అధికారులపై దాడులు కొత్త కాదు: అశోక్‌బాబు
హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరగలేదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అశోక్‌బాబు అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలో దాడికి గురైన తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ అందిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఉద్యోగులపై దాడులు కొత్తగా జరుగుతున్నవి కాదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని, వనజాక్షికి బెదిరింపు లేఖ ఎలా వచ్చిందో? దాని వెనుక రాజకీయంగా ఎవరున్నారో విచారణలో తేలుతుందంటూ టీడీపీ సర్కారును అశోక్‌బాబు వెనకేసుకొచ్చారు.
కాగా, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ, గుంటూరు తహసీల్దారుపై దాడి నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆర్థిక మంత్రి, సీఎం పేషీలోని ముఖ్య కార్యదర్శిని కలిసి చర్చించారు.