కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్‌జీఓ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఒకటి, రెండు రోజుల తేడాతో జేఏసీలో భాగస్వామ్యం కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి సమ్మె పార్లమెంట్ సమావేశాలు జరగనున్న రోజులు మాత్రమే కొనసాగనుంది. పరీక్షలు ముంచుకొస్తుండటంతో ఉపాధ్యాయులు సమ్మెలో పాల్పంచుకోవడం అనుమానమని తెలుస్తోంది.
టెజరీ, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టు 13వ తేదీ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మికులు 66 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుతం విభజన బిల్లు పార్లెమెంటులోకి ప్రవేశించనున్న నేపథ్యంలో బిల్లును అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలు మళ్లీ సమ్మె చేసేందుకు నిర్ణయించాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి పెంచి విభజన బిల్లును అడ్డుకునేలా చూడాలనేది ఉద్యోగ సంఘాల ఉద్దేశం. సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పాలనను స్తంభింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 6వ తేదీ నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేల పరీక్ష జరిపితే విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్నికల విధులను సైతం బహిష్కరించాలని నిర్ణయించడం గమనార్హం.
ఉద్యోగుల ‘సమైక్య’ సమ్మె
Published Thu, Feb 6 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement