Stamps Department
-
2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
కమలాపురం : అక్టోబర్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని 1,949 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ బి.శివరాం తెలిపారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలోని సబ్ రెజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేశామన్నారు. ఆయా సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు నెట్ వర్క్, స్కానింగ్, వెబ్‌క్యామ్‌లతో పాటు రిజిస్ట్రేషన్లు, సెటిల్ మెంట్లు, పార్టీషియన్లు ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో ఏ గ్రామానికి చెందిన వారు అదే గ్రామంలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పొందవచ్చన్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ జారీ, ఈసీల జారీ తదితర సేవలు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం సంబటూరు, జంభాపురం గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ చెన్నకేశవరెడ్డి, సబ్ రెజిస్ట్రార్ డీఎం బాషా పాల్గొన్నారు. -
ఏపీలో పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా వచ్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతం కంటే ఈ ఏడాది 30 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయానికి రూ.4,210 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.5,495 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల ఆదాయం ఇంకా పెరిగే అవకాశముంది. డిసెంబర్లో అత్యధికంగా రూ.685 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో రూ.600 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం లభించింది. కరోనా కారణంగా మేలో రూ.211 కోట్ల ఆదాయం వచ్చింది. విశాఖలో అత్యధికం.. శ్రీకాకుళంలో అత్యల్పం ► విశాఖ జిల్లా నుంచి అత్యధికంగా రూ.825 కోట్ల ఆదాయం వచ్చింది. ► ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రూ.687.66 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.687.65 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.602 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ► అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో రూ.139 కోట్ల ఆదాయం వచ్చింది. ► విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.227 కోట్లు, రూ.480 కోట్లు, రూ.289 కోట్లు, రూ.314 కోట్ల ఆదాయం లభించింది. ► రాయలసీమలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ.367.56 కోట్ల ఆదాయం రాగా, చిత్తూరులో రూ.333 కోట్లు, వైఎస్సార్ కడపలో రూ.236 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.296.99 కోట్ల ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్ల సంఖ్యలో గుంటూరు టాప్ ఇక గతేడాది 17,20,402 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 17,46,682 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రాబోయే రెండు నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1.95 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కృష్ణాలో 1.71 లక్షలు, తూర్పు గోదావరిలో 1.80 లక్షలు, కర్నూలులో 1.59 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.51 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అతి తక్కువగా విజయనగరంలో 64 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 67 వేల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. గతం కంటే మెరుగైన ఆదాయం లభించింది. ఆదాయానికి గండిపడుతున్న కొన్ని అంశాల్లో కొద్దిపాటి మార్పులు చేయడంద్వారా ఫలితాలు సాధించామని.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు సత్వరం అందించేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. -
అక్రమ లేఅవుట్లు రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు, డిస్మిస్‌కూ వెనుకాడం
సాక్షి, అమరావతి: అనధికారిక లే అవుట్లను రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతిచ్చిన లే అవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్టర్ చేయాలని తెలిపారు. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం రిజిస్టర్ చేయకూడదనే నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలులో ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు. డీఐజీలు తమ జిల్లాల్లో లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతి నెలా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ లే అవుట్లను రిజిష్టర్ చేయడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల కొన్నిచోట్ల ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భూముల రీసర్వేపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో సభ్యులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక లేఅవుట్లపై సీరియస్‌గా స్పందించారు. మున్సిపల్ శాఖాధికారులు ఈ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. -
స్టాంపులు దొరకట్లేదు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు కొరత ఏర్పడింది. రూ. 50, 100 విలువైన స్టాంపులు చాలా చోట్ల దొరకడంలేదు. దీనివల్ల స్థిరాస్తుల కొనుగోలు ఒప్పందాలు, ఎంవోయూలు, వివిధ ధ్రువీకరణ, అఫిడవిట్లు, నోటరీలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొరతవల్ల బైట ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ స్టాంపులు తెచ్చుకోవాలని, అయితే ఆ సంస్థకు గత సర్కారు రూ. 17 కోట్ల బకాయి పడినందున సమస్య ఏర్పడిందని సమాచారం. పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ సంస్థకు బకాయిలు విడుదల చేయడంతోపాటు రూ. 115 కోట్లకు స్టాంపులకు ఇండెంట్ పంపించారు. ప్రత్యామ్నాయ మార్గాలున్నా.... గతంలో స్థిరాస్తుల కొనుగోలు, తనఖా ఒప్పందాలకు ఎంత రుసుమైతే అంత చెల్లించి స్టాంపులు కొనుగోలు చేసి దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కాలక్రమంలో స్టాంపుల బదులు ఆన్‌లైన్‌లోనూ, బ్యాంకుల్లో చలానా రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించి రూ. 100ల స్టాంప్ పేపర్‌పై దస్తావేజు (మొదటి పేజీ) రాయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫీజు మొత్తం చెల్లించి తెల్లకాగితాలపై ఫ్రాంక్లిన్ మిషన్‌తో ముద్రలు కూడా వేయించుకోవచ్చు. అయితే స్టాంపు పేపర్లపై దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికే చట్టబద్ధత, భద్రత ఉంటుందనే అపోహ ప్రజల్లో ఉంది. దాంతో ఎక్కువ మంది రూ. 100ల స్టాంప్ పేపర్‌పైనే దస్తావేజులు రాయించుకుంటున్నారు. దాంతో వీటికి డిమాండ్ ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు : ఐజీ స్టాంపుల కొరత లేకపోయినా ఉన్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. ఎక్కడో కొన్ని సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కొరత ఉంటే జిల్లాలోని ఇతర ఆఫీసుల నుంచి పంపించే ఏర్పాటు చేశామని, ఎక్కడా కొరత లేకుండా సర్దుబాటు చేయాలని డీఐజీలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ’సాక్షి’కి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రకాల స్టాంపులు మొత్తం 2.08 కోట్లు ఉన్నాయని, వీటి విలువ రూ. 56.50 కోట్లని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పని ఈజీ.. ఆదాయం డబుల్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతికంగా మెరుగుపడింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నది. పనిని సులభతరం చేసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు, నెట్వర్క్ సమస్యలతో సతమతమయ్యే ఈ శాఖలో గత ఏడాది కాలంగా అవరోధాలు లేకుండా అమలవుతున్న సేవలు ఆదాయాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా 2017 చివర్లో రెయిల్‌టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధికి కారణమవుతున్నాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ సొంత నెట్వర్క్.. ఆ తర్వాత అప్‌గ్రేడ్ తెలంగాణ ఏర్పాటైన మూడేళ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్తోనే కలసి రిజిస్ట్రేషన్ల నెట్వర్క్ ఉండేది. స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్(స్వాన్) పేరుతో ఉండే దీని ద్వారానే తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ లావాదేవీలు జరిగేవి. దీంతో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ బిజీ ఏర్పడి తరచూ సేవలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ ద్వారా 2 ఎంబీపీఎస్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీని కోసం ఏటా రూ.1.2 కోట్లను ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తోంది. రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతోపాటు స్కానర్లు, ప్రింటర్లు, బయో మెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిస్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి 5 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త పరికరాలు, రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న 7 వేల టెరాబైట్ల సామర్థ్యం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నెట్వర్క్, సెంట్రల్ సర్వర్ల ఏర్పాటుతో లావాదేవీల్లో వేగం పెరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్లోడ్, డాటా ఎంట్రీ, ఫోటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీ సమయాన్ని పావుగంట వరకు తగ్గించగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘గతంలో సర్వర్లలలో సాంకేతికంగా అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఒక్కోసారి 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండటం లేదు.’అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది గణనీయంగా లావాదేవీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం లావాదేవీలు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12 రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో మొత్తం 11,36,372 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 15,12,468 లావాదేవీలు జరగడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2017–18 మార్చిలో1,16,928 క్రయవిక్రయ లావాదేవీలు జరిగితే 2018–19 మార్చిలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కన్నా 41 శాతం ఎక్కువని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 37% కన్నా ఎక్కువ సంఖ్యలో లావాదేవీల వృద్ధి కనిపించడం గమనార్హం. -
అవినీతి ముద్ర
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి వేళ్లూనుకుంటోంది. రిజిస్ట్రేషన్ మొదలుకొని ఏం కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఈసీలు, సీసీలు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉన్నా ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. చుక్కలు, చిక్కులున్న సెటిల్మెంట్ భూములు, దేవాదాయ, డీకేటీ భూములే లక్ష్యంగా దళారుల చేతివాటంతో తప్పుడు రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖకు రెవెన్యూ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనే ఆరోపణలున్నాయి. చిత్తూరు, సాక్షి: జిల్లాలో తిరుపతి, చిత్తూరుల్లో జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. ఇవి కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 25 ఉన్నాయి. వీటిలో ఎక్కువ అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి మూల విలువపై 6.5 స్టాంపు సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో ఈ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు పెరుగుతున్నాయి. అత్యవసరమైతేæ అడిగినంత ఇస్తేనే పనులవుతాయనే వాదన ప్రజల్లో నాటుకుపోయింది. ఈ కార్యాలయాల నుంచి ఈసీ లు, ఆర్‌హెచ్ నకళ్లు పొందడం పెద్ద సమస్యగా మారుతోంది. చుక్కల భూముల వ్యవహారాన్ని చక్కదిద్దే క్రమంలో రెవెన్యూ అధికారులు మేన్యువల్ ఈసీలు, హక్కు ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా చేశారు. ఇది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సిబ్బందికి అవకాశంగా మారింది. మేన్యువల్ ఈసీ, ఆర్‌హెచ్ నకలు తీసుకోవాలంటే కనీసం రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలతో కూడిన వ్యవహారం కావడంతో సకాలంలో రైతులకు ఈసీలు, ఆర్హెచ్లు సమకూర్చలేకపోతున్నారు. ఈసీకి రూ.520, ఆర్‌హెచ్ కాపీకి రూ.220 వరకు కలిపి వసూలు చేయాల్సి ఉండగా అవసరాల నేపథ్యంలో అడిగినంత ముట్టజె బుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రార్ కుమ్మక్కు పాకాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని పాకాల, పెనుమూరు మండలాల్లో దేవాదాయ, డీకేటీ, సెటిల్మెంట్ భూములు యజమానుల ప్రమేయం లేకుం డానే 1బీ ఆధారంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. దీనికి అధికారపార్టీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల్లో చుక్కలు, డీకేటీ భూములను గుర్తించి రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లకు 1 బీ, అడంగల్‌లో నమోదు చేస్తున్నారు. పత్రాలు లేకుండానే కేవలం 1బీ ఆధారంగానే ఇతరులకు విక్రయ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పెనుమూరు మండలం గుడ్యానంపల్లిలో అధికార పార్టీ నాయకుడు జయరామిరెడ్డి 70 ఎకరాలు డీకేటీ భూమిని బినామీ పేర్లతో ఆక్రమించుకున్నాడు. ఆన్లైన్ చేసుకున్నాడు. జెట్టిగుండ్లపల్లిలో కుంటస్థలాన్ని టీడీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పేరుతో 1బీలో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సరైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో భూ యజమానులు వారి భూములపై పట్టు కోల్పోతున్నారు. ఆఖరుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చిట్ల కంపెనీలతో కుమ్మక్కు.. రిజిస్ట్రేషన్ అధికారులు ప్రైవేటు చిట్ల కంపెనీలతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సంస్థల నుంచి ముడుపులు అందుతున్నాయని తెలు స్తోంది. దీనివల్లే ప్రై వేటు చిట్ కంపెనీలు నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నా ఒక్క సంస్థపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం చిట్లను తెరిచేటప్పుడే.. సభ్యుల జాబితా సమర్పించాలి. దీంతో పాటు చిట్లను ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీలు యథేచ్ఛగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా యి. చిట్ నిర్వహణలో ఖాతాదారుడు బయటికి వెళితే.. కొత్త ఖాతా దారుడిని చేర్చుకున్నా రిజిస్ట్రేషన్ శాఖకు తెలియజేయాలి. చిట్ కంపెనీలు ఇలాంటివేవి చేయడం లేదు. దీనిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీంతో చిట్ సంస్థ ఖాతాదారులు నిండా మునిగిపోతున్నారు. పత్రాలతో మాకు పనిలేదు భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో పత్రాలతో మాకు పనిలేదు. కేవలం 1బి చూస్తాం. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎవరి పేరున 1బీలో భూములు ఉంటే వారినే యజమానిగా రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈసీ, ఓసీలు ఉచితంగానే అందిస్తున్నాం. ఎక్కడగాని డబ్బులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్‌లో ఎవరైనా అవినీతికి పాల్పడినా, డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రమేష్‌బాబు, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
‘రిజిస్ట్రేషన్ల’ ఎఫ్ఎం నియామకం ఎప్పుడు?
⇒ ఫెసిలిటీ మేనేజర్ ఏర్పాటుపై ఆర్నెల్లుగా తాత్సారం ⇒ తాజాగా మరో కమిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఏటా రూ. 4 వేలకోట్ల ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఆరు నెలలుగా ఫెసిలిటీ మేనేజర్ (ఎఫ్ఎం) నియామకం అంతుచిక్కని ప్రశ్నగా తయారైంది. గతంలో ప్రభుత్వం ఎఫ్ఎంగా నియమించిన టీసీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టు 18న ముగిసింది. గత ఆరు నెలలుగా కొత్త ఫెసిలిటీ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించకపోవడంతో క్షేత్రస్థాయిలో సాంకేతిక వ్యవస్థలన్నీ బంద్ అయ్యాయి. కాంట్రాక్ట్ గడువు ముగిసినందున రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ సర్వీస్ ఇంజనీర్లను టీసీఎస్ వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆన్లైన్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కమిటీల ఏర్పాటుతోనే కాలయాపన: ఎఫ్ఎం నియామకానికి ఫైలును సిద్ధం చేసిన అధికారులు గత సెప్టెంబర్‌లో ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించారు. రిజిస్ట్రేసన్ల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, ఎఫ్ఎం నియామక ప్రక్రియ నిమిత్తం సెప్టెంబర్ 24న ఒక కమిటీని వేసి మిన్నకుండి పోయింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సబ్ రిజిస్ట్రార్ల నుంచి, రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే వినియోగదారుల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఎఫ్ఎం నియామక ప్రక్రియను త్వరితగతిన ముగించేందుకని గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన అంతర్ విభాగాల కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఐటీ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌ను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సర్వర్ సమస్యలతో ఎన్నో వెతలు: గత ఆరు నెలలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిరంతరం సర్వర్ డౌన్ అవుతుండటం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కేవలం పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్ డౌన్, నెట్వర్క్ సమస్యల కారణంగా గంటల కొద్దీ సమయం తీసుకుంటోంది. సమస్యలను పరిష్కరించేందుకు సర్వీస్ ఇంజనీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఫెసిలిటీ మేనేజర్ నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.