Professional associations
-
జేఏసీకి వృత్తి సంఘాలు
సాక్షి, హైదరాబాద్: జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో ఆవిర్భవించనున్న రాజకీయ పార్టీకి అనుబంధంగా వృత్తి సంఘా లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి కుల సంఘాలు కాకుండా వృత్తుల పేరుతోనే అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జేఏసీ నేతలు భావిస్తున్నారు. వృత్తి సంఘాల ఏర్పాటుపై జేఏసీ నేతలు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కులాల పేరిట సంఘాలతో కన్నా వృత్తి సంఘాలు ఏర్పాటు చేయ డం వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేయ డం కన్నా వృత్తుల పేరిట సంఘాల నిర్మాణం చేసి, వృత్తులవారీగా సమస్యలను గుర్తించడం వల్ల నిర్దిష్టమైన సమాచారం క్రోడీకరిం చడం వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. బీసీ సెల్ పరిధిలో కల్లుగీత, గొర్రెల పెంపకం, కమ్మరి, కుమ్మరి, చేనేత వంటి వృత్తులు ఉంటాయి. బీసీ సెల్ మాత్రమే ఉంటే అన్ని వృత్తుల సమస్యలపై పోరాటం చేయడం సాధ్యం కావట్లేదంటూ భావిస్తున్నారు. తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికుల వంటివాటి కొత్త వృత్తుల సమస్యలపై ఇప్పటిదాకా నిర్దిష్టమైన చర్చ, డిమాండ్లు, పోరాటాలు జరగలేదంటున్నారు. వృత్తులవారీగా పరిస్థితులపై అధ్యయనం చేయాలని, సమస్యలను గుర్తించి, పోరాటాలు చేయాలని వారి యోచన. వృత్తుల వారీగా పోరాటాలతో దాదాపుగా అన్ని కులాలు, వర్గాలకు జేఏసీ దగ్గరయ్యే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ జిల్లాల విభజన కొలిక్కి
స్వల్ప మార్పులతో ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రెవెన్యూ జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ల జిల్లాల సంఖ్యను కూడా పెంచాలని సర్కారు తొలుత భావించినా.. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆ ప్రతిపాదనను విరమించుకుంది. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ల జిల్లాల సంఖ్య యథాతథంగా ఉం చినప్పటికీ.. ఆయా రిజిస్ట్రేషన్ల జిల్లాల పరి ధులు, పేర్లు, జిల్లా కేంద్రాల్లో కొద్దిపాటి మార్పులు చేసింది. ఈమేరకు రెవెన్యూ(రిజిస్ట్రేషన్ల) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఇవీ మార్పులు.. ప్రస్తుతం రంగారెడ్డి ఈస్ట్ పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్ జిల్లాను మేడ్చల్-మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాగా మార్చింది. గతంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆ జిల్లాలను రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్ జిల్లాలుగా విభజించింది. అయితే ప్రతిపాదిత శంషాబాద్ జిల్లా పేరును రంగారెడ్డి జిల్లాగా ప్రభుత్వం మార్చడంతో.. రంగారెడ్డి ఈస్ట్ జిల్లాను అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భావించారు. పాత రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ప్రత్యేక రిజిస్ట్రేషన్ జిల్లాగా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ రెవెన్యూ జిల్లాలను కలుపుతూ మరో రిజిస్ట్రేషన్ జిల్లా ఏర్పాటు చేయాలన్న కమిషనర్ అండ్ఐజీ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే పాత మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాగా ఏర్పడినప్పటికీ మెదక్ రిజిస్ట్రేషన్ జిల్లాను సంగారెడ్డి కేంద్రంగానే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం సొసైటీల రిజిస్ట్రేషన్లపై జిల్లా రిజిస్ట్రార్లకు అధికారాలు కల్పిస్తూ మరో ఉత్తర్వునిచ్చింది. కమిషనర్ ప్రతిపాదనల మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్,అదనపు రిజిస్ట్రార్,జాయింట్ రిజి స్ట్రార్,డిప్యూటీ రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ నియామకాలకు అంగీకారం తెలుపుతూ మరో ఉత్తర్వు ఇచ్చింది. -
గ్రూప్-2 పోస్టులకు జిల్లాల చిక్కు!
జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయంతో కొత్త సమస్యలు సాక్షి, హైదరాబాద్ : జోనల్ విధానం ఉన్న గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం భర్తీకి ఆటంకంగా మారనుంది. ఇప్పటికే పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో 439 గ్రూప్-2 కొలువులకు గత ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన రాత పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయించింది. గతనెల 23న మరో 593 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో పోస్టుల సంఖ్య 1,032కి పెరిగింది. సప్లిమెంట్ నోటిఫికేషన్ వస్తుందని, త్వరలోనే రాత పరీక్షను టీఎస్పీఎస్సీ ప్రకటిస్తుందని నిరుద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో గ్రూప్-2 పోస్టుల భర్తీపై వారిలో మళ్లీ ఆందోళన మొదలైంది. పోస్టుల భర్తీలో జాప్యం తప్పదా? ప్రస్తుతం గ్రూప్-2 పోస్టులను ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం భర్తీ చేయాలా? లేదా కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు తర్వాత చేయాలా? అన్నది తేలాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు, రాష్ట్ర కేడర్, జిల్లా కేడర్ పోస్టుల విభజన తర్వాతే ప్రభుత్వం పోస్టుల భర్తీకి ముందుకెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది.జిల్లాల ఏర్పా టు, జోనల్ వ్యవస్థ రద్దుకు ఎంతలేదన్న మరో నాలుగైదు నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాత పోస్టుల స్వభావాన్ని బట్టి జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టులుగా వర్గీకరించాలి. ఇందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రూప్-2కు మాత్రమే కాదు.. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చిక్కులు తప్పేలా లేవు. లెక్చరర్ పోస్టుల భర్తీలో కూడా.. జోనల్ వ్యవస్థ రద్దయితే జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి పోస్టుల భర్తీలో అనేక సమస్యలు తలెత్తనున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయగా మిగిలే దాదాపు 2 వేల జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీలో తంటాలు తప్పవు. జూనియల్ లెక్చరర్ వంటి పోస్టులను జిల్లా కేడర్ పోస్టులుగా చేస్తే.. ఆ పోస్టులకు ఆ జిల్లాకు చెందిన వారే అర్హులు అవుతారు. దీంతో ఇతర జిల్లాలవారికి నష్టం తప్పదు. పైగా ప్రతి జిల్లాకు పదుల సంఖ్యకు మించి పోస్టులు రావు. అలాంటపుడు వచ్చే ఆ కొద్ది పోస్టులకు ఆయా జిల్లాలోని నిరుద్యోగులంతా పోటీ పడాల్సి వస్తుంది. రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీ ఎలా? ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నట్లు రాష్ట్రంలో జిల్లా, రాష్ట్ర కేడర్ పోస్టులే ఉండాలన్నది ప్రధాన నిర్ణయం. గ్రూప్-1తోపాటు గ్రూప్-2లోని కొన్ని కేటగిరీల పోస్టులను రాష్ట్ర కేడర్‌గా చేసే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వాటిని పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారా? అందులోనూ ఓపెన్ కేటగిరీ, లోకల్ కేటగిరీ పోస్టులుగా విభజించేలా నిబంధనను పొందుపరుస్తారా? అన్న విషయంలో స్పష్టత లేదు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు.. రాష్ట్ర స్థాయి పోస్టుల్లో 15 శాతం ఓపెన్ కేటగిరీ, కింద 85 శాతం పోస్టులు లోకల్ కేటగిరీ కింద భర్తీ చేస్తారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. రాష్ట్రస్థాయి పోస్టులన్నింటినీ ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తారంటున్నారు. అదే జరిగితే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇతర రాష్ట్రాల వారికి 100 శాతం పోస్టుల్లో పోటీ పడే అవకాశం కల్పించినట్లవుతుంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. -
సర్కారుపై ఒత్తిడి తెద్దాం:దేవీ ప్రసాద్
సాక్షి, ఖైరతాబాద్: తెలంగాణలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ హెల్త్ కార్డులు వెంటనే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సెప్టెంబర్–2న జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించే సమ్మెకు ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, తెలంగాణ డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షులు హరినాద్బాబు, రాష్ట్ర అధ్యక్షులు హబీబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ చేయండి
ఇరిగేషన్ ఉద్యోగులకు ఆదేశాలు ప్రైవేటు బిల్డింగ్‌లోకి వెళ్లాలని సూచనతీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు మంత్రి ఉమాను కలవనున్న ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడ : స్వరాజ్య మైదానాన్ని కాపాడుకునేందుకు ఒకవైపు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి. మరోవైపు ఆ స్థలాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లోనే ఉన్న ఇరిగేషన్ కేసీ, కేఈ, స్పెషల్ తదితర డివిజన్లను తక్షణం అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండు మూడు రోజుల్లో ఈ స్థలంలోని కార్యాలయాలను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇరిగేషన్ శాఖలోని వివిధ విభాగాల అధికారులకు జిల్లా ముఖ్య అధికారి ద్వారా సమాచారం వచ్చిందని తెలిసింది. ప్రైవేటు బిల్డింగ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు విజేత హాస్పిటల్ భవనం ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నందున దానిని లీజుకు తీసుకుంటామని, ఇరిగేషన్ కార్యాలయాలన్నీ అక్కడకు తరలించాలని జిల్లా అధికారయంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనను ఇరిగేషన్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1932 నాటి నుంచి ఇరిగేషన్‌కు సంబంధించిన రికార్డులు ఉన్నాయని, వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఆ రికార్డులను ప్రైవేటు భవనాల్లో ఉంచడం సమంజసం కాదని వారు చెబుతున్నారు. రికార్డులు ఏవైనా పాడైపోతే రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మూడు నెలలు గడువు కోరాలని యోచన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయానికి కూతవేటు దూరంలో సుమారు ఒక ఎకరా స్థలం ఖాళీగా ఉంది. ఇటీవల ఇరిగేషన్ ఉద్యోగ సంఘాల నాయకులు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను కలిసి అక్కడ తమకు భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి ఐదంతస్తుల భవన నిర్మాణానికి అంచనాలు రూపొం దించి, పంపితే తక్షణం ఆమోదిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న చోటే తమను కొనసాగించాలని ఇరిగేషన్ ఉద్యోగులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే.... కార్యాలయాలను తక్షణం తొలగించవద్దంటూ కింది స్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రమే పట్టుబడుతున్నారు. కృష్ణాడెల్టాకు చెందిన ఒకరిద్దరు కీలక అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం వద్ద నోరు మెదపడం లేదని సమాచారం. దీంతో జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు తమకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. కచ్చితంగా ప్రస్తుతం ఉన్నచోటనే మూడు నెలలు కొనసాగించాలని ఇరిగేషన్ శాఖకు చెందిన ముఖ్య అధికారులు కూడా పట్టుబడితే ఫలితం ఉంటుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. మంత్రి దేవినేనిని కలిసేందుకు సిద్ధం తక్షణం కార్యాలయాలను ఖాళీ చేయాలంటూ వచ్చిన తాఖీదులపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సోమవారం కలిసేందుకు రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. తమకు నూతన భవనం నిర్మించే వరకు ఇప్పుడు ఉన్న క్వార్టర్స్ కార్యాలయాల్లోనే కొనసాగించాలని కోరనున్నారు. తమకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించుకునేందుకు తక్షణం అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. -
వరాల జల్లు
ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రాయితీలను కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. మొత్తం 11 రాయితీలపై నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశంలో వివరించారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సమ్మెపై ఉద్యోగ సంఘాలు నేడు నిర్ణయం తీసుకోనున్నాయి. * ప్రభుత్వ ఉద్యోగులకు 11 రాయితీలు * అసెంబ్లీలో సీఎం జయలలిత వెల్లడి * సమ్మె విరమణపై నేడు నిర్ణయం * ఏపీ పోలీసుల వైఖరికి నిరసనగా వాకౌట్ చెన్నై, సాక్షి ప్రతినిధి: చట్టసభలో 110 నిబంధన కింద ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటన చేశారు. నిపుణతతో కూడిన బాధ్యాయుత పాలన అందించడం మంచి ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ మార్గంలోనే తన ప్రభుత్వం పయనిస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. అయితే ప్రభుత్వ ఆశయాలను అమలు చేసేది, అర్హులైన ప్రజలకు చేరవేసేదీ ఉద్యోగులేనని చెప్పారు. ప్రభుత్వ పాలనలో ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ఉద్యోగుల క్షేమం కోరడం సీఎంగా తన బాధ్యతని చెప్పారు. ఉద్యోగులు టీఏ, డీఏ, పెన్షన్ తదితర అంశాలపై అనేక కోర్కెలను కోరారని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించానని అన్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని రాయితీలను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుటుంబ బీమా, సంక్షేమ నిధి మొత్తాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ పెంపు వల్ల కలిగే రూ.6 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వైద్య సహాయ ప్రొఫెసర్లు, గ్రామ సేవకలకు పదోన్నతలు, పౌష్టికాహార సిబ్బందికి వేతనం రూ.1500లుగా పెంపు, కారుణ్య నియామకాల సిబ్బంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పెన్షన్ మొత్తాల పెంపుపై పరిశీలన కమిటీ నియామకం తదితర 11 రాయితీలను జయ ప్రకటించారు. ఏపీ పోలీస్ తీరుకు నిరసనగా వాకౌట్: శ్రీవారి దర్శనానికని తిరుపతికి వెళ్లిన తూత్తుకూడికి చెందిన భక్తులను ఎర్రచందన స్మగ్లర్లుగా పరిగణించి అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో దుమారం రేగింది. తమిళుల పట్ల ఏపీ పోలీసుల తీరును గర్హిస్తూ చట్టసభలో మాట్లేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాలు, పుదియతమిళగం పార్టీల సభ్యులు కోరారు. తమిళుల అరెస్ట్‌పై ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకుందో సభకు వివరించాలని స్పీకర్‌ను వారు కోరారు. మీ కోర్కెలను రికార్డు చేశాము, మరొకరు మాట్లాడాల్సి ఉంది, కూర్చోండని స్పీకర్ ఆదేశించారు. అక్రమ కేసులతో ఏపీ జైళ్లలో మగ్గుతున్న తమిళులను విడిపించేందుకు చర్యలు తీసుకోక పోగా అసెంబ్లీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని నిరసిస్తూ విపక్షాల సభ్యులంతా వాకౌట్ చేశారు. ఏ నేరం చేయని అమాయకులను ఎర్రచందనం ఎగుమతి చేసినట్లు చూపుతూ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రిన్స్ ఆరోపించారు. ఇంతటి ముఖ్యమైన అంశాన్ని సైతం సభలో ప్రస్తావించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. సమ్మెపై నేడు నిర్ణయం: ప్రభుత్వ ఉద్యోగులకు 11 రాయితీలను కల్పిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాయితీలను తాము స్వాగతిస్తున్నామని సంఘాలు పేర్కొన్నాయి. అయితే ఆయా రాయితీలను లోతుగా విశ్లేషించుకోవాల్సి ఉందని అన్నారు. రాయితీల పూర్తి వివరాలను అందిన తరువాతనే తమ అభిప్రాయాన్ని వెల్లడిచేయగలమని కొందరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన కారణంగా ఈనెల 10వ తేదీ నుంచి జరుపుతున్న సమ్మెను విరమించాలా లేక కొనసాగించాలనే అనే అంశంపై కార్యాచరణ కమిటీ శనివారం సమావేశం కానుంది. -
ఎవరెక్కడికో!
కర్నూలు(అగ్రికల్చర్) : రెవెన్యూలో భారీ బదిలీలకు తెరలేసింది. సుమారు 40 మంది తహశీల్దార్లు, 50 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 500 మంది వీఆర్వోలతో పాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు బదిలీ తప్పదని తెలుస్తోంది. మరో రెండేళ్ల వరకూ బదిలీలకు అవకాశం లేకపోవడంతో ఇంత పెద్ద ఎత్తున బదిలీలకు అధికారులు భారీ కసరత్తు చేపట్టినట్లు సమాచారం. బదిలీల ప్రక్రియ కాస్తా వేడెక్కడంతో శనివారం ఉదయం నుంచే కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగుల కోలాహలం మొదలయింది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ విభాగంలోని 1,203 మంది ఉద్యోగుల్లో ఏకంగా 740 మంది బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 69 మంది తహశీల్దార్లు ఉండగా.. 40 నుంచి 50 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. రెవెన్యూలో అత్యంత కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలపైనా కలెక్టర్ దృష్టి సారించారు. వీఆర్వోలు సొంత డివిజన్లలో పని చేయరాదని, వీరిని ఇతర డివిజన్లకు బదిలీ చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాలో 792 వీఆర్వో పోస్టులు ఉండగా.. ఇందులో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సొంత డివిజన్లలో పని చేయరాదనే నిబంధనను అమలు చేస్తే మిగిలిన 742 మందిలో 600 మందికి బదిలీ తప్పని పరిస్థితి. ఒకేచోట ఐదేళ్లకు మించి పనిచేస్తున్న వీఆర్వోలు 250 మందికి పైగా ఉన్నారు. మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న వారు 400 పైమాటే. అంతేకాకుండా పలువురు వీఆర్వోలపై అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈ ప్రకారం చూసినా కనీసం 500 మంది వీఆర్వోలు బదిలీ అయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ తహశీల్దార్లు 127మంది ఉండగా.. వీరిలో 50 మంది వరకు బదిలీ కానున్నట్లు సమాచారం. సీనియర్ అసిస్టెంట్లు 161 మంది ఉండగా.. దాదాపు 100 మంది వరకు బదిలీ కావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు 104 మంది ఉండగా.. 50 మందికి పైగా బదిలీ కావచ్చని తెలుస్తోంది. మొత్తం మీద రెవెన్యూ విభాగంలో తహశీల్దార్లతో పాటు డీటీలు, వీఆర్వోలు.. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఏకంగా 1,203 మంది ఉండగా, ఇందులో 700 బదిలీ అయ్యే అవకాశం ఉంది. బదిలీల నేపథ్యంలో ఉద్యోగుల మొత్తం వివరాలు.. అంటే ఉద్యోగంలో చేరిన తేదీ, పుట్టిన తేదీ, ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారనే సమాచారం ఉద్యోగ సంఘాలకు కలెక్టర్ ఇప్పటికే అందజేశారు. ఇందులో తప్పులుంటే తమ దృష్టికి ఆదివారం సాయంత్రంలోగా తేవాలని ఆయన సూచించారు. కలెక్టరేట్లో కోలాహలం బదిలీల నేపథ్యంలో ఉదయం నుంచే కలెక్టరేట్లో కోలాహలం మొదలయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్‌కు చేరుకుని బదిలీల ప్రక్రియపై రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. ఆదివారం రాత్రికే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొలిక్కి వస్తుందని భావించి ఉదయం నుంచే ఇక్కడే తిష్టవేసి ఆరా తీయడం కనిపించింది. అయితే, బదిలీలపై ఆదేశాలు సోమ లేదా మంగళవారం వెలువడతాయనడంతో బదిలీల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలారు. ప్రధానంగా అధికార పార్టీ నేతల నుంచి కలెక్టర్‌కు సిఫారసు చేయించుకునే పనిలో తలమునకలయ్యారు. -
సెలవు రోజున బదిలీల జాతర
♦ హడావుడిగా జీవోల జారీ ♦ జీవోలను గోప్యంగా ఉంచిన ♦ పలు శాఖలు బదిలీల్లో చేతులు మారిన సొమ్ము? సాక్షి, హైదరాబాద్ : బదిలీలకు చివరి తేదీ కావడంతో శనివారం సెలవు రోజున కూడా బదిలీల జాతర కొనసాగింది. ఒక విధానం లేకుండా నచ్చిన వారికి నచ్చిన చోటుకు బదిలీ చేశారు.ప్రతిదీ పారదర్శకంగా జరగాలనే సీఎం చంద్రబాబు బదిలీల విషయంలో దానికి పాతరేశారు. శనివారం అర్ధరాత్రితో బదిలీల గడువు ముగియడంతో హడావుడిగా జీవోలు జారీ చేశారు.ఇలా పలు శాఖల్లో ఒకేరోజు 63 జీవోలు జారీ చేశారు. ఇందులో వ్యవసాయ, సహకార శాఖలకు చెందిన ఏడు జీవోలను గోప్యంగా ఉంచారు. పరిశ్రమల శాఖ 50 జీవోలను గోప్యంగా ఉంచింది. పంచాయతీరాజ్ శాఖ కూడా బదిలీల జీవోను గోప్యంగా ఉంచింది. రాజకీయ సిఫార్సులతోపాటు ముఖ్యమైన స్థానాలను కోరుకున్న వారి నుంచి ఇచ్చినంత తీసుకొని బదిలీలు చేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయొద్దని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ బాబు ససేమిరా అన్నారు. వ్యవస్థీకృత, రాజకీయ బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను గతంలో హైకోర్టు నిలిపివేసింది. దీంతో సీఎం పట్టుపట్టి మరీ బదిలీలపై నిషేధాన్ని శనివారం వరకు తొలగిస్తూ కొత్తగా జీవో జారీ చేయించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అనుకున్న వారందరినీ బదిలీలు చేసి ఉంటే నిషేధం కొనసాగిస్తారని, లేదంటే మరి కొన్ని రోజులు నిషేధాన్ని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అధికారులపై దాడులు కొత్త కాదు: అశోక్‌బాబు
హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరగలేదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అశోక్‌బాబు అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలో దాడికి గురైన తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ అందిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఉద్యోగులపై దాడులు కొత్తగా జరుగుతున్నవి కాదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని, వనజాక్షికి బెదిరింపు లేఖ ఎలా వచ్చిందో? దాని వెనుక రాజకీయంగా ఎవరున్నారో విచారణలో తేలుతుందంటూ టీడీపీ సర్కారును అశోక్‌బాబు వెనకేసుకొచ్చారు. కాగా, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ, గుంటూరు తహసీల్దారుపై దాడి నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆర్థిక మంత్రి, సీఎం పేషీలోని ముఖ్య కార్యదర్శిని కలిసి చర్చించారు. -
భద్రాద్రి జీపీలో డిష్యుం..డిష్యుం
భద్రాచలం: భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్యాలయంలోని సిబ్బంది చూస్తుండగానే సర్పంచ్ భర్త వీరన్న ఈవో శ్రీమన్నారాయణపై దాడికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై సర్పంచ్ భర్త దాడి చేయటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. గురువారం నుంచి పంచాయతీ కార్యాలయ సిబ్బంది విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈవో శ్రీ మన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్పీవో కార్యాలయం లో సమావేశం నిమిత్తం వచ్చే క్రమంలో సర్పంచ్ అడిగిన వివరాలు ఇచ్చేందుకని ఈవో ఆమె చాంబర్లోకి వెళ్లారు. బయటకు వస్తుండగా సర్పంచ్ భర్త ఈవోపై దాడికి దిగాడు. సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఈవో కంటి అద్దాలు కిందపడి పగిలిపోయాయి. చేతికూడా గాయమైంది. ఇలా అయితే తాము ఉద్యోగం ఎలా చేయాలని ఈవో ఆవేదన వ్యక్తం చేశారు. జరి గిన విషయాన్ని డీఎల్పీవో ఆశాలత దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై జిల్లా పంచాయితీ అధికారికి కూడా ఫోన్లో వివరించారు. దీనిపై ఈవో శ్రీమన్నారాయణ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శ్వేత కూడా ఈవోపై స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిజన మహిళ అయిన తనపై ఈవో దుర్భాషలాడుతున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆ రోపించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ధర్నా పంచాయతీ ఈవోపై సర్పంచ్ భర్త దాడి చేయటాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిం చాయి. టీఎన్జీవోస్తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల వారు బుధవారం సాయంత్రం పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, ధర్నాలో పాల్గొన్నారు. ఈవోపై దాడి చేసిన సర్పంచ్ భర్తను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. పంచాయితీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయూనికి తాళాలు వేసి విధులను బహిష్కరించారు. గురువారం నుంచి నిరవధికంగా విధులు బహిష్కరిస్తున్నట్లు పంచాయతీ సిబ్బంది ప్రకటించారు. సీపీఎం, టీడీపీ, వైఎస్ఆర్సీపీలకు చెందిన నాయకులు కూడా ఈవోకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు. వివరాలు తెలుసుకున్న ఆర్డీవో పంచాయితీ కార్యాలయంలో జరిగిన ఘటనపై భద్రాచలం ఆర్డీవో అంజయ్య ఆరా తీశారు. ఈవో శ్రీమన్నారాయణ, సర్పంచ్ శ్వేతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవోను పిలుపించుకొని వివరాలు తెలుసుకున్నారు. అక్కడనే ఉన్న ఏఎస్పీ భాస్కరన్ కూడా దీనిపై తీవ్రంగానే స్పందించారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. వివాదానికి తెరపడేనా? భద్రాచలం మేజర్ పంచాయతీలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. పాలక మండలి సభ్యులంతా ఒకవైపు, సర్పంచ్ మరో వైపుగా పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. సర్పంచ్ భూక్యా శ్వేత కూడా ఇక్కడి అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో పలు కథనాలు వెలువడ్డారుు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఈవో, సర్పంచ్, వర్క్ ఇన్స్పెక్టర్, డీఎల్పీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ చెక్ పవర్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామాలే దాడుల వరకు దారి తీసినట్లు చర్చ సాగుతోంది. -
ముందుకా? మళ్లీ మొదటికా..?
ముంపు ఉద్యోగుల వివరాలు సేకరణ కలెక్టర్ ఆదేశాలతో మొదలైన బదిలీ ప్రక్రియ భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు మరో ముందడుగు పడింది. బదిలీల ప్రక్రియలో భాగంగా 7 మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎంతమంది తెలంగాణ స్థానికులు ఉన్నారనే దానిపై వివరాల సేకరణ కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆర్సీ నంబర్ ఏ1/1992/2014 పేరుతో ఈ నెల 21న ఉత్తర్వులను జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కలసిన భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), పశ్చిమగోదావరి జిల్లాలో కలసిన పాల్వం చ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గం పాడు మండలాల్లోని 6 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉద్యోగుల వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల స్థానికతను తెలుసుకునేందుకు ప్రత్యేక నమూనా కూడా ఉత్తర్వులతో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు పంపించారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తారో తెలిపే అవకాశాన్ని (ఆప్షన్) కూడా ఉద్యోగులకు కల్పించారు. తెలంగాణ స్థానికత ఉన్న వారంతా త్వరలోనే రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. తాజా ఉత్తర్వులతో బదిలీల ప్రక్రియకు మరో ముంద డుగు పడిందని ముంపు ఉద్యోగులు భావిస్తున్నా.. ఇది ఎప్పట్లోగా పూర్తవుతుందనే దానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాగా ఏపీలో విలీనమైన 7 మండలాల్లో ఐకేపీ ఉద్యోగుల బదిలీలు సోమవారం పూర్తి చేశారు. 75 మంది ఉద్యోగులకు 35 మంది ఆంధ్రలోనే ఉండిపోగా, 45 మందిని తెలంగాణకు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. -
ఉద్యోగుల హెల్త్‌కార్డులపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెల్త్‌కార్డులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు. కొంత మంది ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సచివాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. హెల్త్‌కార్డుల జాప్యానికి కారణాలు, ప్రభుత్వాసుపత్రులకు ప్యాకేజీలు ఏ విధంగా ఉన్నాయి, నగదు రహిత వైద్యానికి అర్హులు ఎంత మంది ఉన్నారు తదితర వివరాలు అడిగారు. విజయవాడలో ఏర్పాటు చేసే తాత్కాలిక కార్యాలయాలపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్లు పాల్గొన్నారు. -
15 నుంచి ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
ఉద్యోగ సంఘాల జేఏసీకి ఏపీ సీఎం చంద్రబాబు హామీ మిగతా డిమాండ్ల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్ కార్డుల పథకాన్ని ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను కలసిన ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. హెల్త్‌కార్డులు మినహా మిగతా వాటి పరిష్కారానికి వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తానని, సమస్యలన్నీ ఉపసంఘానికి చెప్పుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయింది. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖరరెడ్డి, కో-చైర్మన్లు కత్తి నరసింహారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, కమలాకరరావు, ఉపాధ్యక్షులు రాయుడు అప్పారావు, బండి శ్రీనివాసరావు, మహిళా నేతలు రత్న, తులసీరత్నం తదితరులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని సమావేశానికి హాజరయ్యారు -
ఉద్యోగుల ‘సమైక్య’ సమ్మె
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఒకటి, రెండు రోజుల తేడాతో జేఏసీలో భాగస్వామ్యం కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి సమ్మె పార్లమెంట్ సమావేశాలు జరగనున్న రోజులు మాత్రమే కొనసాగనుంది. పరీక్షలు ముంచుకొస్తుండటంతో ఉపాధ్యాయులు సమ్మెలో పాల్పంచుకోవడం అనుమానమని తెలుస్తోంది. టెజరీ, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టు 13వ తేదీ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మికులు 66 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుతం విభజన బిల్లు పార్లెమెంటులోకి ప్రవేశించనున్న నేపథ్యంలో బిల్లును అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు మళ్లీ సమ్మె చేసేందుకు నిర్ణయించాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి పెంచి విభజన బిల్లును అడ్డుకునేలా చూడాలనేది ఉద్యోగ సంఘాల ఉద్దేశం. సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పాలనను స్తంభింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 6వ తేదీ నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేల పరీక్ష జరిపితే విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్నికల విధులను సైతం బహిష్కరించాలని నిర్ణయించడం గమనార్హం. -
అదే హోరు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఒకవైపు దసరా పండగ.. మరోవైపు పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించినా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, విద్యార్థి సంఘాలు శనివారం సమైక్య నినాదాన్ని మారుమ్రోగించాయి. కర్నూలులో న్యాయవాదులు,వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు. జిల్లా పరిషత్, సంక్షేమభవన్ కార్యాలయాల్లో ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న శిబిరాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. ఆలూరులో సమైక్యంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుల చిత్రపటాలను దహనం చేశారు. ఆదోని పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాష్ర్ట విభజన ద్రోహుల చిత్రపటాలకు మసిపూసి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే వారి రాజకీయ భవిష్యత్తు మసిబారుతుందని హెచ్చరించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ హైస్కూల్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. మిల్టన్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా 60వ రోజున 15 మంది వైద్య, ఆర్యోగశాఖ ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగే డీఏ 8.56 శాతం!
జాప్యం చేయకుండా పెంచాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 10 శాతం మేరకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థానిక సూత్రీకరణ ప్రకారం కరువు భత్యం 8.56 శాతం మేరకు పెరగనుంది. ఈ పెంపును గత జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు రూపొందించిన అనంతరం దానికి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపితే ఈ పెంపు అమల్లోకి వస్తుంది. అయితే గత కొన్ని దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిన విషయాన్ని గుర్తించి.. కరువు భత్యం పెంపు నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.56 శాతం పెంచితే.. వారి డీఏ మొత్తం 63.34 శాతానికి చేరుకున్నట్టవుతుంది.