నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం.. | Andhra Bank to restructure bad loans of committed promoters | Sakshi
Sakshi News home page

నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..

Published Wed, Feb 5 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..

నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం తీసుకునే సమయంలో చిన్న కారులో వచ్చి, రుణాన్ని పునర్‌వ్యవస్థీకరించండని కోరేందుకు ఖరీదైన కారులో వచ్చేవారిపై మమకారం చూపబోమని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సి.విఆర్.రాజేంద్రన్ తేల్చి చెప్పారు. ‘తనఖా ఆస్తులకు సంబంధించిన కాగితాలు మా వద్ద ఉంటాయి. కంపెనీ కష్టాల్లో ఉన్నట్టయితే అవేవీ పనిచేయవు. అన్ని సమయాల్లోనూ వేలం ద్వారానే రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవాలన్న భావన మాది కాదు. వ్యాపారంలో నిబద్ధత చూపిన పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం.

విశ్వసనీయత చూపండి. తప్పకుండా ఆదుకుంటామంటూ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంగళవారమిక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైసెస్(ఎఫ్‌ఎస్‌ఎంఈ) ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవాలన్న ఫెడరేషన్ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ‘భవిష్యత్తులో కంపెనీ గాడిలో పడుతుందనేందుకు బలమైన కారణం చూపండి. బ్యాంకు పరంగా పూర్తి సహకారం ఉంటుంది’ అని పేర్కొన్నారు.  

 మంచి ప్రతిపాదనతో రండి..
 ‘వివిధ వ్యాపార రంగాలకు చెందిన సంఘాలు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలి. అదనపు రుణం, రుణ పునర్‌వ్యవస్థీకరణ ఇలా సహాయమేదైనా సభ్యుల నుంచి వచ్చే ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేయాలి. మంచి ప్రతిపాదనలనే మా వద్దకు తీసుకురండి’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు.  చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. మాంద్యంలోనూ కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన రుణాలపరంగా చూస్తే నిరర్ధక ఆస్తులుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3 శాతం, కార్పొరేట్లు 7 శాతం ఉంటాయని అన్నారు.

 గత చరిత్ర చూడండి..
 నిరర్ధక ఆస్తులుగా(ఎన్‌పీఏ) ప్రకటించే ముందు కంపెనీల గత చరిత్ర చూడాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి కోరారు. మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ముడి సరుకుల ధరలు పెరగడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో గంటకు 6 కంపెనీలు మూతపడుతున్నాయని వివరించారు. విద్యుత్ లేనప్పుడు అదనపు రుణమెందుకంటూ బ్యాంకర్లు అంటున్నారని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్ వి.అనిల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వ విధానాల్లో లోపాలతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీబీ శంకర్ అనే పారిశ్రామికవేత్త చెప్పారు.

 విఫలమైన కంపెనీల కష్టాలకుగల కారణాలను అధ్యయనం చేసి, తగు పరిష్కారం అందించాలని విన్నవించారు. రుణాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు చెల్లించాల్సిన వడ్డీని టెర్మ్ లోన్‌గా మార్చాలని రవి చంద్రమౌళి అనే పారిశ్రామికవేత్త కోరారు. తనఖా పెట్టిన ఆస్తులను తిరిగి విలువ కట్టాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ సలహాదారు ఎమ్వీ రాజేశ్వరరావు సూచించారు. తిరిగి రుణాలిచ్చేందుకై ప్రత్యేక విభాగాన్ని తెరవాలన్నారు.

 సీఎంకు పెప్సి, క్యాడ్‌బరీ కావాలి..
 రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెప్సి, క్యాడ్‌బరీ, ఇసుజు వంటి కంపెనీలే కనిపిస్తున్నాయని, చిన్న కంపెనీలను ఆదుకోవాలన్న సృహ లేదని ఏపీకే రెడ్డి విమర్శించారు. రోజుకు 1,400 మంది కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.  బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటిస్తూ పోతే కంపెనీలు మిగలవని అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ పిల్లలను పారిశ్రామికవేత్తలు కావాలని కోరుకోవడం లేదని అన్నారు. రుణాలను ఎగ్గొట్టే ఉద్దేశం ఏ పారిశ్రామికవేత్తకూ లేదని వెల్లడించారు. పార్లే వంటి భారతీయ కంపెనీలను ప్రోత్సహించి, అట్టి కంపెనీల్లో మన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇప్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement