సెలవు రోజున బదిలీల జాతర
♦ హడావుడిగా జీవోల జారీ
♦ జీవోలను గోప్యంగా ఉంచిన
♦ పలు శాఖలు బదిలీల్లో చేతులు మారిన సొమ్ము?
సాక్షి, హైదరాబాద్ : బదిలీలకు చివరి తేదీ కావడంతో శనివారం సెలవు రోజున కూడా బదిలీల జాతర కొనసాగింది. ఒక విధానం లేకుండా నచ్చిన వారికి నచ్చిన చోటుకు బదిలీ చేశారు.ప్రతిదీ పారదర్శకంగా జరగాలనే సీఎం చంద్రబాబు బదిలీల విషయంలో దానికి పాతరేశారు. శనివారం అర్ధరాత్రితో బదిలీల గడువు ముగియడంతో హడావుడిగా జీవోలు జారీ చేశారు.ఇలా పలు శాఖల్లో ఒకేరోజు 63 జీవోలు జారీ చేశారు. ఇందులో వ్యవసాయ, సహకార శాఖలకు చెందిన ఏడు జీవోలను గోప్యంగా ఉంచారు. పరిశ్రమల శాఖ 50 జీవోలను గోప్యంగా ఉంచింది. పంచాయతీరాజ్ శాఖ కూడా బదిలీల జీవోను గోప్యంగా ఉంచింది.
రాజకీయ సిఫార్సులతోపాటు ముఖ్యమైన స్థానాలను కోరుకున్న వారి నుంచి ఇచ్చినంత తీసుకొని బదిలీలు చేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయొద్దని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ బాబు ససేమిరా అన్నారు. వ్యవస్థీకృత, రాజకీయ బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను గతంలో హైకోర్టు నిలిపివేసింది. దీంతో సీఎం పట్టుపట్టి మరీ బదిలీలపై నిషేధాన్ని శనివారం వరకు తొలగిస్తూ కొత్తగా జీవో జారీ చేయించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అనుకున్న వారందరినీ బదిలీలు చేసి ఉంటే నిషేధం కొనసాగిస్తారని, లేదంటే మరి కొన్ని రోజులు నిషేధాన్ని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.