భద్రాచలం: భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్యాలయంలోని సిబ్బంది చూస్తుండగానే సర్పంచ్ భర్త వీరన్న ఈవో శ్రీమన్నారాయణపై దాడికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై సర్పంచ్ భర్త దాడి చేయటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. గురువారం నుంచి పంచాయతీ కార్యాలయ సిబ్బంది విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈవో శ్రీ మన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్‌పీవో కార్యాలయం లో సమావేశం నిమిత్తం వచ్చే క్రమంలో సర్పంచ్ అడిగిన వివరాలు ఇచ్చేందుకని ఈవో ఆమె చాంబర్‌లోకి వెళ్లారు.
బయటకు వస్తుండగా సర్పంచ్ భర్త ఈవోపై దాడికి దిగాడు. సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఈవో కంటి అద్దాలు కిందపడి పగిలిపోయాయి. చేతికూడా గాయమైంది. ఇలా అయితే తాము ఉద్యోగం ఎలా చేయాలని ఈవో ఆవేదన వ్యక్తం చేశారు. జరి గిన విషయాన్ని డీఎల్‌పీవో ఆశాలత దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై జిల్లా పంచాయితీ అధికారికి కూడా ఫోన్‌లో వివరించారు. దీనిపై ఈవో శ్రీమన్నారాయణ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శ్వేత కూడా ఈవోపై స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గిరిజన మహిళ అయిన తనపై ఈవో దుర్భాషలాడుతున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆ రోపించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ధర్నా
పంచాయతీ ఈవోపై సర్పంచ్ భర్త దాడి చేయటాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిం చాయి. టీఎన్‌జీవోస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల వారు బుధవారం సాయంత్రం పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, ధర్నాలో పాల్గొన్నారు. ఈవోపై దాడి చేసిన సర్పంచ్ భర్తను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. పంచాయితీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయూనికి తాళాలు వేసి విధులను బహిష్కరించారు. గురువారం నుంచి నిరవధికంగా విధులు బహిష్కరిస్తున్నట్లు పంచాయతీ సిబ్బంది ప్రకటించారు. సీపీఎం, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు చెందిన నాయకులు కూడా ఈవోకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు.
వివరాలు తెలుసుకున్న ఆర్‌డీవో
పంచాయితీ కార్యాలయంలో జరిగిన ఘటనపై భద్రాచలం ఆర్‌డీవో అంజయ్య ఆరా తీశారు. ఈవో శ్రీమన్నారాయణ, సర్పంచ్ శ్వేతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవోను పిలుపించుకొని వివరాలు తెలుసుకున్నారు. అక్కడనే ఉన్న ఏఎస్పీ భాస్కరన్ కూడా దీనిపై తీవ్రంగానే స్పందించారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
వివాదానికి తెరపడేనా?
భద్రాచలం మేజర్ పంచాయతీలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. పాలక మండలి సభ్యులంతా ఒకవైపు, సర్పంచ్ మరో వైపుగా పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. సర్పంచ్ భూక్యా శ్వేత కూడా ఇక్కడి అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో పలు కథనాలు వెలువడ్డారుు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఈవో, సర్పంచ్, వర్క్ ఇన్‌స్పెక్టర్, డీఎల్పీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ చెక్ పవర్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామాలే దాడుల వరకు దారి తీసినట్లు చర్చ సాగుతోంది.
భద్రాద్రి జీపీలో డిష్యుం..డిష్యుం
Published Thu, Mar 12 2015 3:56 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement