Transfer process
-
సివిల్ సప్లైస్‌లో కంత్రీ ప్లాన్
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో బదిలీల పర్వం ఉద్యోగుల్లో చిచ్చురేపుతోంది. బదిలీల ప్రక్రియ కోసం సంస్థ నియమించిన ఫోర్ మెన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పేర్లకు పట్టం కట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవోలను, ఉద్యోగుల వినతులు, మానవీయ కోణాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీలు చేశారంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపట్టింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు ఆహా్వనించింది. ఇవన్నీ కేవలం ప్రక్రియలో భాగంగా చేపట్టారే తప్ప.. క్షేత్ర స్థాయిలో విస్మరించారు. వాస్తవానికి ఫోర్‌మెన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీకి సిఫారసు చేస్తే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఆ మేరకు అధికారులు నివేదిక రూపొందించారు. తీరా సాయంత్రానికి మంత్రి కార్యాలయం నుంచి మరో జాబితా వచ్చింది. అందులో పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే బదిలీ చేయాలని సాక్షాత్తూ మంత్రి హుకుం జారీ చేయడం.. ఎండీ వారిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. చేతులు మారిన ముడుపులు? పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఏకంగా తొమ్మిది మందిని ప్రధాన కార్యాలయంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో తప్పనిసరి బదిలీలు లేనివారు, రిక్వెస్టు కూడా పెట్టుకోని వారు ఉండటం గమనార్హం. ఇక్కడే మొత్తం బదిలీల్లో తెనాలి, విజయవాడలోని ప్రముఖ హోటళ్ల వేదికగా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిస్తున్నాయి. డీఎం పోస్టుకు డిమాండ్ ఉన్నచోట రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, మిగిలిన జిల్లాల్లో రూ.10 లక్షలకు పైగా రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరోపణలున్నా పట్టించుకోలేదు విజయనగరం జిల్లా డీఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి రావడంతో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదే ఉద్యోగిని తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశంతో అక్కడి పోస్టును వేకెంట్‌గా చూపించి వదిలేసినట్టు తెలుస్తోంది. కర్నూలులో డీఎంగా పనిచేస్తున్న ఉద్యోగిని రిక్వెస్ట్ పెట్టుకోకుండానే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమెపై హైదరాబాద్‌లో పని చేస్తున్నప్పటి నుంచి వివిధ ఆరోపణలతో చార్జెస్ నమోదయ్యాయి. ఇదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిధుల దురి్వనియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, రెండేళ్లు ఉద్యోగంలో చెప్పాపెట్టకుండా మాయమైన మరో ఉద్యోగిని సైతం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ను వివరణ కోరగా.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేశామన్నారు. బదిలీల్లో ఎవరి సిఫారసులు తావివ్వలేదన్నారు. రొటేషన్ పద్ధతిలో ఫీల్డ్‌లోని ఉద్యోగులను ప్రధాన కార్యాలయానికి, ఇక్కడి ఉద్యోగులను ఫీల్డ్‌కు పంపించామన్నారు. భారీ దోపిడీకి కుట్ర! ఉద్యోగుల బదిలీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తుండటం, డిసెంబర్, జనవరిలో పండుగలు ఉండటంతో పౌరసరఫరాల సంస్థలో భారీఎత్తున నిత్యావసర సరుకులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా కాంట్రాక్టులు ఉంటాయి. ఈ సందర్భంలో సదరు కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటే భారీగా కమీషన్లు కొట్టేయొచ్చనే కుట్రకు బీజం వేశారు. అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టెండర్ల వంటి కీలక పోస్టులు మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా భారీగా కమీషన్లు దండుకునే ప్రణాళికలో భాగంగానే మొత్తం బదిలీల ప్రక్రియ నడిచినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధాన కార్యాలయంలో మంత్రి చెప్పిన వారికి కీలక పోస్టింగ్‌లు కట్టబెట్టనున్నారు. వీరి సహాయంతో నెలావారీ వసూళ్లు మంత్రి కార్యాలయానికి నేరుగా చేరిపోయేలా స్కెచ్ వేసినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఉద్యోగులపై గతంలో చార్జెస్ నమోదైనప్పటికీ అవి తేలకుండా తిరిగి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడంపై దోపిడీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
మూడు అంశాల ఆధారంగానే.. సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు
సాక్షి, అమరావతి: పరస్పర అంగీకార బదిలీలతో పాటు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులై ఉండి వేర్వేరుచోట్ల పనిచేస్తున్న వారికి.. ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి మాత్రమే ఈ ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను పరిమితం చేయాలని ఆ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మ డి జిల్లాల ప్రాతిపదికనే ఈ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తూ.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, అలాగే ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు సైతం అవకాశం కల్పించాలని నిర్ణ యించారు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, కేవ లం నాలుగు నెలల కాలంలోనే కొత్తగా 1.34 లక్షల శాశ్వ త ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలి సిందే. అప్పట్లో ఈ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు మూడున్నరేళ్లలోపు సర్విసును పూర్తిచేసుకున్నారు. విధివిధానాల ఖరారుకు కసరత్తు ఈ ఏడాది సాధారణ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా తొలిసారి బదిలీలకు అవకాశం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విధివిధానాల ఖరారుపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మంగళవారం ఆ శాఖ అధికారులతో ఈ విషయమై సమీక్షించారు. వివిధ సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయి వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. సాధారణ వినతుల బదిలీలకు కళ్లెం.. ఇక సాధారణ వినతి మేరకు బదిలీలకు అవకాశం కల్పిస్తే.. మారుమూల గిరిజన ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులందరూ బదిలీలు కోరుకుంటారని.. దీంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నందున ఆ తరహా బదిలీలను పూర్తిగా కట్టడి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో పరసర్ప అంగీకారం, భార్యాభర్తల అంశం, మెడికల్ గ్రౌండ్.. ఈ మూడు అంశాల ప్రాతిపదికన ఈసారి బదిలీలకు పరిమితం కావాలని నిర్ణయించారు. వీటి ప్రాతిపదికన కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. భార్యాభర్తల ప్రాతిపదికన కూడా ఇద్దరూ ప్రభుత్వోద్యోగులైతేనే (కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఏ విభాగమైనా) పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే, ఉద్యోగి సొంత గ్రామానికి ఎట్టి పరిస్థితిలోనూ బదిలీ చేయరు. ఇక ఈ బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను సిద్ధం చేయనున్నారు. -
వీఆర్వోల బదిలీ ప్రక్రియపై హైకోర్టు స్టే
-
రాజస్తాన్ సీఎంకు టీచర్ల షాక్.. ‘అవును మేం లంచం ఇచ్చాం’
జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఊహించని ఇబ్బందికర పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చింది. బదిలీలు, కొత్తగా పోస్టుల కోసం తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకుని, డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందంటూ సాక్షాత్తూ సీఎం పాల్గొన్న సభలో పలువురు టీచర్లు ఆరోపణలు చేశారు. టీచర్ల ఆరోపణలపై స్పందించిన సీఎం గహ్లోత్.. ఇది నిజమేనా అంటూ ప్రశ్నించగా ఊహించని విధంగా ‘అవును..మేం ముడుపులు ఇచ్చుకున్నాం..’అంటూ సభికుల నుంచి సమాధానం వచ్చింది. దీంతో నిశ్చేష్టుడైన గహ్లోత్.. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చారు. ‘బదిలీల కోసం ఉపాధ్యాయులు లంచాలు ఇవ్వాల్సి రావడం దురదృష్టకరం. ఇందుకు సంబంధించి త్వరలో ఒక విధానాన్ని ప్రకటిస్తాం’ అంటూ ప్రకటించారు. ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కూడా గోవింద్ దోతస్రా కూడా ఉండటం గమనార్హం. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. -
కాగితాలపై కార్యాలయం.. ఉద్యోగులకు బదిలీల భయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పన్నుల శాఖ ఉద్యోగుల్లో ‘బదిలీ’ల గుబులు మొదలయింది. సాధారణ బదిలీల్లో కాకుండా ప్రత్యేకంగా ఈ నెలలో బదిలీ ప్రక్రియ విడుదల చేయడం, అందులోనూ సర్కిళ్ల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడిన కొత్త సర్కిళ్ల కార్యాలయాలను ఏర్పాటు చేయకుండానే బదిలీలు చేపడుతుండడం ఆ శాఖ సిబ్బందికి సమస్యగా మారుతోంది. కొత్తగా ఏర్పాటయిన 20కిపైగా సర్కిళ్లకు ఎక్కడా కార్యాలయాలు తీసుకోకుండానే బదిలీలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంతో అక్కడకు బదిలీ అయితే తాము ఎక్కడ కూర్చుని పనిచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ శాఖ సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు బదిలీల నిబంధనల్లోనూ కొన్ని ఇబ్బందులున్నాయని, అన్నీ సరిచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని వారు కోరుతున్నారు. 91 నుంచి 100కు పెరిగిన సర్కిళ్లు వాస్తవానికి, పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడో జరగాల్సి ఉండగా, ఇటీవలే దానిని పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాలేదనే కారణంతోనే సాధారణ బదిలీల్లో ఈ శాఖ సిబ్బందికి అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు శాఖ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసి సర్కిళ్లను హేతుబద్ధీకరించారు. దీంతో అప్పటివరకు 91గా ఉన్న సర్కిళ్లను 100కు పెంచారు. అధికారికంగా 9 సర్కిళ్లే పెరిగినా, కొన్ని పాత సర్కిళ్లను తొలగించడంతో 20కిపైగా సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే, సర్కిళ్లలో పనిచేయాల్సిన అసిస్టెంట్ కమిషనర్లు, పన్నుల అధికారులు, డిప్యూటీ పన్నుల అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు ఎక్కడా కార్యాలయాలు కానీ, సీట్లు కానీ కేటాయించలేదు. కేవలం పేపర్ల మీద సర్కిళ్లను పెంచి తాజా బదిలీల ప్రక్రియలో ఈ సర్కిళ్లకు బదిలీ ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో సర్కిల్‌కు కనీసం 10 మంది సిబ్బంది చొప్పున ఆ 20 సర్కిళ్లకు కనీసం 200 మంది బదిలీ అవుతారని అంచనా. ఈనెల 27న ప్రారంభమైన బదిలీల ప్రక్రియ వచ్చేనెల 8తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త సర్కిళ్లకు బదిలీ అయిన ఉద్యోగులు ఎక్కడ కూర్చుని పనిచేయాలన్న దానిపై ఉన్నతాధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణకు గతంలో ఉన్న మాదాపూర్ సర్కిల్‌ను మాదాపూర్, మాదాపూర్ 1–4, వికారాబాద్‌ల పేరుతో 6 సర్కిళ్లుగా విడగొట్టారు. ఇందులో మాదాపూర్, మాదాపూర్–1 సర్కిళ్లకు గగన్‌విహార్ కాంప్లెక్స్‌లో కార్యాలయాలున్నాయి కానీ, మిగిలిన నాలుగు సర్కిళ్లకు ఎక్కడా కార్యాలయాలు లేవు. ఇప్పుడు ఆ 4 సర్కిళ్లకు బదిలీ అయితే తమ పరిస్థితేంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సిటీ డివిజన్లలో మూసివేసిన సర్కిళ్ల సిబ్బందిని, చెక్‌పోస్టుల ఎత్తివేత కారణంగా పోస్టింగ్‌లు లేని వారిని హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్లలోని సర్కిళ్లకు బదిలీ చేస్తామని, వీరిని కేటాయించిన తర్వాతే మిగిలిన వారికి ప్రాధాన్యం ఇస్తామని ఉన్నతాధికారులు చెపుతున్నట్టు తెలుస్తోంది. అలా అయితే తమకు అన్యాయం జరుగుతుందని హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్లలోని సర్కిళ్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియలో మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ వారిని రిలీవ్ చేయవద్దని, కార్యాలయాలు ఏర్పాటుచేసిన తర్వాత పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! 90% మందికి స్థాన చలనం తాజాగా పన్నుల శాఖలో చేపట్టిన బది లీల కారణంగా ఆ శాఖలోని 90శాతం మంది సిబ్బందికి స్థానచలనం తప్పడం లేదు. పన్ను ల శాఖలో గత నాలుగేళ్లుగా బదిలీలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయిన సిబ్బందిని బదిలీలు చేయాలని నిర్ణయించడంతో అడపాదడపా ఇటీవల బదిలీలయిన వారు, రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారు మిన హా అందరూ బదిలీ అవుతారని అంటున్నారు. అలా జరిగితే శాఖ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని, కనీసం మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే బదిలీలు చేయాలని సిబ్బంది కోరుతుండడం గమనార్హం? -
ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు!
- రెండేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్నవారందరూ అర్హులు - ఉత్వర్వులిచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీలకు సోమవారం(జూన్ 20)తో గడువు ముగియగా, అదే రోజు ఆరోగ్యశాఖ బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈనెల 30 వరకూ బదిలీలకు గడువిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఒక చోట రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన వారందరూ బదిలీకి అర్హులేనని వెల్లడించారు. ప్రతి విభాగంలో 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదని, ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకేచోట ఎక్కువ కాలంగా పనిచేస్తున్న వారికి, ఐటీడీఏ(ఏజెన్సీ) ప్రాంతాల్లో వారికి, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి, మానసిక వికలాంగ పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. -
అంతా ‘ఆఫ్‌లైనే’!
తమ అనుయాయులు, ఆ అనుయాయుల అనుచరులు, ఆ అనుచరులకు కావాల్సినవారు.... ఇలా ఎవరికివారు తమకు ఇష్టమైన ఉద్యోగులను తమ ఇలాకాల్లో నియమించుకోవాలని అధికార పార్టీ నాయకుల విశ్వప్రయత్నం! అంతా ఆన్లైన్లోనే పారదర్శకంగా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నా... మరోవైపు సిఫారసు లేఖల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి శాఖకు సంబంధించి అవి దొంతరలే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దాఖలు చేసిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అధికార పార్టీ నేతల సిఫారసులకు పెద్దపీట వేయాలా? అనేది జిల్లా ఉన్నతాధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, జెడ్పీ, పంచాయతీరాజ్ విభాగాల్లో ఈ పరిస్థితి ఎక్కువ. గడువు రోజైన సోమవారం అర్ధరాత్రి వరకూ బదిలీల జాబితా బయటకు వెలువరించలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కీలకమైన రెవెన్యూ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, వైద్య ఆరోగ్య శాఖల్లో ఉద్యోగుల బదిలీల హడావుడి ఎక్కువగా ఉంది. వాస్తవానికి మే నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తిచే యాలి. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందనే ఆరోపణలు ఉద్యోగవర్గాల్లో వెల్లువెత్తాయి. అందుకు నిదర్శనమా అన్నట్లుగానే ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన బదిలీలకు తెరలేపింది. కేవలం తొమ్మిది రోజుల్లో అంటే 20వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. పాత విధానంలోనే బదిలీలు చేయాలనే అధికారులు నిర్ణయించినా... పారదర్శకత పేరుతో ఆన్లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ ఆన్లైన్ విధానం ఉద్యోగులకు లాభం చేకూర్చుతుందనే అభిప్రాయాలు వచ్చినా చివరకు బదిలీల ప్రక్రియ సిఫారసుల విధానంలోనే కొనసాగిస్తున్నారు. సిఫారసుల వర్షం ప్రభుత్వం చెబుతున్నట్లు అంతా ఆన్లైన్లో చేస్తే అందరికీ మంచిదే! సిఫారసులకు అవకాశం ఉండదు! అసలు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే పూర్తి చేస్తే మరి అధికార పార్టీ నాయకులు సిఫారసు లేఖలు... కొన్ని లేఖల్లో పదుల సంఖ్యలో పేర్లతో చిన్నచిట్టా మాదిరిగా ఇవ్వడంలో అర్థమేమిటని కొంతమంది ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంగళవారం నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ సోమవారం అర్ధరాత్రి దాటినా బదిలీల జాబితా ప్రకటించలేదు. ఎట్టిపరిస్థితిలోనూ మంగళవారం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు. కానీ ఎలా అమలు చేయాలో తెలియక శాఖాధిపతులు అవస్థ పడుతున్నారు. దేనికి ప్రాధాన్యం ఒకవైపు ఆన్లైన్లో ఉద్యోగుల దరఖాస్తులు, వారి ఆప్షన్లు... మరోవైపు అధికార పార్టీ నాయకుల సిఫారసులు, పేర్లతో చిట్టాలు... వాటిలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలోనని జిల్లా ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. బదిలీలపై శాఖాధిపతులదే తుది నిర్ణయం కావడంతో అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయనేది బహిరంగ రహస్యం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన గత రెండు దఫాల బదిలీల్లోనూ అధికార పార్టీ నాయకుల జోక్యం మితిమీరిపోయిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి అలాంటి పొరపాటులు జరిగితే తమ పరువు పోతుందని అధికారులు భయపడుతున్నారు. అలాకాకుండా ఆన్లైన్ ప్రక్రియకే ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేస్తే ఎక్కడ అధికార పార్టీ నాయకుల వేధింపులకు గురి అవుతామోననే భయమూ లేకపోలేదు. దీంతో అటు ఆన్లైన్ దరఖాస్తులను, ఇటు అధికార పార్టీ నాయకుల సిఫారసుల చిట్టాలను సరిచూసుకొనే పనితోనే సోమవారం రోజంతా గడిచిపోయింది. అర్ధంతరంతో అగచాట్లు గత ఏడాది జూలైలో జరిగిన బదిలీల పర్వంలో రెవెన్యూ విభాగం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొలుత అధికార పార్టీ నాయకుల సిఫారసుల ప్రకారమే గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లు 110 మందిని ఒకే జాబితాతో బదిలీ చేశారు. దీంతో ఆరోపణలు, ఒత్తిళ్లు రావడం, ఈలోగా గడువు ముగియడంతో ఆ బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. ఇదే వరుసలో అప్పట్లో కొంతమంది అదేశాఖలోని సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు తమకు బదిలీ ఉత్తర్వులు వచ్చినా నిలుపుదల చేసుకున్నారు. ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ శాఖలోని వివిధ క్యాడర్లలో 160 మందిని బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. వారిలో వీఆర్వోలే 70 మందికి పైగా ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కరు తప్ప జిల్లాలో ఏ తహసీల్దారునూ బదిలీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వారిలో ఎవ్వరికీ ఒకేచోట కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తికాలేదు. జెడ్పీలోనూ ఇదే పరిస్థితి జెడ్పీ, పంచాయతీరాజ్ ఉద్యోగులకు సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే బదిలీ ఉత్తర్వులు ఇవ్వడానికి బదులు ఇప్పటికే ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకున్నవారికే మరోసారి కౌన్సెలింగ్ జరుగుతున్న చోటే ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో రాజకీయ జోక్యంతోనే బదిలీలు జరుగుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. అలాగే ఐసీడీఎస్ పరిధిలోని 26 మంది ఉద్యోగులు ఆప్షన్లు నమోదు చేశారు. కానీ రెండు మూడు రోజుల వరకూ బదిలీ ఉత్తర్వులు వెలువడే పరిస్థితి కనిపించట్లేదు. వైద్యశాఖలో ఆలస్యంగా జాతర జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు సంబంధించిన విధివిధానాలతో జీవో నంబర్ 272ను ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం విడుదల చేసింది. దీంతో పది రోజుల ఆలస్యంగా బదిలీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. 27వ తేదీన వెబ్‌కౌన్సెలింగ్, 28వ తేదీన అభ్యంతరాలు (గ్రీవెన్స్)కు అవకాశం ఇచ్చింది. 30వ తేదీలోగా ఈ బదిలీలు పూర్తి చేయాలని ఈ జీవోలో ఆదేశించింది. బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు డీఎంహెచ్‌వో చైర్మన్‌గా, అదనపు డీఎంహెచ్‌వో, అడ్మినిస్ట్రేషన్ అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అన్ని కేటగిరీల్లో సుమారు 2,700 మంది, అలాగే రిమ్స్‌లో 734 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 శాతం మందికే బదిలీ అవకాశం ఉంటుంది. -
అసాధ్యమే!
♦ 20లోపు బదిలీల ప్రక్రియ పూర్తి కావడం గగనమే ♦ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఇప్పటికీ అందని ఆదేశాలు ♦ గడువు ముంచుకొస్తున్నా.. ప్రారంభం కాని కౌన్సెలింగ్ ♦ బదిలీ కోరుకునే ఉద్యోగుల్లో ఆందోళన.. ఓ వైపు ముంచుకొస్తున్న గడువు.. మరో వైపు అందని స్పష్టమైన ఆదేశాలు.. వెరసి ఉద్యోగుల బదిలీల పర్వం ఒక ప్రహసనంగా మారింది. కొన్నిశాఖల్లో ఆన్లైన్ అంటున్నారు... మరికొన్ని శాఖల్లో మ్యానువల్తో సరిపెట్టమంటున్నారు.. ఫలితంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బదిలీలు కోరుకునే ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. సాక్షి, కడప : ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా బదిలీలపైనే చర్చసాగుతోంది. నలుగురు ఉద్యోగులు కలిస్తే చాలు బదిలీలపైనే టాపిక్ నడుస్తోంది. ఈ నెల 20లోపు బదిలీల ప్రక్రియ పూర్తికావాలన్న ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోడంతో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. అసలు బదిలీపై వెళతామా? లేక గడువు దాటి ఆగిపోతుందా? అన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. ఏదో ఒక అవకాశం వచ్చింది కదా అని ఏదో ఒక పక్క సెంటర్‌కు బదిలీపై వెళదామనుకుంటే ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన నిబంధనలు రాని నేపధ్యంలో బదిలీలపై సందిగ్దం నెలకొంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పెద్ద ఎత్తున బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ గైడ్‌లైన్స్ రాలేదు. ఆన్‌లైనా? మ్యాన్యువల్నా? వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఏలు, హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఆఫీసు ఉద్యోగులు ఇలా కలపుకుంటే దాదాపు వెయ్యి మందికి పైగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వందల సంఖ్యలో ఉద్యోగులు బదిలీపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైదరాబాదు ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకు బదిలీలకు సంబంధించి ఎలా నిర్వహించాలి.. వాటి నిబంధనలు ఏమిటి... వ్యవహరించాల్సిన అంశాలు... తీసుకోవాల్సిన ఆప్షన్లు తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు...అప్పుడంటున్నా ఇప్పటివరకు ఎలాంటి జీఓలు విడుదల కాలేదు. ఖరారు చేసిన నిబంధనల జీఓ రాకపోవడంతో ఉద్యోగుల బదిలీల వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖే కాకుండా మరికొన్ని శాఖలు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కనిపించని కౌన్సెలింగ్.. జిల్లాలో కొన్నిశాఖలు మినహా చాలా శాఖల్లో కౌన్సెలింగ్ కనిపించడం లేదు. ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 16, 17, 18 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నా విధి విధానాలు రాని కారణంగా ఇంతవరకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టలేదు. పైగా మరొక రోజు మాత్రమే గడువు ఉండడంతో కౌన్సెలింగ్‌కు మళ్లీ ప్రభుత్వం తేదీలను ప్రకటిస్తుందా? లేక ఉద్యోగుల బదిలీలు ఆపి వేస్తుందా? అన్నది అర్థం కావడం లేదు. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం : డీఎంహెచ్ఓ బదిలీలకు సంబంధించి ఉద్యోగులంతా ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని, అయితే ప్రభుత్వ నిబంధనలు ఇంతవరకు రాని పరిస్థితుల నేపధ్యంలో కౌన్సెలింగ్ జరగలేదని డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యనారాయణరాజు తెలిపారు. బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు రాగానే వెంటనే చేపడతామన్నారు. మరొకరోజు సమయం ఉందని...గడువు పెంచే అవకాశం కూడా లేకపోలేదని ఆయన తెలియజేశారు. తాము కూడా అంతా సిద్ధం చేసి గైడ్‌లైన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. జెడ్పీ ఉద్యోగుల కౌన్సెలింగ్ షురూ.. కడప ఎడ్యుకేషన్: జెడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్ శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్తు పరిధిలో పనిచేస్తున్న నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, ఎనిమిది మంది జూనియర్ అసిస్టెంట్లు, 39 మంది రికార్డు అసిస్టెంట్లు, 19 మంది వాచ్మెన్లు, 46 మంది అటెండర్లు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. మొదటగా ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారిని వరుసగా పిలిపించి ఆప్షన్లు ప్రకారం వారు కోరుకున్న చోటికి పంపించారు. అనంతరం మూడేళ్లు పూర్థి చేసుకున్న వారికి బదిలీలను నిర్వహించారు. జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, డిప్యూటీ చెర్మైన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఇన్చార్జు సీఈఓ స్వేత, డిప్యూటీ సీఈఓ ఖాదర్‌బాషా, సూపరింటెండెంట్లు అజమెద్దీన్, శ్రీనివాసులరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సెలింగ్ ఆలస్యం..శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఇన్చార్జు సీఈఓగా ఉన్న జేసీ కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్సు వల్ల సకాలంలో రాలేకపోయారు. దీంతో ఉద్యో గులతోపాటు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఆమె కోసం వేచిచూశారు. -
బదిలీ అయినా.. మారని మజిలీ
40శాతం టీచర్లను రిలీవ్ చెయ్యని విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ విజయనగరం అర్బన్: సొంత ప్రాంతానికి దగ్గరగా వెళ్దామని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఉపాధ్యాయులకు బదిలీ ప్రక్రియ సంతృప్తినివ్వలేదు. ప్రతి పాఠశాలలో 50 శాతం మంది విధిగా ఉంటూ టీచర్లు రిలీవ్ అవ్వాలని మెలిక పెట్టడంతో జిల్లాలో 40 శాతం మందికి స్థానచలనం అవని పరిస్థితి ఏర్పడింది. బదిలీ అవకాశం అక్కరకు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. కష్టాలు తీరతాయని భావించినా ఆ పరిస్థితి లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి బదిలీల ప్రక్రియను సాగదీస్తూ ఎట్టకేలకు ఇటీవల పూర్తి చేశారు. అందరినీ ఒకేసారి బదిలీ చేస్తే పాఠశాలలు మూతవేయాల్సి వస్తుందని కనీసం 50 శాతం మంది టీచర్లు ఉంటూ సీనియారిటీ ఉన్నవారినే ముందు పంపాలని విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎంఈఓలను జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. జిల్లాలో 3,683 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 1,450 మంది ఉపాధ్యాయులకు బదిలీ అవకాశం లభించింది. అయితే వీరిలో జీఓ నంబర్ 63 ప్రకారం రిలీవర్లు రాకుండా 50 శాతం లోపు ఉపాధ్యాయులు స్థానచలనం పొందే అవకాశం లేదు. ఉదాహరణకు నలుగురు ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ముగ్గురు బదిలీకోసం దరఖాస్తు పెట్టుకుంటే రిలీవర్స్ కనీసం 50 శాతం మంది ఉంటేనే బదిలీలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో వినియోగం లోకి రావడంతో దాదాపుగా 40 శాతం అంటే వివిధ కేటగిరి ఉపాధ్యాయులు 650 మందికి పైగా బదిలీ స్థానాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వీరిలో సబ్జెక్ట్ టీచర్లే అధికంగా ఉన్నారు. 2013లో జరిగిన బదిలీలో ఇదీ పరిస్థితి ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల బదిలీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన ఉపాధ్యాయులు ఇప్పటికీ వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జీవోను అమలు చేశారు. జీఓను విడుదల చేసినపుడే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే నిర్దేశాలు చేయాలని దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నేటికీ ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు తీరలేదు. -
సెలవు రోజున బదిలీల జాతర
♦ హడావుడిగా జీవోల జారీ ♦ జీవోలను గోప్యంగా ఉంచిన ♦ పలు శాఖలు బదిలీల్లో చేతులు మారిన సొమ్ము? సాక్షి, హైదరాబాద్ : బదిలీలకు చివరి తేదీ కావడంతో శనివారం సెలవు రోజున కూడా బదిలీల జాతర కొనసాగింది. ఒక విధానం లేకుండా నచ్చిన వారికి నచ్చిన చోటుకు బదిలీ చేశారు.ప్రతిదీ పారదర్శకంగా జరగాలనే సీఎం చంద్రబాబు బదిలీల విషయంలో దానికి పాతరేశారు. శనివారం అర్ధరాత్రితో బదిలీల గడువు ముగియడంతో హడావుడిగా జీవోలు జారీ చేశారు.ఇలా పలు శాఖల్లో ఒకేరోజు 63 జీవోలు జారీ చేశారు. ఇందులో వ్యవసాయ, సహకార శాఖలకు చెందిన ఏడు జీవోలను గోప్యంగా ఉంచారు. పరిశ్రమల శాఖ 50 జీవోలను గోప్యంగా ఉంచింది. పంచాయతీరాజ్ శాఖ కూడా బదిలీల జీవోను గోప్యంగా ఉంచింది. రాజకీయ సిఫార్సులతోపాటు ముఖ్యమైన స్థానాలను కోరుకున్న వారి నుంచి ఇచ్చినంత తీసుకొని బదిలీలు చేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయొద్దని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ బాబు ససేమిరా అన్నారు. వ్యవస్థీకృత, రాజకీయ బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను గతంలో హైకోర్టు నిలిపివేసింది. దీంతో సీఎం పట్టుపట్టి మరీ బదిలీలపై నిషేధాన్ని శనివారం వరకు తొలగిస్తూ కొత్తగా జీవో జారీ చేయించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అనుకున్న వారందరినీ బదిలీలు చేసి ఉంటే నిషేధం కొనసాగిస్తారని, లేదంటే మరి కొన్ని రోజులు నిషేధాన్ని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఇరిగేషన్లో ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :జల వనరుల శాఖలో బదిలీల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల బది లీలకు ఓ ఉన్నతాధికారి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందిరాసాగర్ కుడి ప్రధాన కాలువ (ఐఎస్ఆర్ఎంసీ) సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా తనకు నచ్చిన వారికి నచ్చినచోటుకు బదిలీ చేసేందుకు ఫైలు రెడీ చేసినట్టు సమాచారం. ఐఎస్ఆర్ఎంసీ సర్కిల్లో నలుగురు సూపరింటెండెంట్లు ఉండగా.. ఇద్దరు ఏలూరులోని కార్యాలయంలో, ఒకరు పోలవరంలో, మరొకరు కృష్ణాజిల్లా సీతానగరం కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతంలో శాఖాపరమైన పనులకు ఇబ్బంది రాకుండా నలుగురిలో ఇద్దరిని మాత్రమే బదిలీ చేసేవారు. ఇప్పుడు మూడేళ్ల సర్వీసు దాటిన వారందరినీ బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో ఇఎస్ఆర్ఎంసీ సర్కిల్లోనూ బదిలీల జాతర మొదలైంది. ఇదే సాకుతో ఉన్నతాధికారులు తమకిష్టమైన వారికి పెద్దపీట వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీనియారిటీతో ప్రమేయం లేకుండా. ఆప్షన్లు లేకుండా ఇద్దరు సీనియర్ సూపరింటెండెంట్లను పక్కనపెట్టి జూనియర్ అయిన మూడో వ్యక్తికి కావాల్సిన చోటకు బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెగ్యులర్, నాన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాన్ రెగ్యులర్ పోస్టుల్లోకి రెగ్యులర్ వారిని తీసుకుంటూ ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం. జాబితాను కలెక్టర్ కె.భాస్కర్‌కు పంపించినట్టు సమాచారం. ఈనెల 8నుంచి మొదలు కానున్న బదిలీల ప్రక్రియలో జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆమోద ముద్ర కూడా వేయించేందుకు సదరు ఉన్నతాధికారి వ్యూహం పన్నినట్టు తెలుస్తోందని నీటిపారుదల శాఖ వర్గాలు వాదిస్తున్నాయి. -
బదిలీ చేయండి.. వెళ్లిపోతాం
రంగారెడ్డి జిల్లా : ‘మా రాష్ట్రానికి బదిలీ చేయండి.. వెంటనే వెళ్ళిపోతాం.’ అంటూ తెలంగాణలో పనిచేస్తున్న 148 మంది ఆంధ్ర ప్రాంత టీచర్ల వేడుకుంటున్నా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిపోవ డంతో.. గతంలో ఉన్న విద్యాశాఖ నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అంతర్ జిల్లా బదిలీ ప్రక్రియతో సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో.. ఓపెన్ కేటగిరీలో జిల్లాలో నియమితులైన పలువురు టీచర్లు ఇక్కడే పనిచేస్తున్న టీచర్లు సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం లేదు. గతవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని రెండుదఫాలుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. అయినా కానీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. -
సీఆర్డీఏకు జిల్లా అణిముత్యాలు
నెల్లూరు(రెవెన్యూ): ‘చెప్పిన పని చేయడం మీకు తెలియదు, పనితీరు మెరుగుపర్చుకోకుంటే ఇంటికి పంపిస్తా...’ ఈ వాఖ్యలు చేసింది ఎవరో కాదు అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ ఎన్. శ్రీకాంత్. తహశీల్దార్లను హెచ్చరించిన ఆయనే ప్రస్తుతం అందులో కొందరిని ఏరికోరి సీఆర్డీఏకు బదిలీ చేయించుకున్నారు. ఎన్నికల కమిషన్ అడ్డుపడటంతో బదిలీ ప్రక్రియ వాయిదాపడింది. ఈ బదిలీ ప్రక్రియ ప్రస్తుతం జిల్లా రెవెన్యూ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో చెప్పిన పనిని సకాలంలో పూర్తిచేసి, నిత్యం విధి నిర్వహణలో ఉండే ఆర్డీఓలు, తహశీల్దార్లపై సీఆర్డీఏ కమిషనర్ చూపుపడింది. ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక ఆదేశాలు తీసుకుని భూసేకరణ తదితర రెవెన్యూ విషయాల్లో అనుభవం ఉండే వారిని సీఆర్డీఏకు బదిలీ చేయిస్తున్నారు. ఇప్పటికే అన్ని విషయాలపై పట్టు ఉన్న ఆత్మకూరు ఆర్డీఓ ఎంవి. రమణకు సీఆర్డీఏకు బదిలీ చేశారు. ఆయన ఈనెల చివరి వారంలో రిలీవ్ అయి సీఆర్డీఏలో డీప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల చివరివారంలో జిల్లాలో పనిచేస్తున్న 10 మంది తహశీల్దార్లు సీఆర్డీఏకు బదిలీకానున్నారు.ఎన్. శ్రీకాంత్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరించిన సమయంలో తహశీల్దార్లు పనితీరు అధ్వానంగా ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఆయన పనిచేసినంతకాలం తహశీల్దార్లను పరుగులు తీయించారు. జిల్లాలోని 46 మంది తహశీల్దార్లకు పనితీరు ఆధారంగా ర్యాంక్‌లు కూడా కేటాయించారు. ఇటీవల జరిగిన తహశీల్దార్ల బదిలీలో ఆయన ఇచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా బదిలీలు చేయాలని జాబితా సిద్ధం చేశారు. కాకుంటే టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఆ జాబితాను పక్కన పెట్టి నాయకులు సూచించిన వారిని ఆయా మండలాలకు బదిలీలు చేశారు. తహశీల్దార్ల బదిలీ జాబితాను అనేక పర్యాయాలు మార్పులు చేశారు. అయితే ఆయన ర్యాంక్‌లు ఇచ్చిన తహశీల్దార్లను సీఆర్డీఏకు బదిలీ చేయించారు. బుచ్చిరెడ్డిపాళెం. ఇందుకూరుపేట, టీపీగూడూరు తదితర మండలాల తహశీల్దార్లు ఆ జాబితాలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ అడ్డుపడటంతో బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదాపడింది. ఈ నెల చివరివారంలో తహశీల్దార్లు సీఆర్డీఏకు బదిలీ కానున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం ఇబ్బందులుపడే అవకాశం ఉంది. ఇష్టం లేని తహశీల్దార్లను బదిలీ చేయకూడదని రెవెన్యూ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఆరోగ్యం సరిగా లేనివారు, మహిళ తహశీల్దార్లను సీఆర్డీఏకు బదిలీ చేయకుడదని అసోసియేషన్ సీఎంకు విన్నవించింది. కాగా అధిక శాతం మంది తహశీల్దార్లు సీఆర్డీఏకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
బదిలీలకు నోచుకోని అయ్యవార్లు!
