బీఐఎఫ్ఆర్ కోసం అనుమతించండి
వాటాదారులను కోరిన యునెటైడ్ స్పిరిట్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డ్(బీఐఎఫ్‌ఆర్-బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్) పరిశీలన కోసం మరోసారి వాటాదారుల ఆమోదాన్ని యునెటైడ్ స్పిరిట్స్ కోరింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో తమకు వచ్చిన నష్టాలు తమ నెట్‌వర్త్‌లో సగానికిపైగా మించాయని, అందుకే బీఐఎఫ్‌ఆర్ పరిశీలన కోసం వాటాదారుల ఆమోదాన్ని మరోసారి కోరుతున్నామని యునెటైడ్ స్పిరిట్స్ పేర్కొంది.
గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నష్టాలు రూ.5,850 కోట్లకు చేరాయని, ఇది తమ నెట్‌వర్త్‌లో సగం కంటే ఎక్కువేనని వాటాదారులకు పంపిన నోటీస్‌లో యునెటైడ్ స్పిరిట్స్ పేర్కొంది. వచ్చే నెల 14న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహించనున్నామని వెల్లడించింది. ఖాయిలా పారశ్రామిక కంపెనీల చట్టం ప్రకారం, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఏ కంపెనీ నష్టాలైనా ఈ కంపెనీ నెట్‌వర్త్‌లో సగానికి చేరితే బీఐఎఫ్‌ఆర్ పరిశీలన కోరవచ్చు. ఈ ఏడాది జనవరి 22న జరిగిన అసాధారణ వార్షిక సమావేశం (ఈజీఎం)లో బీఐఎఫ్‌ఆర్ పరిశీలనకు వాటాదారుల అనుమతిని యునెటైడ్ స్పిరిట్స్ కోరింది.