సిర్పూర్ పేపర్ మిల్స్ ఖాయిలా!
ఇప్పటికే నిలిచిన ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం తయారీ కంపెనీ సిర్పూర్ పేపర్ మిల్స్ ఖాయిలా పడ్డ కంపెనీల సరసన చేరుతోంది. నికర విలువ కుచించుకుపోవడంతో ఖాయిలా కంపెనీగా గుర్తించాలంటూ 2014 నవంబరులో సిర్పూర్ పేపర్ చేసిన దరఖాస్తును బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్) స్వీకరించింది. కంపెనీకి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ వద్ద పేపర్ తయారీ మిల్లు ఉంది.
గతేడాది సెప్టెంబరు నుంచి ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 77 ఏళ్ల చరిత్ర కలిగిన సిర్పూర్ మిల్లు మూసివేత దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక దశలో వార్షిక ఉత్పత్తి 84 వేల టన్నులకు చేరింది. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కొన్ని నెలలుగా ఉద్యోగులకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. 400లకుపైగా లారీల రాకపోకలతో బిజీగా ఉండే ప్లాంటు ప్రాంగణం ఇప్పుడు బోసిగా కనిపిస్తోంది.
రూ.100 కోట్లు ఇస్తే రెడీ..
ప్లాంటులో ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు యాజమాన్యం రూ.100 కోట్లు డిమాండ్ చేస్తోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అంత మొత్తం ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులకు కంపెనీ రూ.500 కోట్ల బకాయిలు ఉన్నట్టు కార్మిక నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రూ.6.5 కోట్లను మంజూరు చేసింది.
ఆరు నెలలపాటు ఉచిత విద్యుత్, సుబాబుల్ కొనుగోలుకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా యాజమాన్యం ముందుకు కదలడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. సిర్పూర్ పేపర్ మిల్స్ 2014-15 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.85 కోట్ల టర్నోవర్‌పై రూ.40 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. 2013-14లో రూ.423 కోట్ల టర్నోవర్‌పై రూ.91 కోట్ల నికర నష్టం మూటగట్టుకుంది. 2014 సెప్టెంబరు 30 నాటికి పోగైన నష్టాలు రూ.264 కోట్లుగా ఉన్నాయి.