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉపాధ్యాయులను బదిలీలకు నోచుకోకుండా చేస్తున్నాయి. బదిలీలు జరిగితే తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చని కొందరు ఉపాధ్యాయులు, ఇది వరలో బదిలీ అయినా రిలీవర్ లేక పాతస్థానాల్లోనే కొనసాగుతున్న వారు బదిలీల వల్ల తమకు విముక్తి లభిస్తోందని భావించారు. ఇటువంటి వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. విద్యాశాఖ 1956లో ఏర్పడిన తరువాత ఒకే అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన ఐదు ఉత్తర్వుల అమలుకు నోచుకోక పోవడం ఇదే ప్రథమమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. * సెప్టెంబరు 5న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 186ను విడుదల చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే వీటిపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఏ శాఖలోనూ బదిలీలు జరిగేందుకు అవకాశం లేకుండా పోయింది. * సెప్టెంబర్ 30న ప్రభుత్వ మరో ఉత్తర్వు విడుదల చేస్తూ అక్టోబర్ పదో తేదీ వరకు బదిలీలపై ఆంక్షలను జన్మభూమి సందర్భంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. జన్మభూమి పూర్తయినా ఇప్పటికి కూడా బదిలీల మార్గదర్శకాలు విడుదల కాలేదు. * అక్టోబర్ 20న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 25ను విడుదల చేస్తూ ఉపాధ్యాయులకు బదిలీలు లేవని వర్క్ ఎడ్జిస్ట్మెంట్ పేరిట రేషనలైజేషన్ జరపాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో జిల్లాను యూనిట్‌గా పరిగణించాలని తెలిపింది. దీన్ని అమలు చేయాలని యోచిస్తుండగా ప్రభుత్వం ఇంకో ఉత్తర్వును విడుదల చేసింది. * అక్టోబర్ 30న 11925 సంఖ్యతో ఓ ఉత్తర్వును విడుదల చేస్తూ మండల పరిధిలో మాత్రమే వర్క్ ఎడ్జస్ట్మెంట్ పేరిట రేషనలైజేషన్ చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పక్క మండలాలకు అవసరం మేరకు ఉపాధ్యాయులను తరలించాలని పేర్కొంది. 2013 బదిలీ ఉపాధ్యాయులను ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకోకూడదు. గతంలో రేషనలైజేషన్‌లో వచ్చిన జూనియర్ ఉపాధ్యాయులను ఇప్పుడు అదనపు ఉపాధ్యాయునిగా చూపించకూడదు. ప్రస్తుతం పాఠశాలలో రెండేళ్లు సర్వీసు పూర్తికాకుంటే జూనియర్ అయినా రేషనలైజేషన్ చేయకూడదు. వీటివల్ల ఈ ఉత్తర్వులు అమలయ్యే సూచనలు లేవు. అయినా ప్రభుత్వం ఈ ఉత్తర్వును కాదని వేరొక ఉత్తర్వును విడుదల చేసింది. * నవంబర్ ఆరో తేదీన 2093 సంఖ్య తో ఓ ఉత్తర్వును విడుదల చే స్తూ హైస్కూళ్లలో మాత్రమే సబ్జెక్టు టీచర్లను వర్క్ ఎడ్జ్స్ట్మెంట్ పేరిట రేషనలైజేషన్ చేయాలని తెలిపింది. హైస్కూళ్లలో ఏ మండలంలోనూ అదనపు ఉపాధ్యాయులు లేరని విద్యాశా ఖ ఎప్పుడో గుర్తించింది. అందువలన ఈ ఉత్తర్వులు అమలయ్యే పరిస్థితి లేదు. * ఇలా రోజుకో రకమైన ఉత్తర్వును విడుదల చేస్తూ అధికారులను గందరగోళానికి గురిచేయడమే కాకుండా ఉపాధ్యాయులకు బదిలీలు లేకుండా చేసింది. -
వాయిదా మంత్రం
* బదిలీలపై తొలగని ప్రతిష్టంభన * జన్మభూమి కార్యక్రమాలు పూర్తికాక గందరగోళం ఏలూరు : ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. సాంకేతిక కారణాల పేరిట ప్రభుత్వం తరచూ వాయిదా వేస్తోంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చాలా జిల్లాల్లో వాయిదా పడటంతో ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన బదిలీల ప్రక్రియపై ప్రతిష్టంభన నెలకొంది. వాస్తవంగా ఈ నెల 20 నాటికి జన్మభూమి సభలు పూర్తి కావాల్సి ఉండగా, అదే రోజున బదిలీలు చేపడతామని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జన్మభూమి సభలను వారుుదా వేశారు. పొరుగు జిల్లాల అధికారులు, ఉద్యోగులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లడంతో ఆయూ జిల్లాల్లోనూ వాయిదా పడ్డాయి. తుపాను ప్రభావం లేని జిల్లాల్లో సోమవారం నుంచి జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ.. తుపాను బాధి త ప్రాంతాల్లో ఈ నెల 30లోగా పూర్తవుతాయూ లేదా అనేది సందేహంగానే ఉంది. మరోవైపు తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాలను అంచనా వేయూల్సి ఉంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని జిల్లాల్లో శాఖల వారీగా బదిలీలను ఒకేసారి చేపట్టాల్సి ఉండటం, ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో బదిలీల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వ్యవహారం ఎప్పటికి కొలిక్కివస్తుందో తెలియక ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. సూపరింటెండెంట్ల పరిస్థితి ఏమిటో! జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో కొంతమంది సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఇతర జిల్లాలకు ఇటీవల బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వారందరినీ జన్మభూమి కార్యక్రమాలు పూర్తయ్యూక ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేయూలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో జన్మభూమి కార్యక్రమాలు ఈ నెల 25 వరకు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో వారిని 25వ తేదీ తరువాత రిలీవ్ చేస్తారా, జన్మభూమి కార్యక్రమాలతో సంబంధం లేని, కార్యక్రమాలు పూర్తయిన ప్రాంతాల్లోని సూపరింటెండెంట్ స్థాయి అధికారుల సంగతి ఏమిటనేది నేటికీ స్పష్టం కాలేదు. దీంతో వారంతా కొత్త స్థానాల్లో చేరాలా, వద్దా అనే విషయమై గందరగోళం నెలకొంది. ఇలా ప్రతి సందర్భంలోనూ బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వాయిదాల పర్వం కొనసాగే అవకాశం ఉందని సమాచారం. -
ఆపండి..!
- ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా - జన్మభూమి కార్యక్రమాల తరువాత నిర్ణయం - ఇప్పటికే రిలీవ్ అయిన వారికి మినహాయింపు ఏలూరు : ఉద్యోగులు, అధికారుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2నుంచి 20 వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం చేపడుతున్న దృష్ట్యా.. తిరిగి నిర్ణయం తీసుకునే వరకు బదిలీల ప్రక్రియను నిలుపుదల చేయూలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బదిలీ అరుున ఉద్యోగులు, అధికారులకు మాత్రం మినహారుుంపు ఇచ్చారు. మిగిలిన వారిని ఎప్పుడు బదిలీ చేయూలనే విషయంపై అక్టోబర్ 20 తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. బదిలీలపై తాత్కాలిక నిషేధం విధించడంతో అధికారులు వత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పథకాల హడావుడి.. మరోవైపు బదిలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటామా? లేదా ? అన్న ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు నువైన స్థానం కోసం ఎదురుచూస్తున్న వారు వాయిదాను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి అక్టోబర్ 10 నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా అధికారులు, ఉద్యోగుల్ని బదిలీ చేస్తే ఆ కార్యక్రమం కుంటుపడే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్ని జపిస్తోంది. అడుగడుగునా గందరగోళమే బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నాటినుంచీ గందరగోళ పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నారుు. తొలుత సెప్టెంబర్ 10 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయూలని చెప్పిన ప్రభుత్వం తరువాత ఆ గడువును నెల రోజులు పెంచి అక్టోబర్ 10 వరకు అవకాశం ఇచ్చింది. తాజాగా అక్టోబర్ 20వ తర్వాతే బదిలీల ప్రక్రియ జరపాలని ఆదేశించింది. ఇదిలావుండగా జీరో సర్వీస్ పేరిట అన్ని శాఖల్లోను, అన్ని విభాగాల్లోను అధికారులు, సిబ్బందికి స్థానచలనం కల్పించాలని ఆదేశాలిచ్చింది. ఇప్పడేమో కొన్ని శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో 20 శాతం మందిని మించి బదిలీ చేయడకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటివరకు ఎవర్ని.. ఎలా బదిలీ చేయాలన్న అంశం పై మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎంపీడీవోలు, ఇంజినీర్లను జోన్ల వారీగా బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారుు. మరోవైపు అధికారుల బదిలీ విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నతాధికా రులకు తలబొప్పి కట్టిస్తున్నారుు. ఇలాంటి పరిస్థితులు, గందరగోళాల నడుమ బదిలీలు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో అన్న అనుమానాలు ఉద్యోగ వర్గాలను వెంటాడుతున్నాయి. -
బది‘లీల’లు
సాక్షి, అనంతపురం: జిల్లాలో బదిలీల ప్రక్రియ మొదలైంది. తొలుత జేఎన్టీయూ(ఏ)లో బదిలీల ప్రక్రియ మొదలు కాగా, మలి దశలోరెవెన్యూశాఖలోని సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, తహసీల్దార్లకు బదిలీలు జరిగాయి. మరో రెండు మూడురోజుల్లో పోలీసుశాఖలోని ఎస్ఐలు, సీఐల బదిలీలు జరగనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ఎస్ఐలు, సీఐలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొంత మంది హైదరాబాద్‌లో తిష్టవేశారు. గడిచిన ఎన్నికల్లో తమకు మద్దతుగా పనిచేయలేదన్న భావనతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులను ముందుగా బదిలీ చేయించి..వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని రప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఆర్డీఓ వెంకటేశంను బదిలీ చేయించి..ఆయన స్థానాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందుల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామమూర్తితో భర్తీ చేసేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితో పాటు మంత్రులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక కళ్యాణదుర్గం ఆర్డీఓ మలోలను కర్నూలుకు బదిలీ చేయించి.. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామారావును రప్పించుకునేందుకు అధికార పార్టీ నాయకులు మార్గం సుగమమం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రాజీవ్ విద్యామిషన్‌కు ఇన్చార్జ్ పీవోగా వ్యవహరిస్తున్న డీఈఓ మధుసూదన్‌రావును ఆ బాధ్యతల నుంచి తప్పించి..ఆయన స్థానంలో నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించేందుకు జిల్లా మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో సీఎం పచ్చజెండా ఊపిన వెంటనే వీరికి బదిలీ ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది.ఇదిలా ఉండగా జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ కానున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పరిపాలనదక్షుడు, మంచి మాటకారిగా పేరుపొందిన జేసీని తూర్పుగోదావరి జిల్లాకు రప్పించుకునేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే జేసీని మరికొంత కాలం పాటు జిల్లాలోనే పనిచేయాలని మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డిలు సూచించినట్లు సమాచారం. -
ఇక బదిలీల జాతర!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నూతన ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు జరిగిన నేపథ్యంలో ఇక బదిలీల ప్రక్రియకు తెర లేవనుంది. జిల్లా పాలనపై సర్కారు మార్కు పడనుంది. సుమారు నాలుగైదు మాసాల క్రితం జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీసు, రెవెన్యూ అధికారులు తిరిగి జిల్లాకు రానున్నారు. 33 మంది సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు, 37 మంది రెవె న్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లారు. నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి జిల్లా కు వచ్చిన అధికారులు సైతం తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల్లో పలువురు బదిలీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. రెం డు, మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నెలాఖరు వరకు ఈ జాతర కొనసాగనుంది.జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో బదిలీలు, నియామకాలపై వివిధ ప్రభుత్వ శాఖ ల అధికారుల్లో అలజడి మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఐదు నెలల క్రితం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో తిరిగి ఆ అధికారులు జిల్లాలో కోరుకున్నచోట పోస్టింగ్ కోసం పైరవీల బాట పట్టారు. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, విద్య, పోలీసు, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సహా అన్ని ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరగవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బదిలీల ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పలువురు అధికారులు, ఉద్యోగులు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీడీవోలు, తహశీల్దార్లతో పాటు వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నందున వారు సైతం కోరుకున్న స్థానం కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా రెండు రోజుల్లో బదిలీల ఉత్తర్వుల పరంపర మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నేతలు, సహచర శాసనసభ్యులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.