కర్నూలు(అగ్రికల్చర్) : రెవెన్యూలో భారీ బదిలీలకు తెరలేసింది. సుమారు 40 మంది తహశీల్దార్లు, 50 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 500 మంది వీఆర్వోలతో పాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు బదిలీ తప్పదని తెలుస్తోంది. మరో రెండేళ్ల వరకూ బదిలీలకు అవకాశం లేకపోవడంతో ఇంత పెద్ద ఎత్తున బదిలీలకు అధికారులు భారీ కసరత్తు చేపట్టినట్లు సమాచారం. బదిలీల ప్రక్రియ కాస్తా వేడెక్కడంతో శనివారం ఉదయం నుంచే కలెక్టరేట్‌లో రెవెన్యూ ఉద్యోగుల కోలాహలం మొదలయింది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ విభాగంలోని 1,203 మంది ఉద్యోగుల్లో ఏకంగా 740 మంది బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
మొత్తం 69 మంది తహశీల్దార్లు ఉండగా.. 40 నుంచి 50 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. రెవెన్యూలో అత్యంత కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలపైనా కలెక్టర్ దృష్టి సారించారు. వీఆర్వోలు సొంత డివిజన్లలో పని చేయరాదని, వీరిని ఇతర డివిజన్లకు బదిలీ చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాలో 792 వీఆర్వో పోస్టులు ఉండగా.. ఇందులో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సొంత డివిజన్లలో పని చేయరాదనే నిబంధనను అమలు చేస్తే మిగిలిన 742 మందిలో 600 మందికి బదిలీ తప్పని పరిస్థితి. ఒకేచోట ఐదేళ్లకు మించి పనిచేస్తున్న వీఆర్వోలు 250 మందికి పైగా ఉన్నారు.
మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న వారు 400 పైమాటే. అంతేకాకుండా పలువురు వీఆర్వోలపై అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈ ప్రకారం చూసినా కనీసం 500 మంది వీఆర్వోలు బదిలీ అయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ తహశీల్దార్లు 127మంది ఉండగా.. వీరిలో 50 మంది వరకు బదిలీ కానున్నట్లు సమాచారం. సీనియర్ అసిస్టెంట్లు 161 మంది ఉండగా.. దాదాపు 100 మంది వరకు బదిలీ కావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జూనియర్ అసిస్టెంట్‌లు 104 మంది ఉండగా.. 50 మందికి పైగా బదిలీ కావచ్చని తెలుస్తోంది.
మొత్తం మీద రెవెన్యూ విభాగంలో తహశీల్దార్లతో పాటు డీటీలు, వీఆర్వోలు.. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఏకంగా 1,203 మంది ఉండగా, ఇందులో 700 బదిలీ అయ్యే అవకాశం ఉంది. బదిలీల నేపథ్యంలో ఉద్యోగుల మొత్తం వివరాలు.. అంటే ఉద్యోగంలో చేరిన తేదీ, పుట్టిన తేదీ, ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారనే సమాచారం ఉద్యోగ సంఘాలకు కలెక్టర్ ఇప్పటికే అందజేశారు. ఇందులో తప్పులుంటే తమ దృష్టికి ఆదివారం సాయంత్రంలోగా తేవాలని ఆయన సూచించారు.
కలెక్టరేట్‌లో కోలాహలం
బదిలీల నేపథ్యంలో ఉదయం నుంచే కలెక్టరేట్‌లో కోలాహలం మొదలయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్‌కు చేరుకుని బదిలీల ప్రక్రియపై రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. ఆదివారం రాత్రికే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొలిక్కి వస్తుందని భావించి ఉదయం నుంచే ఇక్కడే తిష్టవేసి ఆరా తీయడం కనిపించింది. అయితే, బదిలీలపై ఆదేశాలు సోమ లేదా మంగళవారం వెలువడతాయనడంతో బదిలీల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలారు. ప్రధానంగా అధికార పార్టీ నేతల నుంచి కలెక్టర్‌కు సిఫారసు చేయించుకునే పనిలో తలమునకలయ్యారు.
ఎవరెక్కడికో!
Published Sun, Sep 13 2015 4:58 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement
Advertisement