
సాక్షి, అమరావతి: అనధికారిక లే అవుట్లను రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతిచ్చిన లే అవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్టర్ చేయాలని తెలిపారు. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం రిజిస్టర్ చేయకూడదనే నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ నిబంధనల అమలులో ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు. డీఐజీలు తమ జిల్లాల్లో లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతి నెలా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ లే అవుట్లను రిజిష్టర్ చేయడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల కొన్నిచోట్ల ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో భూముల రీసర్వేపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో సభ్యులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక లేఅవుట్లపై సీరియస్‌గా స్పందించారు. మున్సిపల్ శాఖాధికారులు ఈ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు.