15 నుంచి ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
ఉద్యోగ సంఘాల జేఏసీకి ఏపీ సీఎం చంద్రబాబు హామీ
మిగతా డిమాండ్ల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్ కార్డుల పథకాన్ని ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను కలసిన ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. హెల్త్‌కార్డులు మినహా మిగతా వాటి పరిష్కారానికి వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తానని, సమస్యలన్నీ ఉపసంఘానికి చెప్పుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయింది.
జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖరరెడ్డి, కో-చైర్మన్లు కత్తి నరసింహారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, కమలాకరరావు, ఉపాధ్యక్షులు రాయుడు అప్పారావు, బండి శ్రీనివాసరావు, మహిళా నేతలు రత్న, తులసీరత్నం తదితరులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని సమావేశానికి హాజరయ్యారు