⇒ ఫెసిలిటీ మేనేజర్ ఏర్పాటుపై ఆర్నెల్లుగా తాత్సారం
⇒ తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఏటా రూ. 4 వేలకోట్ల ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఆరు నెలలుగా ఫెసిలిటీ మేనేజర్ (ఎఫ్‌ఎం) నియామకం అంతుచిక్కని ప్రశ్నగా తయారైంది. గతంలో ప్రభుత్వం ఎఫ్‌ఎంగా నియమించిన టీసీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టు 18న ముగిసింది. గత ఆరు నెలలుగా కొత్త ఫెసిలిటీ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించకపోవడంతో క్షేత్రస్థాయిలో సాంకేతిక వ్యవస్థలన్నీ బంద్ అయ్యాయి. కాంట్రాక్ట్ గడువు ముగిసినందున రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ సర్వీస్ ఇంజనీర్లను టీసీఎస్ వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆన్‌లైన్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
కమిటీల ఏర్పాటుతోనే కాలయాపన: ఎఫ్‌ఎం నియామకానికి ఫైలును సిద్ధం చేసిన అధికారులు గత సెప్టెంబర్‌లో ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించారు. రిజిస్ట్రేసన్ల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, ఎఫ్‌ఎం నియామక ప్రక్రియ నిమిత్తం సెప్టెంబర్ 24న ఒక కమిటీని వేసి మిన్నకుండి పోయింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సబ్ రిజిస్ట్రార్ల నుంచి, రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే వినియోగదారుల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఎఫ్‌ఎం నియామక ప్రక్రియను త్వరితగతిన ముగించేందుకని గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన అంతర్ విభాగాల కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఐటీ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌ను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
సర్వర్ సమస్యలతో ఎన్నో వెతలు: గత ఆరు నెలలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిరంతరం సర్వర్ డౌన్ అవుతుండటం, నెట్‌వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కేవలం పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్ డౌన్, నెట్‌వర్క్ సమస్యల కారణంగా గంటల కొద్దీ సమయం తీసుకుంటోంది. సమస్యలను పరిష్కరించేందుకు సర్వీస్ ఇంజనీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఫెసిలిటీ మేనేజర్ నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
‘రిజిస్ట్రేషన్ల’ ఎఫ్‌ఎం నియామకం ఎప్పుడు?
Published Wed, Mar 8 2017 5:17 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement