సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నూతన ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు జరిగిన నేపథ్యంలో ఇక బదిలీల ప్రక్రియకు తెర లేవనుంది. జిల్లా పాలనపై సర్కారు మార్కు పడనుంది. సుమారు నాలుగైదు మాసాల క్రితం జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీసు, రెవెన్యూ అధికారులు తిరిగి జిల్లాకు రానున్నారు. 33 మంది సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు, 37 మంది రెవె న్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లారు. నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి జిల్లా కు వచ్చిన అధికారులు సైతం తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల్లో పలువురు బదిలీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. రెం డు, మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
నెలాఖరు వరకు ఈ జాతర కొనసాగనుంది.జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో బదిలీలు, నియామకాలపై వివిధ ప్రభుత్వ శాఖ ల అధికారుల్లో అలజడి మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఐదు నెలల క్రితం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో తిరిగి ఆ అధికారులు జిల్లాలో కోరుకున్నచోట పోస్టింగ్ కోసం పైరవీల బాట పట్టారు. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, విద్య, పోలీసు, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సహా అన్ని ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరగవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బదిలీల ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పలువురు అధికారులు, ఉద్యోగులు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీడీవోలు, తహశీల్దార్లతో పాటు వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నందున వారు సైతం కోరుకున్న స్థానం కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా రెండు రోజుల్లో బదిలీల ఉత్తర్వుల పరంపర మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నేతలు, సహచర శాసనసభ్యులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఇక బదిలీల జాతర!
Published Fri, Jun 6 2014 3:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement