రిజిస్ట్రేషన్ జిల్లాల విభజన కొలిక్కి
స్వల్ప మార్పులతో ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రెవెన్యూ జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ల జిల్లాల సంఖ్యను కూడా పెంచాలని సర్కారు తొలుత భావించినా.. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆ ప్రతిపాదనను విరమించుకుంది. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ల జిల్లాల సంఖ్య యథాతథంగా ఉం చినప్పటికీ.. ఆయా రిజిస్ట్రేషన్ల జిల్లాల పరి ధులు, పేర్లు, జిల్లా కేంద్రాల్లో కొద్దిపాటి మార్పులు చేసింది. ఈమేరకు రెవెన్యూ(రిజిస్ట్రేషన్ల) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
ఇవీ మార్పులు..
ప్రస్తుతం రంగారెడ్డి ఈస్ట్ పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్ జిల్లాను మేడ్చల్-మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాగా మార్చింది. గతంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆ జిల్లాలను రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్ జిల్లాలుగా విభజించింది. అయితే ప్రతిపాదిత శంషాబాద్ జిల్లా పేరును రంగారెడ్డి జిల్లాగా ప్రభుత్వం మార్చడంతో.. రంగారెడ్డి ఈస్ట్ జిల్లాను అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భావించారు.
పాత రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ప్రత్యేక రిజిస్ట్రేషన్ జిల్లాగా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ రెవెన్యూ జిల్లాలను కలుపుతూ మరో రిజిస్ట్రేషన్ జిల్లా ఏర్పాటు చేయాలన్న కమిషనర్ అండ్‌ఐజీ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే పాత మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాగా ఏర్పడినప్పటికీ మెదక్ రిజిస్ట్రేషన్ జిల్లాను సంగారెడ్డి కేంద్రంగానే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం సొసైటీల రిజిస్ట్రేషన్లపై జిల్లా రిజిస్ట్రార్లకు అధికారాలు కల్పిస్తూ మరో ఉత్తర్వునిచ్చింది. కమిషనర్ ప్రతిపాదనల మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్,అదనపు రిజిస్ట్రార్,జాయింట్ రిజి స్ట్రార్,డిప్యూటీ రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ నియామకాలకు అంగీకారం తెలుపుతూ మరో ఉత్తర్వు ఇచ్చింది.