జీఎంఆర్‌ పునర్‌వ్యవస్థీకరణ | GMR Group restructures flagship GIL | Sakshi
Sakshi News home page

జీఎంఆర్‌ పునర్‌వ్యవస్థీకరణ

Published Fri, Aug 28 2020 4:30 AM | Last Updated on Fri, Aug 28 2020 4:30 AM

GMR Group restructures flagship GIL - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌) పునర్‌వ్యవస్థీకరణ చేపడుతోంది. లిస్టెడ్‌ కంపెనీ అయిన జీఐఎల్‌ నుంచి ఎనర్జీ, అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారాలను వేరు చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారం మాత్రమే జీఐఎల్‌లో భాగం కానుంది. ఎనర్జీ, అర్బన్‌ ఇన్‌ఫ్రా, ఈపీసీ విభాగాలు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు (జీపీయూఐఎల్‌) బదిలీ అవుతాయి. 

గురువారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జీఐఎల్‌ వాటాదారులు జీపీయూఐఎల్‌లో అదే నిష్పత్తిలో వాటాదారులు అవుతారు. జీఐఎల్‌లో రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి 10 షేర్లకుగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక జీపీయూఐఎల్‌ షేరును అదనంగా జారీ చేస్తారు. జీపీయూఐఎల్‌ లిస్టింగ్‌ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.

ఎయిర్‌పోర్టులపై మరింత దృష్టి...
పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఎయిర్‌పోర్టుల వ్యాపారంపై మరింత ఫోకస్‌ చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరించింది. ‘కొన్నేళ్లుగా జీఐఎల్‌ ఎన్నో రెట్లు వృద్ధి సాధించింది. ఈ కంపెనీ కింద విభిన్న వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మౌలిక రంగ వ్యాపారంలో వృద్ధిని నడిపించడానికి ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీలు ఉండాలని వాటాదారులు సూచిస్తున్నారు. పలు విధానాలను మేం పరిశీలిస్తున్నాం.

ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నాం. జీపీయూఐఎల్‌లో ఎయిర్‌పోర్టేతర వ్యాపారాలు వాటాదారులకు విలువ చేకూర్చేందుకు మెరుగైన స్థానంలో ఉన్నాయి’ అని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ, సీఈవో గ్రంధి కిరణ్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎయిర్‌పోర్టుల రంగంలో భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయిన జీఎంఆర్‌.. ఫిలిప్‌పైన్స్, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవా, గ్రీస్‌లో విమానాశ్రయాలను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు రూ.834 కోట్ల నష్టం
జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.834 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.336 కోట్ల నష్టం నమోదైంది. టర్నోవరు రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు వచ్చి చేరింది. ఎయిర్‌పోర్ట్స్‌ విభాగం టర్నోవరు రూ.494 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.1,460 కోట్లు నమోదైంది. మెరుగైన పనితీరుతో విద్యుత్‌ విభాగం టర్నోవరు రూ.116 కోట్ల నుంచి రూ.300 కోట్లకు ఎగసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement