‘ఇస్తాంబుల్’ నుంచి జీఎంఆర్ బయటికి..! | GMR Infra to exit Istanbul airport | Sakshi
Sakshi News home page

‘ఇస్తాంబుల్’ నుంచి జీఎంఆర్ బయటికి..!

Published Wed, Dec 25 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

‘ఇస్తాంబుల్’ నుంచి జీఎంఆర్ బయటికి..!

‘ఇస్తాంబుల్’ నుంచి జీఎంఆర్ బయటికి..!

 ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులో
 అమ్మకానికి 40% వాటా
   కొనుగోలు రేసులో మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బర్హాద్
   డీల్ విలువ రూ.1,900 కోట్లు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలికరంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్‌ఫ్రా..తాజాగా టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు నుంచి వైదొలగనుంది. ఈ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌కి ఉన్న 40 శాతం వాటాలను కొనుగోలు చేయాలని మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బర్హాద్ (ఎంఏహెచ్‌బీ) యోచిస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,900 కోట్లు (దాదాపు 225 మిలియన్ యూరోలు) ఉండనుంది. అనుబంధ సంస్థ మలేసియా ఎయిర్‌పోర్ట్స్ ఎంఎస్‌సీ (ఎంఏఎంఎస్‌సీ) ద్వారా ఈ కొనుగోలు జరపాలని మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి జీఎంఆర్‌తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఎంఏహెచ్‌బీ మలేసియా స్టాక్‌ఎక్స్ఛేంజికి తెలిపింది. వాటాల కొనుగోలుకు సంబంధించి తొలి తిరస్కరణ హక్కు (ఆర్‌ఓఎఫ్‌ఆర్) వినియోగించుకోనున్నట్లు ఎంఏహెచ్‌బీ తమకు తెలియజేసిందని జీఎంఆర్ ఇన్‌ఫ్రా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. డీల్ పూర్తయ్యేసరికి సుమారు మూడు నెలలు పట్టొచ్చని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విభాగం సీఎఫ్‌వో సిద్ధార్థ్ కపూర్ పేర్కొన్నారు.
 
 ఇస్తాంబుల్‌లోని సబీహా గోక్చెన్ ఎయిర్‌పోర్టు (ఐఎస్‌జీఐఏ) ప్రాజెక్టును జీఎంఆర్ ఇన్‌ఫ్రా కన్సార్షియం 2008 మేలో దక్కించుకుంది. 2030 దాకా దీని నిర్వహణ హక్కులు కన్సార్షియానికి ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి 27.55%, దాని అనుబంధ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓవర్‌సీస్‌కి 12.45% వాటాలు, ఎంఏహెచ్‌బీకి 20%, టర్కీకి చెందిన లిమాక్ కన్‌స్ట్రక్షన్‌కి 40% వాటాలు ఉన్నాయి. ఐఎస్‌జీఐఏలో కన్సార్షియం 470 మిలియన్ యూరోలు(దాదాపు రూ.4,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. ఇందులో భాగంగా 360 మిలియన్ యూరోలతో కొత్త ఇంటర్నేషనల్ టెర్మినల్‌ను నిర్మించింది.
 
 రుణ భారాన్ని దించుకునే యత్నాలు...
 దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో ఉన్న జీఎంఆర్ గ్రూప్ కొంతకాలంగా ఈ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టుల్లో తనకున్న వాటాలను విక్రయిస్తూ, నిధులు సమీకరిస్తోంది. ఇటీవలే ఉలూండూర్‌పేట్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రాజెక్టులో 74 శాతం వాటాలను రూ. 222 కోట్లకు విక్రయించింది. జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌వేలో వాటాలను సుమారు రూ. 200 కోట్లకు, సింగపూర్ పవర్ ప్లాంటులో మొత్తం 70 శాతం వాటాలను సుమారు రూ. 1,356 కోట్లకు విక్రయించింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement