రిజిస్ట్రేషన్లపై ‘పెద్ద నోట్ల’ ముద్ర..
♦ అక్టోబర్ వరకు రికార్డు స్థాయిలో 40 శాతం పెరుగుదల
♦ పెద్దనోట్ల రద్దు తర్వాత ఆదాయంలో క్షీణత
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రిజిస్ట్రేషన్ల, స్టాంపుల శాఖ కుదేలవుతోంది. రెండునెలలుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు తిరోగమన దిశలో కొనసాగుతోంది. గతేడాది కన్నా 30 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూ.4,291 కోట్ల టార్గెట్‌ను రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం విధించింది. అయితే.. అక్టోబర్ వరకు రికార్డుస్థాయిలో 40 శాతం ఆదాయ వృద్ధి కనిపించింది. నవంబర్ ప్రథమార్థంలో కొన్ని రోజులపాటు పాతనోట్లతో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించేందుకు కేంద్రం అనుమతించిన కారణంగా ఆ నెల ఆదాయంలో గతేడాది కన్నా 12 శాతం పెరుగుదల నమోదైంది. పాతనోట్లతో చెల్లింపులకు కేంద్రం స్వస్తి పలకడంతో డిసెంబర్‌లో ఆదాయం భారీగా తగ్గింది. మరో మూడు నెలలు ఇదే తీరు కొనసాగే అవకాశం ఉన్నందున వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.
గత మూడేళ్లుగా భూముల మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించకపో వడం కూడా ఆస్తుల క్రయవిక్రయాలపై ప్రభావం చూపుతోం ది. వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి విలువ ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ వాల్యూ గరిష్టంగా రూ.20 లక్షలకు మించి ఉండడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల ప్రకారం ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే కొనుగోలు చేసిన వ్యక్తి సదరు ఆస్తి విలువలో ఆరు శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. మరోవైపు రూ.20 వేలకు మించి చెల్లింపులన్నీ క్యాష్‌లెస్ లావాదేవీలతోనే చేయాలని కేంద్రం పేర్కొంటుండడంతో, ఇప్పటివరకు ఆదాయపు పన్ను పరిధి లోకి రానివారంతా తమ వద్ద ఉన్న అన్‌అకౌంటెడ్ సొమ్మును మార్చుకునేందుకు వీలుకావడం లేదు.
మరోవైపు అన్‌అకౌం టెడ్ సొమ్ము తీసుకుంటే, దాన్ని వైట్‌మనీగా మార్చుకో వడంలో ఇబ్బందులు వస్తాయేమోనని విక్రయదారులు కూడా ఆస్తులను అమ్మేందుకు సందేహిస్తున్నారు. మార్కెట్ విలువను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును ప్రస్తుతం ఉన్న ఆరు శాతం నుంచి రెండు శాతానికి తగ్గిస్తే కొనుగోలుదారులకు ఉపశమనంతోపాటు రిజిస్ట్రేసన్ల శాఖకు ఆదాయం సమకూరుతుందని సూచిస్తున్నారు. త్వరలోనే భూముల మార్కెట్ విలువలను పెంచడం, రిజిస్ట్రేషన్ల ఫీజును తగ్గించడంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.