స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతికంగా మెరుగుపడింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నది. పనిని సులభతరం చేసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు, నెట్‌వర్క్ సమస్యలతో సతమతమయ్యే ఈ శాఖలో గత ఏడాది కాలంగా అవరోధాలు లేకుండా అమలవుతున్న సేవలు ఆదాయాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా 2017 చివర్లో రెయిల్‌టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధికి కారణమవుతున్నాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
– సాక్షి, హైదరాబాద్
సొంత నెట్‌వర్క్.. ఆ తర్వాత అప్‌గ్రేడ్
తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌తోనే కలసి రిజిస్ట్రేషన్ల నెట్‌వర్క్ ఉండేది. స్టేట్‌వైడ్ ఏరియా నెట్‌వర్క్(స్వాన్) పేరుతో ఉండే దీని ద్వారానే తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ లావాదేవీలు జరిగేవి. దీంతో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ బిజీ ఏర్పడి తరచూ సేవలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సొంతంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా 2 ఎంబీపీఎస్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్‌ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని కోసం ఏటా రూ.1.2 కోట్లను ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తోంది. రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతోపాటు స్కానర్లు, ప్రింటర్లు, బయో మెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిస్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రతి 5 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త పరికరాలు, రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న 7 వేల టెరాబైట్ల సామర్థ్యం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నెట్‌వర్క్, సెంట్రల్ సర్వర్‌ల ఏర్పాటుతో లావాదేవీల్లో వేగం పెరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్‌లోడ్, డాటా ఎంట్రీ, ఫోటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీ సమయాన్ని పావుగంట వరకు తగ్గించగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘గతంలో సర్వర్లలలో సాంకేతికంగా అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఒక్కోసారి 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండటం లేదు.’అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ఏడాది గణనీయంగా లావాదేవీలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం లావాదేవీలు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో మొత్తం 11,36,372 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 15,12,468 లావాదేవీలు జరగడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2017–18 మార్చిలో1,16,928 క్రయవిక్రయ లావాదేవీలు జరిగితే 2018–19 మార్చిలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కన్నా 41 శాతం ఎక్కువని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 37% కన్నా ఎక్కువ సంఖ్యలో లావాదేవీల వృద్ధి కనిపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment