న్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను జీఎంఆర్ ఇన్‌ఫ్రా సొంతం చేసుకుంది. జీఏఎల్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో వివాదాన్ని ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకున్నట్లు జీఎంఆర్ ప్రకటించింది. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా పీఈ ఇన్వెస్టర్లకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో (జీఏఎల్) 5.86 శాతం ఈక్విటీ, 3,560 కోట్ల రూపాయల నగదును చెల్లించనున్నట్లు తెలిపింది.
ఎస్‌బీఐ మెక్వయిరీ, స్టాండర్డ్ చార్టర్డ్, జేఎం ఫైనాన్షియల్ ఓల్డ్‌లేన్ తదితర పీఈ ఇన్వెస్టర్లు 2010– 11, 2011–12లో జీఏఎల్‌లో రూ.1,478 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాయి. ఈ సంస్థలన్నీ కలిసి జీఏఎల్‌లో కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) రూపంలో పెట్టుబడి పెట్టాయి. జీఏఎల్‌లో మెజారిటీ వాటా కోసం పీఈ ఇన్వెస్టర్ల వాటాలను జీఎంఆర్ ఇన్‌ఫ్రా కొనుగోలు చేయనుంది. ఇరు పక్షాలు ఈ విషయమై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వద్ద వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. పరిష్కార ఒప్పందం ప్రకారం అన్ని పార్టీలు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించుకుంటాయని జీఎంఆర్ సంస్థ స్టాక్ ఎక్చేంజ్‌లకు తెలిపింది.
జీఎంఆర్ గ్రూప్‌నకు జోష్
తాజా సెటిల్‌మెంట్ జీఎంఆర్ గ్రూప్‌నకు కలిసివచ్చే అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆర్బిట్రేషన్ కొలిక్కి రావడంతో నానాటికీ విస్తరిస్తున్న ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో మరిన్ని అవకాశాలు పొందేందుకు జీఎంఆర్‌కు వీలు చిక్కుతుందని విశ్లేషించారు.
సెటిల్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యాక జీఏఎల్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ సంస్థలకు కలిపి 91.95 శాతం వాటా, ఎంప్లాయి వెల్‌ఫేర్ ట్రస్ట్‌కు 2.19 శాతం వాటా, ఇన్వెస్టర్లకు 5.86 శాతం వాటాలుంటాయి. ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రా వ్యాపారంపై బుల్లిష్‌గా ఉన్నామని, తాజా సెటిల్‌మెంట్ తాము మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తుందని జీఎంఆర్ గ్రూప్ ఎయిర్‌పోర్ట్ విభాగం చైర్మన్ జీబీఎస్ రాజు చెప్పారు.
వాల్యుయేషన్ లెక్కలు ఇలా...
జీఏఎల్ వాల్యూషన్‌ను 21వేల కోట్ల రూపాయలుగా లెక్కించామని, ఇందులో 1230.6 కోట్ల రూపాయల విలువైన 5.86 శాతం వాటాను పీఈ ఇన్వెస్టర్లకు కేటాయిస్తామని, దీంతో పాటు 3,560 కోట్ల రూపాయల నగదును సైతం ఇస్తామని జీఎంఆర్ వెల్లడించింది. నగదు సమీకరణ కోసం సంస్థ పలు మార్గాలను ఎంచుకుంది. ఇందులో భాగంగా ఆయా ఎయిర్‌పోర్టుల్లో జీఎంఆర్ ఇన్‌ఫ్రాకున్న యాజమాన్య వాటాలను జీఏఎల్‌కు విక్రయించనుంది.
♦ జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు ఫిలిప్పీన్స్ సెబు విమానాశ్రయంలో 40 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 23.6 కోట్ల డాలర్లు.
♦ ఫిలిప్పీన్స్‌లోని క్లార్క్ ఈపీసీ ప్రాజెక్టులో జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు 50 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 48 లక్షల డాలర్లు.
♦ ఢిల్లీ ఎయిర్‌పోర్టు పార్కింగ్ సర్వీసెస్‌లో 40.1 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ.200 కోట్లు.
♦ఈ వాల్యూయేషన్లన్నీ డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ మదింపు చేసినట్లు జీఎంఆర్ తెలిపింది. జీఎంఆర్ ఇన్‌ఫ్రా నుంచి కొనుగోలు చేసే ఈ వాటాలన్నింటికీ దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైన ఎన్‌సీడీల జారీ చేయడం ద్వారా జీఏఎల్ నిధులు సమకూర్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment