
రైతులకు నేడు పీఎం కిసాన్ మూడో విడత కేంద్రం సాయం
అదే కూటమిలో ఉన్న చంద్రబాబు హామీ అటకెక్కేసింది
ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయమంటూ సూపర్ సిక్స్‌లో బాబు హామీ
వ్యవసాయ సీజన్ ముగుస్తున్నా పైసా విదల్చని ప్రభుత్వం
బడ్జెట్‌లో కేటాయించిన రూ.1000 కోట్లు ఏమైనట్టు?
రెండేళ్ల సాయం కలిపి ప్రతి రైతుకు రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్
ఐదేళ్లూ సీజన్‌కు ముందే సాయం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చీరాగానే పీఎం కిసాన్ పథకంపై తొలి సంతకం చేసిన ప్రధాన మంత్రి మోదీ మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాలుగో రోజునే తొలి విడత సాయం పంపిణీ చేశారు. చెప్పిన సమయానికే రెండో విడతా ఇచ్చారు.
ఇప్పుడు సోమవారం మూడో విడత సాయం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కానీ, అదే కూటమితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం అధికారంలోకి వస్తే ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని అటకెక్కించేశారు. రైతులను మరోసారి వంచించారు.
పీఎం కిసాన్‌లో మొదటి స్థానంలో ఏపీ
పీఎం కిసాన్ పథకం తొలి విడతలో రాష్ట్రానికి చెందిన 40.91 లక్షల మంది అర్హులకు రూ.834.61కోట్లు కేంద్రం జమ చేసింది. రెండో విడతలో 41.84 లక్షల మందికి రూ.836.89 కోట్లు జమ చేసింది. మూడో విడతలో 42.04 లక్షల మంది అర్హత పొందగా, వీరికి రూ.840.95 కోట్లు జమచేయనున్నారు.
ఈ నెల 24న బీహార్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ సొమ్ములు జమ చేస్తారు. గత మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించిన సాయంతో కలిపితే ఇది 19వ విడత సాయం. ఇలా మొత్తం రూ.17,219.45 కోట్ల మేర రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతున్నారు. గడిచిన ఐదేళ్లలో పీఎం కిసాన్ అమలులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది.
ఆ రూ.1000 కోట్లు దేనికి ఖర్చు చేశారు ?
ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ సూపర్ సిక్స్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు జమ చేయాల్సి ఉంది. 4 నెలలు ఓటాన్ అకౌంట్‌తో గడిపేసిన టీడీపీ ప్రభుత్వం నవంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. పీఎం కిసాన్ మూడో విడతతో కలిపి అన్నదాత సుఖీభవ ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో కొంతవరకైనా కష్టాల నుంచి గట్టెక్కవచ్చని రైతులు ఎదురు చూశారు.
పీఎం కిసాన్ మూడో విడతా అందుతోంది. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అలాంటప్పుడు బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు ఎందుకు కేటాయించారు? దేని కోసం ఖర్చు చేస్తారో చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్ జగన్ సాయం
ఏటా మూడు విడతల్లో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చీ రాగానే ఇచ్చిన హామీకంటే మిన్నగా ఏటా రూ.13,500కు సాయాన్ని పెంచి, తొలి ఏడాది నుంచే పంపిణీ ప్రారంభించి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రతీ ఏటా మే/జూన్‌లలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున 53.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ. 34,288.17 కోట్లు జమ చేసి అండగా నిలిచారు.
ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సిందే
రైతులను మభ్యపెట్టేందుకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆచరణలో పైసా కూడా విదల్చలేదు. ఇలాంటప్పుడు బడ్జెట్‌లో ఎందుకు కేటాయించారో సమాధానం చెప్పాలి. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రెండేళ్ల సాయం కలిపి ప్రతి రైతుకు రూ.40 వేల చొప్పున జమ చేయాలి. లేకుంటే రైతుల తరపున ఉద్యమిస్తాం.– జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం
పెట్టుబడి సాయం అందక అగచాట్లు
జగన్ ప్రభుత్వంలో ఏటా సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందేది. ఈ ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. దీంతో సాగుకు పెట్టుబడి దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.3 నుంచి రూ.5కు వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేశారు.
అయినా వైపరీత్యాల బారిన పడి, ఆశించిన స్థాయిలోదిగుబడులు రాలేదు. పంటకు మద్దతు ధరా దక్కక తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సాయమందించాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment