ఫోర్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బుట్టదాఖలు
మంత్రి సూచించిన వారికే పదవులు
తెనాలిలో ప్రముఖ హోటల్ వేదికగా చేతులు మారిన ముడుపులు
కీలక ప్రాంతాల్లో డీఎం స్థాయి పోస్టుకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు
అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకే అందలం
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో బదిలీల పర్వం ఉద్యోగుల్లో చిచ్చురేపుతోంది. బదిలీల ప్రక్రియ కోసం సంస్థ నియమించిన ఫోర్ మెన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పేర్లకు పట్టం కట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవోలను, ఉద్యోగుల వినతులు, మానవీయ కోణాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీలు చేశారంటూ మండిపడుతున్నాయి.
ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపట్టింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు ఆహా్వనించింది. ఇవన్నీ కేవలం ప్రక్రియలో భాగంగా చేపట్టారే తప్ప.. క్షేత్ర స్థాయిలో విస్మరించారు.
వాస్తవానికి ఫోర్‌మెన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీకి సిఫారసు చేస్తే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఆ మేరకు అధికారులు నివేదిక రూపొందించారు. తీరా సాయంత్రానికి మంత్రి కార్యాలయం నుంచి మరో జాబితా వచ్చింది. అందులో పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే బదిలీ చేయాలని సాక్షాత్తూ మంత్రి హుకుం జారీ చేయడం.. ఎండీ వారిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి.
చేతులు మారిన ముడుపులు?
పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఏకంగా తొమ్మిది మందిని ప్రధాన కార్యాలయంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో తప్పనిసరి బదిలీలు లేనివారు, రిక్వెస్టు కూడా పెట్టుకోని వారు ఉండటం గమనార్హం.
ఇక్కడే మొత్తం బదిలీల్లో తెనాలి, విజయవాడలోని ప్రముఖ హోటళ్ల వేదికగా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిస్తున్నాయి. డీఎం పోస్టుకు డిమాండ్ ఉన్నచోట రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, మిగిలిన జిల్లాల్లో రూ.10 లక్షలకు పైగా రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆరోపణలున్నా పట్టించుకోలేదు
విజయనగరం జిల్లా డీఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి రావడంతో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదే ఉద్యోగిని తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశంతో అక్కడి పోస్టును వేకెంట్‌గా చూపించి వదిలేసినట్టు తెలుస్తోంది. కర్నూలులో డీఎంగా పనిచేస్తున్న ఉద్యోగిని రిక్వెస్ట్ పెట్టుకోకుండానే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.
ఆమెపై హైదరాబాద్‌లో పని చేస్తున్నప్పటి నుంచి వివిధ ఆరోపణలతో చార్జెస్ నమోదయ్యాయి. ఇదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిధుల దురి్వనియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, రెండేళ్లు ఉద్యోగంలో చెప్పాపెట్టకుండా మాయమైన మరో ఉద్యోగిని సైతం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు.
దీనిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ను వివరణ కోరగా.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేశామన్నారు. బదిలీల్లో ఎవరి సిఫారసులు తావివ్వలేదన్నారు. రొటేషన్ పద్ధతిలో ఫీల్డ్‌లోని ఉద్యోగులను ప్రధాన కార్యాలయానికి, ఇక్కడి ఉద్యోగులను ఫీల్డ్‌కు పంపించామన్నారు.
భారీ దోపిడీకి కుట్ర!
ఉద్యోగుల బదిలీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తుండటం, డిసెంబర్, జనవరిలో పండుగలు ఉండటంతో పౌరసరఫరాల సంస్థలో భారీఎత్తున నిత్యావసర సరుకులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా కాంట్రాక్టులు ఉంటాయి.
ఈ సందర్భంలో సదరు కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటే భారీగా కమీషన్లు కొట్టేయొచ్చనే కుట్రకు బీజం వేశారు. అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టెండర్ల వంటి కీలక పోస్టులు మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా భారీగా కమీషన్లు దండుకునే ప్రణాళికలో భాగంగానే మొత్తం బదిలీల ప్రక్రియ నడిచినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధాన కార్యాలయంలో మంత్రి చెప్పిన వారికి కీలక పోస్టింగ్‌లు కట్టబెట్టనున్నారు.
వీరి సహాయంతో నెలావారీ వసూళ్లు మంత్రి కార్యాలయానికి నేరుగా చేరిపోయేలా స్కెచ్ వేసినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఉద్యోగులపై గతంలో చార్జెస్ నమోదైనప్పటికీ అవి తేలకుండా తిరిగి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడంపై దోపిడీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment