GMR Infra
-
జీఎంఆర్ ఇన్ఫ్రాలో ‘ఎయిర్‌పోర్ట్స్’ విలీనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో (జీఐఎల్)లో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ (జీఏఎల్) విలీనం కానుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా పటిష్టంగా ఎదిగేందుకు ఇది దోహదపడగలదని జీఐఎల్ వివరించింది. ఎయిరోపోర్ట్స్ డి పారిస్ (గ్రూప్ ఏడీపీ)తో జీఎంఆర్ భాగస్వా మ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయపడగలదని పేర్కొంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రా 2020లో గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తాజా విలీనానంతరం జీఐఎల్‌లో జీఎంఆర్ గ్రూప్‌నకు అత్యధికంగా 33.7 శాతం, గ్రూప్ ఏడీపీకి 32.3 శాతం, పబ్లిక్ వాటాదారుల దగ్గర 34 శాతం వాటాలు ఉంటాయి. 10 ఏళ్ల విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల జారీ ద్వారా గ్రూప్ ఏడీపీ నుంచి 331 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,900 కోట్లు) సమీకరించనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. -
జీఎంఆర్ చేతికి ఇండోనేషియా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాలో భాగమైన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) తాజాగా ఇండోనేషియాలో ఒక విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. మెడాన్‌లోని క్వాలానాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకు కోసం అత్యధికంగా బిడ్ చేసిన సంస్థగా నిల్చింది. మెడాన్ ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ అథారిటీ అయిన అంకాశ పురా 2 (ఏపీ2) ఈ విషయాన్ని ప్రకటించినట్లు జీఎంఆర్ వెల్లడించింది. వ్యూహాత్మక భాగస్వామి ఎంపికకు సంబంధించి గెలుపొందిన బిడ్డర్‌గా తమ సంస్థ పేరును ఖరారు చేసినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఏపీ2కు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. బిడ్డింగ్ లాంఛనాలు పూర్తి చేశాక, వచ్చే కొద్ది రోజుల్లో లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖర్లోగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు దక్కించుకోవడంపై జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ (ఇంధనం, అంతర్జాతీయ విమానాశ్రయాల విభాగం) శ్రీనివాస్ బొమ్మిడాల హర్షం వ్యక్తం చేశారు. మెడాన్ ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇండొనేషియాలోని ఇన్ఫ్రా అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఆయన పేర్కొన్నారు. -
జీఎంఆర్ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఐఎల్ నుంచి ఎనర్జీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలను వేరు చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారం మాత్రమే జీఐఎల్‌లో భాగం కానుంది. ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ విభాగాలు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు (జీపీయూఐఎల్) బదిలీ అవుతాయి. గురువారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జీఐఎల్ వాటాదారులు జీపీయూఐఎల్‌లో అదే నిష్పత్తిలో వాటాదారులు అవుతారు. జీఐఎల్‌లో రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి 10 షేర్లకుగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక జీపీయూఐఎల్ షేరును అదనంగా జారీ చేస్తారు. జీపీయూఐఎల్ లిస్టింగ్ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టులపై మరింత దృష్టి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎయిర్‌పోర్టుల వ్యాపారంపై మరింత ఫోకస్ చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరించింది. ‘కొన్నేళ్లుగా జీఐఎల్ ఎన్నో రెట్లు వృద్ధి సాధించింది. ఈ కంపెనీ కింద విభిన్న వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మౌలిక రంగ వ్యాపారంలో వృద్ధిని నడిపించడానికి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలు ఉండాలని వాటాదారులు సూచిస్తున్నారు. పలు విధానాలను మేం పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నాం. జీపీయూఐఎల్‌లో ఎయిర్పోర్టేతర వ్యాపారాలు వాటాదారులకు విలువ చేకూర్చేందుకు మెరుగైన స్థానంలో ఉన్నాయి’ అని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో గ్రంధి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎయిర్‌పోర్టుల రంగంలో భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయిన జీఎంఆర్.. ఫిలిప్పైన్స్, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవా, గ్రీస్‌లో విమానాశ్రయాలను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.834 కోట్ల నష్టం జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.834 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.336 కోట్ల నష్టం నమోదైంది. టర్నోవరు రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు వచ్చి చేరింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగం టర్నోవరు రూ.494 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.1,460 కోట్లు నమోదైంది. మెరుగైన పనితీరుతో విద్యుత్ విభాగం టర్నోవరు రూ.116 కోట్ల నుంచి రూ.300 కోట్లకు ఎగసింది. -
జీఎంఆర్ ఇన్ఫ్రా చేతికి జీఏఎల్ పగ్గాలు
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను జీఎంఆర్ ఇన్ఫ్రా సొంతం చేసుకుంది. జీఏఎల్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో వివాదాన్ని ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకున్నట్లు జీఎంఆర్ ప్రకటించింది. ఈ సెటిల్మెంట్లో భాగంగా పీఈ ఇన్వెస్టర్లకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (జీఏఎల్) 5.86 శాతం ఈక్విటీ, 3,560 కోట్ల రూపాయల నగదును చెల్లించనున్నట్లు తెలిపింది. ఎస్బీఐ మెక్వయిరీ, స్టాండర్డ్ చార్టర్డ్, జేఎం ఫైనాన్షియల్ ఓల్డ్లేన్ తదితర పీఈ ఇన్వెస్టర్లు 2010– 11, 2011–12లో జీఏఎల్‌లో రూ.1,478 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాయి. ఈ సంస్థలన్నీ కలిసి జీఏఎల్‌లో కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) రూపంలో పెట్టుబడి పెట్టాయి. జీఏఎల్‌లో మెజారిటీ వాటా కోసం పీఈ ఇన్వెస్టర్ల వాటాలను జీఎంఆర్ ఇన్ఫ్రా కొనుగోలు చేయనుంది. ఇరు పక్షాలు ఈ విషయమై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వద్ద వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. పరిష్కార ఒప్పందం ప్రకారం అన్ని పార్టీలు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించుకుంటాయని జీఎంఆర్ సంస్థ స్టాక్ ఎక్చేంజ్‌లకు తెలిపింది. జీఎంఆర్ గ్రూప్‌నకు జోష్ తాజా సెటిల్మెంట్ జీఎంఆర్ గ్రూప్‌నకు కలిసివచ్చే అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆర్బిట్రేషన్ కొలిక్కి రావడంతో నానాటికీ విస్తరిస్తున్న ఎయిర్పోర్ట్ వ్యాపారంలో మరిన్ని అవకాశాలు పొందేందుకు జీఎంఆర్‌కు వీలు చిక్కుతుందని విశ్లేషించారు. సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తయ్యాక జీఏఎల్‌లో జీఎంఆర్ ఇన్ఫ్రా, దాని అనుబంధ సంస్థలకు కలిపి 91.95 శాతం వాటా, ఎంప్లాయి వెల్ఫేర్ ట్రస్ట్‌కు 2.19 శాతం వాటా, ఇన్వెస్టర్లకు 5.86 శాతం వాటాలుంటాయి. ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా వ్యాపారంపై బుల్లిష్‌గా ఉన్నామని, తాజా సెటిల్మెంట్ తాము మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తుందని జీఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్ విభాగం చైర్మన్ జీబీఎస్ రాజు చెప్పారు. వాల్యుయేషన్ లెక్కలు ఇలా... జీఏఎల్ వాల్యూషన్‌ను 21వేల కోట్ల రూపాయలుగా లెక్కించామని, ఇందులో 1230.6 కోట్ల రూపాయల విలువైన 5.86 శాతం వాటాను పీఈ ఇన్వెస్టర్లకు కేటాయిస్తామని, దీంతో పాటు 3,560 కోట్ల రూపాయల నగదును సైతం ఇస్తామని జీఎంఆర్ వెల్లడించింది. నగదు సమీకరణ కోసం సంస్థ పలు మార్గాలను ఎంచుకుంది. ఇందులో భాగంగా ఆయా ఎయిర్‌పోర్టుల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాకున్న యాజమాన్య వాటాలను జీఏఎల్‌కు విక్రయించనుంది. ♦ జీఎంఆర్ ఇన్ఫ్రాకు ఫిలిప్పీన్స్ సెబు విమానాశ్రయంలో 40 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 23.6 కోట్ల డాలర్లు. ♦ ఫిలిప్పీన్స్‌లోని క్లార్క్ ఈపీసీ ప్రాజెక్టులో జీఎంఆర్ ఇన్ఫ్రాకు 50 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 48 లక్షల డాలర్లు. ♦ ఢిల్లీ ఎయిర్‌పోర్టు పార్కింగ్ సర్వీసెస్‌లో 40.1 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ.200 కోట్లు. ♦ఈ వాల్యూయేషన్లన్నీ డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ మదింపు చేసినట్లు జీఎంఆర్ తెలిపింది. జీఎంఆర్ ఇన్ఫ్రా నుంచి కొనుగోలు చేసే ఈ వాటాలన్నింటికీ దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైన ఎన్సీడీల జారీ చేయడం ద్వారా జీఏఎల్ నిధులు సమకూర్చుకోనుంది. -
గోవా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు జీఎంఆర్ చేతికి
ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రా తాజాగా గోవాలో విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. ఉత్తర గోవాలోని మోపాలో చేపట్టే ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లుగా ఉంటుందని అంచనా. బీవోవోటీ (బిల్డ్, వోన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే గ్రూప్, వోలప్టాస్ డెవలపర్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎస్సెల్ ఇన్ఫ్రా తదితర సంస్థలు కూడా పోటీపడినప్పటికీ .. ఫైనాన్షియల్ బిడ్డింగ్‌లో జీఎంఆర్ విజేతగా నిల్చింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన బిడ్లను తెరిచారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆదాయాల్లో ప్రభుత్వంతో పంచుకునే వాటాకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ 32.31 శాతం, ఎస్సెల్ ఇన్ఫ్రా 27 శాతం కోట్ చేయగా.. జీఎంఆర్ 36.99 శాతం కోట్ చేసింది. రుణ సమీకరణ ద్వారా ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను జీఎంఆర్ సమకూర్చుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనున్నట్లు కంపెనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు పేర్కొంది. జీఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవాలో రెండో విమానాశ్రయం.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సెప్టెంబర్ రెండో వారంలో మోపా విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దక్షిణ గోవాలో ఇప్పటికే దబోలిమ్ ఎయిర్పోర్ట్ ఉండగా.. రాష్ట్రంలో ఇది రెండో విమానాశ్రయం కానుంది. నేవీ నిర్వహణలో ఉండే దబోలిమ్ ఎయిర్‌పోర్టులో పౌర విమానాల రాకపోకలకు సంబంధించి పలు నియంత్రణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండో విమానాశ్రయం ప్రతిపాదన తెరపైకొచ్చింది. సుమారు 2,271 ఎకరాల్లో .. తొలుత వార్షికంగా తొంభై లక్షల ప్రయాణికుల సామర్ధ్యంతో మోపా విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. సుమారు 149 ఎకరాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయలింగ్ సెంటర్లు, కార్ పార్కింగ్ మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా నెలకొల్పాల్సి ఉంటుంది. 2019 నాటికల్లా ఎయిర్పోర్ట్ తొలిదశ అందుబాటులోకి రాగలదని అంచనా. తొలి దశలో 44 లక్షల మంది ప్రయాణికుల సామర్ధ్యంతో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. 2045 నాటికి 1.31 కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గ్రీస్ ఎయిర్‌పోర్టుకూ బిడ్డింగ్? గ్రీస్‌లోని హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రాజెక్టు కోసం కూడా జీఎంఆర్ బిడ్డింగ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గ్రీస్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో రెండోదైన ఈ ఎయిర్‌పోర్టు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలు కల్పించేలా పౌర విమానయాన శాఖ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్‌ను కూడా కంపెనీ పొందినట్లు సమాచారం. అంతర్జాతీయంగా జీఎంఆర్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. టర్కీ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో వాటాలను కొన్నాళ్ల క్రితం విక్రయించి వైదొలగింది. మాల్దీవుల్లోని మాలే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ అంశం వివాదంలో ఉంది. -
మాలే ఎయిర్ పోర్టు కేసులో జీఎంఆర్ కి అనుకూలంగా తీర్పు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలే ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహరం ఈ ఏడాది మూడో త్రైమాసికంలోగా వస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఎంఆర్ - యాక్సిస్ బ్యాంక్ కేసులో సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు జీఎంఆర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2010లో మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసే కాంట్రాక్టును 2012లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడాన్ని జీఎంఆర్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసినందుకు నష్టపరిహారానికి కోర్టును ఆశ్రయించగా వివాదం చివరకు ఆర్బిట్రేషన్‌కు చేరింది. ఫిబ్రవరి 23న సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినట్లు జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ఒకానొక దశలో 15 శాతం పెరిగిన షేరు చివరకు నాలుగు శాతం లాభంతో రూ. 11.65 వద్ద ముగిసింది. -
జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోట్ చేస్తున్న కంపెనీల్లో మూడు సంస్థలు తమ వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రస్ట్ కంపెనీ, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌కు తనఖా పెట్టాయి. జీఎంఆర్ హోల్డింగ్స్, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ, జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ కలిసి మొత్తం 19.13 శాతం వాటాలను తనఖా ఉంచాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా మాతృసంస్థ జీఎంఆర్ హోల్డింగ్స్ ఏప్రిల్ 28, 30న రెండు విడతలుగా 5.23 శాతం వాటాలను, జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ సైతం 0.38 శాతం వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వద్ద తనఖా ఉంచాయి. అలాగే జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ 13.52 శాతం వాటాలను రెండు లావాదేవీల్లో ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్, ఐఎల్‌ఎఫ్‌ఎల్ ట్రస్ట్ కంపెనీ వద్ద తనఖా ఉంచాయి. మంగళవారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర 2.82 శాతం క్షీణించి రూ. 15.48 వద్ద ముగిసింది. -
కార్గో సర్వీసుల నుంచి వైదొలగిన జీఎంఆర్ ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ కంపెనీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కార్గో సేవల నుంచి వైదొలగింది. కార్గో సర్వీస్ యూనిట్‌ను రూ. 29 కోట్లకు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కి విక్రయించినట్లు కంపెనీ బీఎస్ఈకి తెలియచేసింది. రూ.10 ముఖ విలువ కలిగిన 1,09,20,000 ఈక్విటీ షేర్లను ఒకొక్కటి రూ. 26.20లకు చొప్పున మొత్తం రూ. 28.60 కోట్లకు విక్రయించినట్లు జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
కాకినాడలో 2500 కోట్లతో జీఎంఆర్ ఓడరేవు
హైదరాబాద్: పోర్టు నిర్మాణ రంగంలోకి తొలిసారి జీఎంఆర్ సంస్థ అడుగుపెడుతోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డ్ లో భారీ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ఆధునికి గ్రీన్ ఫీల్డ్ పోర్టును డెవలప్ చేయడానికి జీఎంఆర్ సిద్దమవుతున్నట్టు తెలిసింది. కార్గో, కంటైనర్ కార్డో, ఎగుమతి, దిగుమతి ఆపరేషన్ల లాంటి సదుపాయాలు కల్పించే విధంగా జీఎంఆర్ ప్రణాళికను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాకినాడ సెజ్ కు కెటాయించిన 10,500 ఎకరాల్లో పోర్టు కోసం 2100 ఎకరాలను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. పోర్ట్ నిర్మాణ ప్రాజెక్ట్ వ్యయం 2500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తూర్పు తీరంలో అతిపెద్ద, అధునిక కార్గో హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో జీఎంఆర్ సిద్దమైంది. ఆరునెలల్లో పబ్లిక్ హియరింగ్ కు వెళ్తామని.. ఆతర్వాత మూడేళ్లలో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని జీఎంఆర్ అధికారులు తెలిపారు. -
నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం తీసుకునే సమయంలో చిన్న కారులో వచ్చి, రుణాన్ని పునర్వ్యవస్థీకరించండని కోరేందుకు ఖరీదైన కారులో వచ్చేవారిపై మమకారం చూపబోమని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సి.విఆర్.రాజేంద్రన్ తేల్చి చెప్పారు. ‘తనఖా ఆస్తులకు సంబంధించిన కాగితాలు మా వద్ద ఉంటాయి. కంపెనీ కష్టాల్లో ఉన్నట్టయితే అవేవీ పనిచేయవు. అన్ని సమయాల్లోనూ వేలం ద్వారానే రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవాలన్న భావన మాది కాదు. వ్యాపారంలో నిబద్ధత చూపిన పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం. విశ్వసనీయత చూపండి. తప్పకుండా ఆదుకుంటామంటూ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంగళవారమిక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్(ఎఫ్‌ఎస్‌ఎంఈ) ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవాలన్న ఫెడరేషన్ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ‘భవిష్యత్తులో కంపెనీ గాడిలో పడుతుందనేందుకు బలమైన కారణం చూపండి. బ్యాంకు పరంగా పూర్తి సహకారం ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంచి ప్రతిపాదనతో రండి.. ‘వివిధ వ్యాపార రంగాలకు చెందిన సంఘాలు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలి. అదనపు రుణం, రుణ పునర్వ్యవస్థీకరణ ఇలా సహాయమేదైనా సభ్యుల నుంచి వచ్చే ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేయాలి. మంచి ప్రతిపాదనలనే మా వద్దకు తీసుకురండి’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. మాంద్యంలోనూ కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన రుణాలపరంగా చూస్తే నిరర్ధక ఆస్తులుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3 శాతం, కార్పొరేట్లు 7 శాతం ఉంటాయని అన్నారు. గత చరిత్ర చూడండి.. నిరర్ధక ఆస్తులుగా(ఎన్పీఏ) ప్రకటించే ముందు కంపెనీల గత చరిత్ర చూడాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి కోరారు. మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ముడి సరుకుల ధరలు పెరగడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో గంటకు 6 కంపెనీలు మూతపడుతున్నాయని వివరించారు. విద్యుత్ లేనప్పుడు అదనపు రుణమెందుకంటూ బ్యాంకర్లు అంటున్నారని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్ వి.అనిల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వ విధానాల్లో లోపాలతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీబీ శంకర్ అనే పారిశ్రామికవేత్త చెప్పారు. విఫలమైన కంపెనీల కష్టాలకుగల కారణాలను అధ్యయనం చేసి, తగు పరిష్కారం అందించాలని విన్నవించారు. రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు చెల్లించాల్సిన వడ్డీని టెర్మ్ లోన్‌గా మార్చాలని రవి చంద్రమౌళి అనే పారిశ్రామికవేత్త కోరారు. తనఖా పెట్టిన ఆస్తులను తిరిగి విలువ కట్టాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ సలహాదారు ఎమ్వీ రాజేశ్వరరావు సూచించారు. తిరిగి రుణాలిచ్చేందుకై ప్రత్యేక విభాగాన్ని తెరవాలన్నారు. సీఎంకు పెప్సి, క్యాడ్బరీ కావాలి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెప్సి, క్యాడ్బరీ, ఇసుజు వంటి కంపెనీలే కనిపిస్తున్నాయని, చిన్న కంపెనీలను ఆదుకోవాలన్న సృహ లేదని ఏపీకే రెడ్డి విమర్శించారు. రోజుకు 1,400 మంది కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బ్యాంకులు ఎన్పీఏలుగా ప్రకటిస్తూ పోతే కంపెనీలు మిగలవని అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ పిల్లలను పారిశ్రామికవేత్తలు కావాలని కోరుకోవడం లేదని అన్నారు. రుణాలను ఎగ్గొట్టే ఉద్దేశం ఏ పారిశ్రామికవేత్తకూ లేదని వెల్లడించారు. పార్లే వంటి భారతీయ కంపెనీలను ప్రోత్సహించి, అట్టి కంపెనీల్లో మన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇప్పించాలన్నారు. -
‘ఇస్తాంబుల్’ నుంచి జీఎంఆర్ బయటికి..!
ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో అమ్మకానికి 40% వాటా కొనుగోలు రేసులో మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బర్హాద్ డీల్ విలువ రూ.1,900 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలికరంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రా..తాజాగా టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు నుంచి వైదొలగనుంది. ఈ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌కి ఉన్న 40 శాతం వాటాలను కొనుగోలు చేయాలని మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బర్హాద్ (ఎంఏహెచ్‌బీ) యోచిస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,900 కోట్లు (దాదాపు 225 మిలియన్ యూరోలు) ఉండనుంది. అనుబంధ సంస్థ మలేసియా ఎయిర్‌పోర్ట్స్ ఎంఎస్సీ (ఎంఏఎంఎస్‌సీ) ద్వారా ఈ కొనుగోలు జరపాలని మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి జీఎంఆర్‌తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఎంఏహెచ్‌బీ మలేసియా స్టాక్‌ఎక్స్ఛేంజికి తెలిపింది. వాటాల కొనుగోలుకు సంబంధించి తొలి తిరస్కరణ హక్కు (ఆర్ఓఎఫ్ఆర్) వినియోగించుకోనున్నట్లు ఎంఏహెచ్‌బీ తమకు తెలియజేసిందని జీఎంఆర్ ఇన్ఫ్రా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. డీల్ పూర్తయ్యేసరికి సుమారు మూడు నెలలు పట్టొచ్చని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విభాగం సీఎఫ్‌వో సిద్ధార్థ్ కపూర్ పేర్కొన్నారు. ఇస్తాంబుల్‌లోని సబీహా గోక్చెన్ ఎయిర్‌పోర్టు (ఐఎస్‌జీఐఏ) ప్రాజెక్టును జీఎంఆర్ ఇన్ఫ్రా కన్సార్షియం 2008 మేలో దక్కించుకుంది. 2030 దాకా దీని నిర్వహణ హక్కులు కన్సార్షియానికి ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 27.55%, దాని అనుబంధ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్సీస్కి 12.45% వాటాలు, ఎంఏహెచ్‌బీకి 20%, టర్కీకి చెందిన లిమాక్ కన్స్ట్రక్షన్కి 40% వాటాలు ఉన్నాయి. ఐఎస్‌జీఐఏలో కన్సార్షియం 470 మిలియన్ యూరోలు(దాదాపు రూ.4,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. ఇందులో భాగంగా 360 మిలియన్ యూరోలతో కొత్త ఇంటర్నేషనల్ టెర్మినల్‌ను నిర్మించింది. రుణ భారాన్ని దించుకునే యత్నాలు... దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో ఉన్న జీఎంఆర్ గ్రూప్ కొంతకాలంగా ఈ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టుల్లో తనకున్న వాటాలను విక్రయిస్తూ, నిధులు సమీకరిస్తోంది. ఇటీవలే ఉలూండూర్‌పేట్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రాజెక్టులో 74 శాతం వాటాలను రూ. 222 కోట్లకు విక్రయించింది. జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌వేలో వాటాలను సుమారు రూ. 200 కోట్లకు, సింగపూర్ పవర్ ప్లాంటులో మొత్తం 70 శాతం వాటాలను సుమారు రూ. 1,356 కోట్లకు విక్రయించింది.