాలని నూతన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ భవన్‌లో రెండు విడతలుగా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రితోపాటు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను, ప్రణాళిక శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ను, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసినట్లు తెలిపారు. తన ప్రమాణస్వీకారానికి రావడంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులను కేంద్ర మంత్రులందరికీ వివరించా. విభజన ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. అప్పులను, విద్యుత్తును జనాభా ప్రాతిపదికగా విభజించారు. ఆస్తులను భౌగోళికంగా ఇచ్చేశారు. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ వల్ల తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చింది. సీమాంధ్రకు మాత్రం వచ్చే 9 నెలల్లోనే భారీ లోటు ఏర్పడనుంది. ఒక పక్క అప్పు క డుతూ మరోపక్క ఆదాయం సంపాదించాలి. దీన్ని ఎలా చేయాలని ఒక్క మాట కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేశారు. ఈ లోటును పూడ్చాలని ఆర్థిక మంత్రిని కోరాం. తగిన ఆర్థిక రక్షణ కల్పించాలని ఆర్థిక సంఘం చైర్మన్‌ను కోరాం. విభజన సమయంలో పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. ఈ మూడింటినీ తక్షణం అమలు చేయాలని కోరాం. ఇప్పటివరకు ఉన్న హామీల అమలుకు ఒక సెల్ వేసి మానిటరింగ్ చేయాలని ప్రధానిని కోరాం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు. టీఆర్‌ఎస్ కావాలని రాద్ధాంతం చేసింది’ అని పేర్కొన్నారు.
కృష్ణా, గోదావరి నదులకు అపెక్స్ కౌన్సిల్
కృష్ణా, గోదావరి నదులకు అపెక్స్ కౌన్సిల్, బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. నిర్దిష్ట కాలపరిమితితో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, చత్తీస్‌గఢ్‌లకు ఇచ్చినట్లుగానే ముందుగా సీమాంధ్రకు 30 టీఎంసీల నీళ్లివ్వాలని కోరామన్నారు. విభజన సవ్యంగా సాగేలా చూడాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్లు చెప్పారు. ఐఐటీ, తదితర సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విభజన తరువాత కరెంటు నష్టాలను సర్దుబాటు చేయాలని విద్యుత్తు మంత్రి పియూష్ గోయల్‌ను కోరామన్నారు. గంగవరంలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ నిర్మాణం, పెట్రోలియం కారిడార్ పునరుద్ధరణ చేపట్టాలని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరినట్లు చెప్పారు. త్వరగా పెటోల్రియం యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరగా హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరినట్లు చెప్పారు. రైతు రుణమాఫీపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో మాట్లాడినట్టు తెలిపారు. ‘వీటిపై రివ్యూ చేశాం. మళ్లీ చేస్తాం. అమలుకు కట్టుబడి ఉన్నా. తొలి సంతకం దానిపైనే చేస్తా’ అని చెప్పారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలుస్తున్నారా అన్న ప్రశ్నకు.. ‘చూద్దాం.. ’ అని బదులిచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టిస్తామని చెప్పారు.