BIFR
-
ఖాయిలా సంస్థగా గాయత్రి షుగర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చక్కెర తయారీ సంస్థ గాయత్రి షుగర్స్‌ను బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) తాజాగా ఖాయిలా పడిన సంస్థగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఆపరేటింగ్ ఏజెన్సీగా ఐడీబీఐని బీఐఎఫ్ఆర్ నియమించినట్లు గాయత్రి షుగర్స్ తెలిపింది. ఈ పరిణామంతో తమకు రుణాల చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించగలదని.. చక్కెర, ఇతరత్రా ఉత్పత్తులపై సుంకాలు, సెస్సు, పన్నుల నుంచి మినహాయింపు తదితర ప్రయోజనాలు ఉండగలవని పేర్కొంది. అలాగే నగదు లభ్యతను పెంచుకోవడానికి, కంపెనీ ఆర్థిక పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని గాయత్రి షుగర్స్ వివరించింది. 2010-11 నుంచి వివిధ కారణాలతో కంపెనీ గణనీయమైన నష్టాలు చవిచూసింది. కంపెనీ నివేదిక ప్రకారం.. 2016 మార్చి ఆఖరు నాటికి నష్టాలు సుమారు రూ. 139 కోట్లకు చేరుకున్నాయి. నికర విలువ పూర్తిగా కరిగిపోయిన నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 7న గాయత్రి షుగర్స్ ఖాయిలా పారిశ్రామిక కంపెనీ చట్టం 1985 నిబంధనల కింద బీఐఎఫ్ఆర్కు దరఖాస్తు చేసుకుంది. -
బీఐఎఫ్ఆర్ కోసం అనుమతించండి
వాటాదారులను కోరిన యునెటైడ్ స్పిరిట్స్ న్యూఢిల్లీ: పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డ్(బీఐఎఫ్ఆర్-బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్) పరిశీలన కోసం మరోసారి వాటాదారుల ఆమోదాన్ని యునెటైడ్ స్పిరిట్స్ కోరింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో తమకు వచ్చిన నష్టాలు తమ నెట్‌వర్త్‌లో సగానికిపైగా మించాయని, అందుకే బీఐఎఫ్ఆర్ పరిశీలన కోసం వాటాదారుల ఆమోదాన్ని మరోసారి కోరుతున్నామని యునెటైడ్ స్పిరిట్స్ పేర్కొంది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నష్టాలు రూ.5,850 కోట్లకు చేరాయని, ఇది తమ నెట్‌వర్త్‌లో సగం కంటే ఎక్కువేనని వాటాదారులకు పంపిన నోటీస్‌లో యునెటైడ్ స్పిరిట్స్ పేర్కొంది. వచ్చే నెల 14న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహించనున్నామని వెల్లడించింది. ఖాయిలా పారశ్రామిక కంపెనీల చట్టం ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఏ కంపెనీ నష్టాలైనా ఈ కంపెనీ నెట్‌వర్త్‌లో సగానికి చేరితే బీఐఎఫ్ఆర్ పరిశీలన కోరవచ్చు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన అసాధారణ వార్షిక సమావేశం (ఈజీఎం)లో బీఐఎఫ్ఆర్ పరిశీలనకు వాటాదారుల అనుమతిని యునెటైడ్ స్పిరిట్స్ కోరింది. -
సిర్పూర్ పేపర్ మిల్స్ ఖాయిలా!
ఇప్పటికే నిలిచిన ఉత్పత్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం తయారీ కంపెనీ సిర్పూర్ పేపర్ మిల్స్ ఖాయిలా పడ్డ కంపెనీల సరసన చేరుతోంది. నికర విలువ కుచించుకుపోవడంతో ఖాయిలా కంపెనీగా గుర్తించాలంటూ 2014 నవంబరులో సిర్పూర్ పేపర్ చేసిన దరఖాస్తును బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) స్వీకరించింది. కంపెనీకి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ వద్ద పేపర్ తయారీ మిల్లు ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 77 ఏళ్ల చరిత్ర కలిగిన సిర్పూర్ మిల్లు మూసివేత దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక దశలో వార్షిక ఉత్పత్తి 84 వేల టన్నులకు చేరింది. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కొన్ని నెలలుగా ఉద్యోగులకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. 400లకుపైగా లారీల రాకపోకలతో బిజీగా ఉండే ప్లాంటు ప్రాంగణం ఇప్పుడు బోసిగా కనిపిస్తోంది. రూ.100 కోట్లు ఇస్తే రెడీ.. ప్లాంటులో ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు యాజమాన్యం రూ.100 కోట్లు డిమాండ్ చేస్తోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అంత మొత్తం ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులకు కంపెనీ రూ.500 కోట్ల బకాయిలు ఉన్నట్టు కార్మిక నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రూ.6.5 కోట్లను మంజూరు చేసింది. ఆరు నెలలపాటు ఉచిత విద్యుత్, సుబాబుల్ కొనుగోలుకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా యాజమాన్యం ముందుకు కదలడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. సిర్పూర్ పేపర్ మిల్స్ 2014-15 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.85 కోట్ల టర్నోవర్‌పై రూ.40 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. 2013-14లో రూ.423 కోట్ల టర్నోవర్‌పై రూ.91 కోట్ల నికర నష్టం మూటగట్టుకుంది. 2014 సెప్టెంబరు 30 నాటికి పోగైన నష్టాలు రూ.264 కోట్లుగా ఉన్నాయి. -
నిబద్ధత ఉంటే వెన్నంటి ఉంటాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం తీసుకునే సమయంలో చిన్న కారులో వచ్చి, రుణాన్ని పునర్వ్యవస్థీకరించండని కోరేందుకు ఖరీదైన కారులో వచ్చేవారిపై మమకారం చూపబోమని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సి.విఆర్.రాజేంద్రన్ తేల్చి చెప్పారు. ‘తనఖా ఆస్తులకు సంబంధించిన కాగితాలు మా వద్ద ఉంటాయి. కంపెనీ కష్టాల్లో ఉన్నట్టయితే అవేవీ పనిచేయవు. అన్ని సమయాల్లోనూ వేలం ద్వారానే రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవాలన్న భావన మాది కాదు. వ్యాపారంలో నిబద్ధత చూపిన పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం. విశ్వసనీయత చూపండి. తప్పకుండా ఆదుకుంటామంటూ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంగళవారమిక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్(ఎఫ్‌ఎస్‌ఎంఈ) ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవాలన్న ఫెడరేషన్ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ‘భవిష్యత్తులో కంపెనీ గాడిలో పడుతుందనేందుకు బలమైన కారణం చూపండి. బ్యాంకు పరంగా పూర్తి సహకారం ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంచి ప్రతిపాదనతో రండి.. ‘వివిధ వ్యాపార రంగాలకు చెందిన సంఘాలు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలి. అదనపు రుణం, రుణ పునర్వ్యవస్థీకరణ ఇలా సహాయమేదైనా సభ్యుల నుంచి వచ్చే ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేయాలి. మంచి ప్రతిపాదనలనే మా వద్దకు తీసుకురండి’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. మాంద్యంలోనూ కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇచ్చిన రుణాలపరంగా చూస్తే నిరర్ధక ఆస్తులుగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 3 శాతం, కార్పొరేట్లు 7 శాతం ఉంటాయని అన్నారు. గత చరిత్ర చూడండి.. నిరర్ధక ఆస్తులుగా(ఎన్పీఏ) ప్రకటించే ముందు కంపెనీల గత చరిత్ర చూడాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి కోరారు. మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ముడి సరుకుల ధరలు పెరగడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో గంటకు 6 కంపెనీలు మూతపడుతున్నాయని వివరించారు. విద్యుత్ లేనప్పుడు అదనపు రుణమెందుకంటూ బ్యాంకర్లు అంటున్నారని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్ వి.అనిల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వ విధానాల్లో లోపాలతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీబీ శంకర్ అనే పారిశ్రామికవేత్త చెప్పారు. విఫలమైన కంపెనీల కష్టాలకుగల కారణాలను అధ్యయనం చేసి, తగు పరిష్కారం అందించాలని విన్నవించారు. రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు చెల్లించాల్సిన వడ్డీని టెర్మ్ లోన్‌గా మార్చాలని రవి చంద్రమౌళి అనే పారిశ్రామికవేత్త కోరారు. తనఖా పెట్టిన ఆస్తులను తిరిగి విలువ కట్టాలని ఎఫ్‌ఎస్‌ఎంఈ సలహాదారు ఎమ్వీ రాజేశ్వరరావు సూచించారు. తిరిగి రుణాలిచ్చేందుకై ప్రత్యేక విభాగాన్ని తెరవాలన్నారు. సీఎంకు పెప్సి, క్యాడ్బరీ కావాలి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెప్సి, క్యాడ్బరీ, ఇసుజు వంటి కంపెనీలే కనిపిస్తున్నాయని, చిన్న కంపెనీలను ఆదుకోవాలన్న సృహ లేదని ఏపీకే రెడ్డి విమర్శించారు. రోజుకు 1,400 మంది కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బ్యాంకులు ఎన్పీఏలుగా ప్రకటిస్తూ పోతే కంపెనీలు మిగలవని అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ పిల్లలను పారిశ్రామికవేత్తలు కావాలని కోరుకోవడం లేదని అన్నారు. రుణాలను ఎగ్గొట్టే ఉద్దేశం ఏ పారిశ్రామికవేత్తకూ లేదని వెల్లడించారు. పార్లే వంటి భారతీయ కంపెనీలను ప్రోత్సహించి, అట్టి కంపెనీల్లో మన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇప్పించాలన్నారు. -
బెయిలవుట్ యత్నాల్లో డెక్కన్ క్రానికల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) తాజాగా పారిశ్రామిక ఆర్థిక పునర్వ్యవస్థీకరణ బోర్డును (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది. ఖాయిలా కంపెనీల చట్టం కింద బెయిలవుట్ కోరింది. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం బీఎస్ఈకి తెలియజేసింది. ఖాయిలా కంపెనీల చట్టం 1985 కింద బీఐఎఫ్ఆర్ తమ అభ్యర్థనను రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. ఈ చట్టంలో సెక్షన్ 15 (1) కింద కంపెనీ గానీ ఖాయిలా పడినట్లుగా భావించిన పక్షంలో గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదరు సంస్థల డెరైక్టర్ల బోర్డు..బీఐఎఫ్ఆర్ను ఆశ్రయించవచ్చు. కంపెనీ ఖాయిలాపడినట్లు నిర్ణయానికి వచ్చిన ఆరు నెలలలోగా లేదా.. ఆర్థిక ఫలితాల ఆడిటింగ్ పూర్తయిన తేదీ నుంచి 60 రోజుల్లోగా మేనేజ్మెంట్ ఈ పని చేయొచ్చు. అయితే, తాజా ఉదంతంలో.. కంపెనీ ఖాయిలాపడినట్లు డీసీహెచ్ఎల్ మేనేజ్మెంట్ ఎప్పుడు నిర్ధారణకి వచ్చినదీ.. బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పొందుపర్చలేదు. డీసీహెచ్ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైగా రుణాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, రుణంగా తీసుకున్న నిధులను ఏం చేసినదీ కంపెనీ చెప్పడం లేదు. దీంతో రుణాలిచ్చిన పలు సంస్థలు ఇప్పటికే చట్టపరమైన చర్యలకు దిగాయి. అప్పులిచ్చిన కెనరా బ్యాంక్.. సీబీఐకి కూడా ఫిర్యాదు చేసింది.