ప్రతి అకౌంట్ సమాచారం ఐటీ గుప్పిట్లో ఉందని.. పన్ను ఎగవేతదారులు తప్పిం చుకోలేరని ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ శ్యామ్ ప్రసాద్ చౌదరి పేర్కొన్నారు.
ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్ శ్యామ్‌ప్రసాద్ చౌదరి
తిరుపతి రూరల్ (తిరుపతి): ప్రతి అకౌంట్ సమాచారం ఐటీ గుప్పిట్లో ఉందని.. పన్ను ఎగవేతదారులు తప్పిం చుకోలేరని ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ శ్యామ్ ప్రసాద్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి లోని ఓ ప్రైవేటు హోటల్లో వ్యాపారులు, పన్ను చెల్లింపు దారులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ వద్ద అనధికారికంగా ఉన్న పెద్ద నోట్లను మార్చి 31 వరకు డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం పీఎంజీకేవై పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఇందులో 50 శాతం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుందని, మరో 25% వెంటనే వెనక్కు ఇస్తుందని, మిగిలిన 25% నాలుగేళ్ల తర్వాత డిపాజిట్ రూపంలో అందిస్తుందని తెలిపారు. ఈ పథకంలో చూపే అనధికారిక నగదుపై ఎలాంటి విచారణలు ఉండవన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత దాడుల్లో పట్టుపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సదస్సులో తిరుపతి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జగదీశ్‌బాబు, కమిషనర్ (విచారణ) దేవరత్నకుమార్, జాయింట్ కమిషనర్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.