‘నిఘా’లోనూ అవినీతే!
- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో భారీగా అవినీతి
- అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారులు
- ఏళ్లకేళ్లుగా పాతుకుపోయి దందాలు
- పోస్టింగ్ కోసం లక్షలు కుమ్మరిస్తున్న వైనం
- విజిలెన్స్ విభాగంపై దృష్టి పెట్టిన ఏసీబీ
- ఇటీవలే రూ.లక్ష లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్‌వీవో
సాక్షి, హైదరాబాద్: అన్ని విభాగాలపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్ విభాగమే అవినీతికి ఆలవాలంగా మారుతోంది. కొందరు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తూ జేబులు నింపుకొంటున్నారు. దీనికి ఉదాహరణే నల్లగొండ రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ (ఆర్‌వీవో)భాస్కర్‌రావు ఏసీబీకి పట్టుబడడం. ఏళ్లకేళ్లుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పాతుకుపోతున్న ఇలాంటి అధికారులు.. ఇతర విభాగాల అధికారులతో కుమ్మక్కై దందాలు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి.
కష్టపడకుండానే సొమ్ములు: రైస్ మిల్లులు, తయారీ పరిశ్రమలు, చెక్‌పోస్టులు, అంతర్రాష్ట్ర సరిహద్దులు.. ఇలాంటి పన్నులు చెల్లించాల్సిన ప్రాంతాలు, సంస్థలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాల్సిన బాధ్యత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానిది. అంతేగాకుండా ప్రభుత్వం ఆదేశించే విచారణలను నిష్పక్షపాతంగా నిర్వహించి.. చర్యలకు సిఫార్సు చేయాలి. కానీ చాలా వరకు ఇందుకు భిన్నంగా జరుగుతోంది. విజిలెన్స్ విభాగం అంటేనే అవినీతి, అక్రమాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులు మోకరిల్లిపోతారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అధికారులు పెద్దగా కష్టపడకుండానే నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారు.
సాధారణంగా పన్ను వసూలు విషయంలో ప్రభుత్వం ఒక్కో ఆర్‌వీవోకు రూ.కోటి వరకు టార్గెట్ విధిస్తుంది. ఆయా రీజినల్ అధికారులు అందులో సగానికి పైగా రాబట్టగలిగినా ఆ అధికారి సమర్థుడని కితాబిస్తుంది. అయితే కొందరు అధికారులు.. ప్రభుత్వ టార్గెట్ పూర్తి చేయడంతోపాటు తమ ‘టార్గెట్’నూ పూర్తి చేసుకుంటున్నారు. వివిధ విభాగాల్లో అధికారులపై వచ్చే ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఇలాంటి ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు కూడా.
పోస్టింగ్ కోసం రూ.లక్షల్లో..
సాధారణంగా విజిలెన్స్ అనగానే పెద్దగా ప్రాచుర్యం లేని పోస్టింగని భావిస్తుంటారు. కానీ ఈ విభాగంలో పనిచేస్తున్న అధికారులు రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యాన్ని సైబరాబాద్ కమిషనర్ పట్టుకున్న సమయంలో.. విజిలెన్స్ అధికారుల బండారం బయటపడింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో కుమ్మక్కైనట్లు తేలింది. ఇలా అన్ని బ్లాక్ మార్కెట్ దందాల వెనుక కొంత మంది విజిలెన్స్ అధికారులు ఉన్నారని... నాలుగైదేళ్లుగా అదే విభాగంలో పాతుకుపోయారని తెలిసింది. వీరిలో నలుగురు డీఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ ర్యాంకు అధికారి ఏకంగా ప్రభుత్వ పెద్దల వద్ద లక్షలు కుమ్మరించి పోస్టింగులు పొందినట్టు ఆరోపణలున్నాయి.
ఏసీబీ దూకుడు..
వ్యవస్థలపై పటిష్టమైన నిఘా పెట్టాల్సిన విభాగం విజిలెన్స్ కాగా.. అవినీతిపై యుద్ధం చేసే విభాగం ఏసీబీ. నిఘా విభాగంలోనే అవినీతి రాజ్యమేలితే వ్యవస్థలన్నీ దెబ్బతింటాయనే అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బాగోతంపై ఏసీబీ మరింత దూకుడుగా వ్యవరించనున్నట్టు తెలిసింది. నెలరోజులుగా విజిలెన్స్ విభాగంపై దృష్టి కేంద్రీకరించిన ఏసీబీ... మరికొంత మంది అధికారుల అవినీతిపై కొరడా ఝళిపించనున్నట్టు తెలిసింది.