నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతున్న పోలీసులు అధికారులు
కర్నూలు (టౌన్): ‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ.. విజయవాడ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అవినీతి కార్యకలాపాల చిట్టా మా వద్ద ఉంది. మీపై ఫిర్యాదులొస్తున్నాయి. కేసులు నమోదు చేయాల్సి ఉంటుందం’టూ ఫోన్లలో బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్న ముఠాలో అరుగురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, కర్నూలు టౌన్ ఇన్‌చార్జ్ డీఎస్పీ వెంకటరామయ్య బుధవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు.
వెలుగులోకి వచ్చిందిలా...
కర్నూలు నగరంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసే ఓ అధికారికి ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై సదరు అధికారి కర్నూలు 2 వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ మహేశ్వరరెడ్డి ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
పట్టుకున్నారిలా..
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల ఫోన్ కాల్స్, ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. వాటి ఆధారంగా నిఘా పెట్టి కర్ణాటక రాష్ట్రం హోసూరు వద్ద ఇద్దరిని, అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద నలుగురిని ఫోన్ కాల్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు జయకృష్ణ (ఏ–1), ఉదయ్‌కుమార్ (ఏ–8) కోసం ప్రత్యేక బృందాలçను నియమించామని పోలీసు అధికారులు వెల్లడించారు.
కీలక శాఖల అధికారులే టార్గెట్
ముఠా సభ్యులు రాష్ట్రంలో కీలక శాఖల అధికారులను టార్గెట్ చేశారు. మైనింగ్‌శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, ఫ్యాక్టరీలు, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. దాదాపు 70 నుంచి 80 మంది అధికారులను బెదిరించారు. వైజాగ్, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలోని కొందరు అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కాగా ఇప్పటి వరకు నిందితులు బెదిరింపుల ద్వారా అధికారుల నుంచి రూ. 14.34 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందన
కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఛేదించిన కర్నూలు టూటౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్, పోలీసు సిబ్బంది మహీంద్ర, ప్రియకుమార్, రవిలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.
ముఠాలో అందరూ పాత నేరస్తులే
ఏసీబీ పేరు చెప్పి అధికారుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిన వారంతా పాత నేరస్తులే. వివిధ కేసుల్లో పట్టుబడి జైలుకెళ్లారు. అక్కడ ఒకరినొకరు పరిచయం పెంచుకుని జత కట్టారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తరువాత బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఇందుకు కర్ణాటకలో 6 సిమ్ కార్డులు తెప్పించుకుని అందులో 3 సిమ్ కార్డుల ద్వారా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఠాలో అత్యధికంగా రేప్‌కేసుల్లో పట్టుబడిన నిందితులే ఉన్నారు. పట్టుబడిన వారిలో ఏ–1 గా ఉన్న జయకృష్ణ అనంతపురం 3 వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయ్యాడు. రెడ్డిపల్లి జిల్లా జైలులో శిక్ష అనుభవించాడు.
అలాగే ఏ–2 తమిటిగొల్ల గంగాధర్ కదిరి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికను రేప్ చేసిన కేసులో పట్టుబడ్డాడు. ఏ–3 జోలదరాశి సాల్మన్ రాజు కణేకల్లు పోలీసు స్టేషన్‌లో బాలికను రేప్ చేసిన కేసులో నిందితుడు. ఏ–4 బొడ్డు సాయికుమార్ బత్తల పల్లి పోలీసు స్టేషన్‌లో అమ్మాయి కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యాడు. ఏ–5 నారాయణస్వామి హిందూపురం 2 వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికను రేప్ చేసిన కేసులో జైల్ కెళ్లాడు. ఏ–6 హోసురు నారాయణప్ప గోవిందరాజులు అనంతపురం 3 వ పట్టణ పోలీసు స్టేషన్‌లో 354 కేసులో అరెస్టు అయ్యాడు. ఏ–7 హోసూరు గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్, ఏ–8 ఉదయ్‌కుమార్ ఇతర నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించారు. రెడ్డి పల్లి జిల్లా జైలులో ఉన్న సమయంలో ఏ1 నిందితుడు జయకృష్ణతో మిగతా నిందితులకు పరిచయం ఏర్పడింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని వారంతా నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment