రిజిస్ట్రేషన్ల శాఖకు ‘కొత్త’ గందరగోళం!
- ఆదాయం లేకున్నా కొత్త జిల్లాలకు విభాగాలు ఎందుకంటున్న అధికారులు
- ఆదాయం, పనిభారమే కొలమానమంటున్న రిజిస్ట్రేషన్ల చట్టం
- ఆడిట్ రిజిస్ట్రార్లను తొలగించవద్దని సర్కారుకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ రిజిస్ట్రేషన్ల శాఖను గందరగోళంలో పడేసింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 10 జిల్లాలను 27 జిల్లాలుగా విభజిస్తున్న విషయం తెలిసిందే. ఇది పాలనాపరంగా, భౌగోళికంగా ప్రజలకు సౌలభ్యమే అయినా.. రిజిస్ట్రేషన్ జిల్లాల విభజన మాత్రం ఆదాయపరంగా ఆమోదయోగ్యం కాదని ఆ శాఖ యంత్రాంగం చెబుతోంది. కొత్తగా ప్రతిపాదించిన కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఆదాయం చాలా స్వల్పమని.. అటువంటి చోట ప్రత్యేకంగా జిల్లా శాఖను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం తలకు మించిన భారమని స్పష్టం చేస్తోంది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య, రిజిస్ట్రేషన్ల శాఖలను పాలనాపరమైన జిల్లాలతో ముడిపెట్టకుండా.. ప్రత్యేకంగా చూడాలని అధికారులు పేర్కొంటున్నారు.
జీతాల వ్యయమూ రాదు!
వాస్తవానికి పాలనాపరమైన జిల్లాలు, రిజిస్ట్రేషన్ల జిల్లాలు ఒకేలా ఉండాల్సిన పనిలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వస్తే... ఆయా జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం, పనిభారాన్నే (రిజిస్ట్రేషన్లు) కొలమానంగా తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల చట్టం చెబుతోంది. కానీ పాలనా సౌలభ్యం కోసం ప్రతిపాదించిన జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ల జిల్లాలను విభజించాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. ఆ శాఖ ఉన్నతాధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రతిపాదిత 27 జిల్లాల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిల్లాలు మినహా మిగతా జిల్లాలను రిజిస్ట్రేషన్ జిల్లాలుగా ఏర్పాటు చేయడం ఆమోద యోగ్యం కాదని ఇటీవలి సమీక్షలో జిల్లా రిజిస్ట్రార్లు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు.
‘జయశంకర్’ ఆదాయం నెలకు 11 లక్షలే!
జయశంకర్ జిల్లాలో ఏడాది మొత్తానికి కలిపి రిజిస్ట్రేషన్ల సంఖ్య 1,700కు మించదని రిజిస్ట్రేషన్ల శాఖ పరిశీలనలో తేలింది. ఈ కొత్త జిల్లా పరిధిలో ఒకే సబ్ రిజిస్ట్రార్(ములుగు) కార్యాలయం ఉంది. జిల్లా విభాగం ఏర్పాటు చేస్తే.. దీని నుంచి నెల నెలా వచ్చే ఆదాయం (సుమారు రూ.11లక్షలు) ఉద్యోగుల వేతనాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు.
ఆడిట్ రిజిస్ట్రార్ లేకుంటే అంతే!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే సాధారణ, వివాహ రిజిస్ట్రేషన్లు, స్టాంపులు అమ్మకం, విదేశాల్లో ఉండే వారికి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ.. తదితర అంశాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఆడిట్ రిజిస్ట్రార్లు ఉన్నారు. అయితే జిల్లాల సంఖ్య పెరుగుతున్నందున ఆడిట్ రిజిస్ట్రార్ పోస్టులను తొలగించి.. వారిని జిల్లా రిజిస్ట్రార్లుగా పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే సరిగా ఆడిట్ జరగక అక్రమాలు పెరిగిపోయే అవకాశముంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.