వినియోగదారులకు పరిహారం చెల్లించండి
యునైటెడ్ స్పిరిట్స్‌ను ఆదేశించిన వినియోగదారుల ఫోరం
వరంగల్ లీగల్: శరీరంలో ఉన్న కొవ్వు తగ్గి లావుగా ఉన్న వారు సన్నబడుతారని ప్రచారం చేసి వినియోగదారులను తప్పుదోవ పట్టించిన మద్యం కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని, వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా డబ్బులు జమ చేయాలని ఆదేశిస్తూ సోమవారం జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్‌చార్జి ప్రెసిడెంట్ పటేల్ ప్రవీణ్‌కుమార్, మెంబర్ ఎస్‌బీ భార్గవి ఆదేశాలు జారీ చేశారు. శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించి, లావుగా ఉన్న వారు సన్నబడుతారని బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేసింది.
దీనిని విశ్వసించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన జి.వెంకటరమణ, కె.వి.రమణకుమార్ మేక్‌డాల్ డైట్‌మేట్ మద్యం సేవించసాగారు. 2014 మే నెల నుంచి కొనుగోలు చేస్తూ ఇంట్లో వారికి లావు తగ్గడానికి సేవిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇరువురు అనారోగ్యానికి గురైనారు. వైద్య పరీక్షలు చేయగా, గతం కంటే ఎక్కువ కొవ్వు పెరిగింది. దీనితో తమను మద్యం కంపెనీ తప్పుదోవ పట్టించిందని, మాకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.20 లక్షల చొప్పున చెల్లించాలని విడివిడిగా 2014 డిసెంబర్ 30న లీగల్ నోటీసు జారీ చేశారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు 2015 జనవరి 17న జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
దీనిపై విచారించిన ఫోరమ్ వినియోగదారులను ప్రచార సాధనాల ద్వారా తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి కారకులైనందున ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం, రూ.5వేల చొప్పున ఖర్చులు చెల్లించాలని ఫోరం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసుకు రూ. లక్ష చొప్పున రూ. 2 లక్షలను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని కంపెనీలను ఆదేశించారు.